ఏటూరునాగారంలో మద్యం దోపిడి

– అడ్డగోలుగా వసూలు
– ఒక్కో క్వార్టర్‌ సీసా పై 20 రూపాయల బాదుడు
– బెల్ట్‌ షాపులతో యాజమాన్యానికి కోట్ల ఆదాయం
– మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు
– చేతులెత్తేసిన పోలీస్‌ శాఖ
నవతెలంగాణ- ఏటూర్‌నాగారం ఐటిడిఏ
    ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మద్యం షాపుల్లో మద్యం ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అడ్డగోలుగా వేల రూపాయలు వసూలు చేస్తూ వైన్‌షాపులో యాజమాన్యం కోట్ల రూపాయలను అందిస్తున్నారు. సిండికేట్‌ నెపంతో బెల్ట్‌ షాపులపై దందా కొనసాగిస్తూ వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. మొత్తం నాలుగు షాపులకు గాను మూడు షాపులు ఏటూరునాగారం సమీపంలో కొనసాగగా, ఒక షాపును మాత్రం బెల్ట్‌ షాప్‌ దంతా……. కోసమే మండలంలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో వైన్స్‌ యజమాన్యం ఏర్పాటు చేశారు. ఏటూరునాగారంలో ఏర్పాటైన మూడు షాపుల్లో రెండు షాపులను బెల్టు షాపులకు కేటాయించి ఒక షాపును మాత్రమే రిటైల్‌ గా ఏర్పాటు చేశారు. రాంనగర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మద్యం షాపు నుండి మంగపేట మండలానికి సంబంధించిన బెల్ట్‌ షాపులన్ని ఈ షాపులోనే మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు గతంలో మంగపేట నుండి ఏటూరునాగారం రావడానికి బెల్ట్‌ షాపు నిర్వాహకులు ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తించిన యాజమాన్యం రహస్యంగా మధ్యాహ్నం తరలించేందుకు వారికి ప్రత్యేకంగా రామ్‌నగర్‌ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈషాపు నుండి ప్రతిరోజు లక్షల రూపాయల మద్యం మంగపేట మండలానికి చేరుకుంటుంది. ఇక ఎటూరు నాగారంలో ఉన్న రెండు బెల్ట్‌షాపుల నుండి ఈ మండలంలోని అన్ని బెల్ట్‌ షాపులకు మద్యం పంపిణీ అవుతుంది. మంగపేట, ఏటుర్‌నాగారం మండలాల్లో వాడకొక బెల్ట్‌షాప్‌ ఏర్పాటు కాగా 80 శాతం మద్యం ఈబెల్ట్‌ షాపులకే చేరవేస్తున్నారు. రిటైల్‌ షాపుల్లో దొరకని మద్యం బెల్టు షాపుల్లో దొరుకుతుంది. అంటే వైన్స్‌ యాజమాన్యం ఎంత అడ్డగోలు వ్యాపారానికి ఒడిగడుతుందో తెలుస్తుంది.
ఒక్కో క్వార్టర్‌ సీసా పై 20 రూపాయల వసూలు
బెల్ట్‌ షాపులకు పంపిణీ చేసే మద్యంపై వైన్స్‌ యాజమాన్యానికి లాభం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. రోజుకు లక్షల రూపాయల మద్యం బెల్ట్‌ షాపుల ద్వారానే అమ్మకాలు జరుగు తున్నాయి. కేవలం ప్రభుత్వం విధించిన ఎమ్మార్పీ ధరల కంటే ఐదు శాతం మాత్రమే వసూలు చేస్తు న్నామని యాజమాన్యం ప్రజలను మభ్యపెడుతూ అక్రమ సంపాదనకు ఒడిగట్టారు. వాటాలుగా పెట్టుబడి పెట్టిన యాజమాన్యం ఎవరు పెట్టుబడి ఎక్కువ ఉంటే అతడే రాజు. అతను ఎంత చెబితే అంతకు మద్యాన్ని అమ్మాల్సిందే. ప్రభుత్వం మద్యంపై విధించిన ఎమ్మార్పీ ధరల కంటే షాపుల్లో ఒక్కొక్క క్వార్టర్‌ సీసాపై అదనంగా 20 రూపాయలు పెంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. దీంతో బెల్ట్‌ షాపు నిర్వాహకులు తలలు బాదుకుంటున్నారు. ఎవరైనా నిర్వాహకులు యాజమాన్యం నిలదీస్తే అతనికి మద్యాన్ని ఇవ్వడం లేదని తెలిసింది. దాంతో యాజమాన్యం ఎంత చెప్తే అంత పెట్టి షాప్‌ నిర్వాV ాకులు కొనుగోలు చేయడం తప్పడం లేదు. ఇక 20 రూపాయలు అదనంగా పెట్టి ఉన్న నిర్వాహకులు వాళ్ళ బెల్టు షాపుల్లో మరో 20 పెంచి విక్రయాలు జరపడంతో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పొద్దంతా కాయకష్టం చేసి సంపాదించిన సొమ్ము మందుకే పెట్టడంతో ఇల్లు ఒళ్ళు గుల్లవుతున్నాయని పేద కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు
మద్యంపై నిబంధనలు విధించాల్సిన ఎక్సైజ్‌శాఖ అధికారులు వైన్స్‌ యాజమాన్యానికి మేమున్నాము. మీరుధైర్యంగా అమ్ముకోండి భరోసా ఇవ్వడంతోనే వైన్స్‌ యాజమాన్యం అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రతిరోజు ప్రతినెలా అక్రమ మద్యంపై నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు వైన్స్‌ యాజమాన్యం ప్రతినెలా ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడడంతో మద్యం ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారుల ముందు నుండి కూడా అక్రమంగా మద్యం మంగపేట మండలానికి తరలిపోతున్న మాకెందుకులే అన్నట్లుగా నిమ్మకునీరెత్తినట్లు ఎక్సైజ్‌ శాఖ వ్యవహరిస్తుంది. వైన్స్‌ యాజమాన్యం సలహాలతో గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని తెలుస్తున్నది. ఎందుకంటే గుడుంబా వ్యాపారం కొనసాగితే బెల్ట్‌ షాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగవని వైన్స్‌ యాజమాన్యం, అధికారులతో కుమ్మక్కై మద్యం వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి.
పోలీసులు ఉన్నా లేనట్లే..!
అవినీతి, అక్రమాలను, అక్రమ వ్యాపారాలను అరికట్టాల్సిన పోలీసులు కూడా చేతులెత్తేయడంతో మండలంలో మద్యం దందా జోరుగా కొనసాగుతుంది. బెల్ట్‌ షాపులకు వైన్‌షాపుల నుండి మద్యం జోరుగా కొనసాగుతున్న పోలీస్‌ శాఖ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది .ఇప్పటికైనా పోలీస్‌శాఖ స్పందించి మద్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని, బెల్ట్‌ షాపుల్లో పెరిగిన రేట్లు నియంత్రించాలని ప్రజలు వేడుకుంటున్నారు.