పచ్చని కాపురాన్ని చిదిమేసిన మద్యం

– ముగ్గురు పిల్లలతో కలిసి మానేరులో దూకిన మహిళ
– మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు
– భర్త మద్యానికి బానిసయ్యాడని..
– రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
పచ్చని కాపురాన్ని మద్యం కూల్చేసింది.. మతాలు వేరైనా వాళ్లను పెండ్లితో ఒక్కటి చేసిన ప్రేమను చిదిమేసింది. నలుగురి ప్రాణం తీసింది. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న ఇంటి పెద్ద మద్యానికి బానిసవ్వడం.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతోపాటు.. అతనిలో మార్పు లేకపోగా.. తాను బతికుండగానే పట్టించుకోని భర్త తాను పోయాక పిల్లలను ఏం చూసుకుంటాడని మనస్తాపం చెందిన ఇల్లాలు.. ముగ్గురు పిల్లలు సహా తానూ మధ్యమానేరు డ్యామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలోని మిడ్‌మానేరులో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వేములవాడ మండలం రుద్రవరానికి చెందిన రజిత, కరీంనగర్‌కు చెందిన మహమూద్‌ అలీ పదేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఆయాన్‌(7), కుమార్తె అసరజా(5), 14నెలల పసికందు ఉన్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న మహమ్మద్‌ అలీ మద్యానికి బానిసయ్యాడు. క్రమంగా ఆర్థిక ఇబ్బందులూ ఎదురై కుటుంబంలో కలతలు తీవ్రమయ్యాయి. దీంతో రజిత పలుమార్లు భర్తను హెచ్చరించింది.. పంచాయితీ కూడా పెట్టించింది. అయినా అతని తీరు మారలేదు. చివరికి ఠాణా మెట్లు కూడా ఎక్కింది. ఈ నెల 27న భార్యాభర్తలిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సర్దిజెప్పి పంపించారు. అయినా అలీ తాగుడు మానలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రజిత చనిపోవాలని నిర్ణయించుకుంది. ముగ్గురు పిల్లలనూ తీసుకుని వేములవాడ నుంచి బోయిన్‌పల్లి మండలం శాత్రాజుపల్లి వద్ద మధ్యమానేరు డ్యామ్‌ వద్దకు చేరుకుంది. డ్యామ్‌లో ముగ్గురు పిల్లలతోపాటు తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రానికి నలుగురి మృతదేహాలు నీటిపై తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్యామ్‌ నుంచి మృతదేహాలను పోలీసులు వెలికి తీయించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.