భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు

– సీఎం రేవంత్‌ రెడ్డికి ఆర్‌యూపీపీ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భాషా పండితుల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యుపీపీ-టీఎస్‌) ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు జగదీష్‌, కార్యదర్శి నర్సింహులు, హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, విజరు కుమార్‌ (నాగర్‌ కర్నూల్‌ జిల్లా) ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డిని కలిసి దశాబ్దాల తమ కల నెరవేర్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 8,630 మంది భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు వచ్చాయని చెప్పారు. అడెక్వెసి బ్యాక్‌లాగ్‌ కారణంగా పదోన్నతులు రానటువంటి భాషాపండితులకు భవిష్యత్‌లో భాషాపండితులుగా నియామకమయ్యేవారు ఎవరూ లేనందున బ్యాక్‌లాగ్‌ పోస్టులను సాధారణ పోస్టులుగా మార్చి పదోన్నతులు కల్పించాలని కోరారు.
అప్‌గ్రేడ్‌ కాకుండా మిగిలిపోయిన వెయ్యి మంది భాషా పండిత పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ భాషలుగా అప్‌గ్రేడ్‌ చేసి పండిత వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దు చేయాలనీ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు, బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. భాషా పండితులకు స్కూల్‌ సిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు- తెలంగాణ (ఆర్‌యుపీపీటీ) ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ రెడ్డిని ఆ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, కోశాధికారి వి.ఎస్‌.ఎస్‌.సి.శర్మ, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు హమీద్‌ ఖాన్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.