బడిగోస వినండి సారూ!

బడిగోస వినండి సారూ!‘నువ్వు గౌరవించే స్థాయి నుంచి.. నిన్ను గౌరవించే స్థాయికి చేర్చేదే చదువు…’ బడులు ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌ల్లో ఇదొకటి. నిజమే మరి… ఒక వ్యక్తిని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతోపాటు ఇతరత్రా అనేకాంశాల్లో సమున్నతంగా నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యాలున్న ఏకైక సాధనం చదువు. అందుకే విద్యావేత్తలు, ఆ రంగానికి చెందిన నిపుణులు… ‘విద్యపై పెట్టే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా, భావితరాలకు పెట్టుబడిగా భావించాలి…’ అని చెబుతూ ఉంటారు. పాలకులు కూడా ‘ఇవే పదాలను’ నొక్కి వక్కాణిస్తూంటారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌ కూడా ఆ విషయా న్ని పునరుద్ఘాటించారు. అయితే పెద్దలు చెప్పిన అతి కీలకమైన ఆ అంశాన్ని అమలు చేసి చూప టంలోనూ, అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందిం చటంలోనూ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు, పాలకులు ప్రచారంపై చూపెడుతున్న శ్రద్ధ ఆచరణలో కానరాకపోవటం శోచనీయం.
విద్యపై పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పినప్పుడు ఆ మేరకు ఆ రంగానికి వెచ్చించే నిధులను పెంచాలి. ఇప్పుడు దేశంలో ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లోని బడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. కారణమేమంటే ఢిల్లీ ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్‌లో 24.5 శాతాన్ని, కేరళ సర్కారు 23 శాతం నిధులను విద్యా రంగానికే కేటాయిస్తున్నాయి. కానీ మన దగ్గర ఆ శాతం 7.6కే పరిమితమైంది. అది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకే. అంతకుముందు బీఆర్‌ఎస్‌ హయాంలో ఇది కేవలం 6.5 శాతంగానే ఉండటం గమనార్హం. గత కేసీఆర్‌ సర్కారు… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ఏర్పాటుకు కొంత కృషి చేసిన మాట వాస్తవమే. ఆ మేరకు కొన్ని మంచి ఫలితాలు కూడా వచ్చాయి. కానీ సొంత భవనాలు లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో వందలాది రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయటంతో… ఆ కృషి ‘రాజకీయ ప్రయోజనాల కోసమే’ అనే విమర్శలకు తావిచ్చింది. మూసేసిన ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో గురుకులాలను ఏర్పాటు చేయటం, వాటికి నెలకు రూ. లక్షల్లో అద్దెలు చెల్లించాల్సి రావటంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. అలా కిరాయికి తీసుకున్న చాలీచాలని ఒక్కో బిల్డింగులో వందలాది మంది పిల్లల్ని కుక్కటంతో వారు పడ్డ, పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ చొరవ తీసుకుని గురుకులాలకు సొంత భవనాలు నిర్మిస్తామనటం హర్షణీయం.
ఇది గురుకులాల గోస అయితే ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల బాధ మరింత వర్ణనాతీతం. పిల్లలకు గత కొన్నేండ్ల నుంచి స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెట్టడం ముదావహం. కానీ సంబంధిత బడ్జెట్‌ను పెంచకపో వటంతో వారికి పౌష్టికాహారం అందటం లేదు. బడులు ప్రారంభమైన బుధవారమే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు అందించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించాల్సిందే. కాకపోతే యూనిఫారాలు ఇంకా ‘కుట్టు’ దశలోనే ఉండటం గమనార్హం. మరోవైపు డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉండటంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. విద్యా బోధన, పిల్లల చదువుపై ఆ ప్రభావం కొట్టొచ్చినట్టు కనబడటం విస్మయకరం. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే అందులో 26 జిల్లాల్లో పూర్తి స్థాయి డీఈవోలు లేరంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ 26 చోట్లా ఎఫ్‌ఏసీలతో బండి లాగించేస్తున్నారు. ఇక డిప్యూటీ డీఈవోల సంగతి సరేసరి. 33 జిల్లాలకు 33 జిల్లాల్లోనూ డిప్యూటీ డీఈవోలు లేకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. రాష్ట్రంలో 615 మండలాలుంటే కేవలం 17 మండలాలకే రెగ్యులర్‌ ఎంఈవోలుండటం విద్యారంగం పట్ల పాలకుల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఈ సమస్యలు చాలవన్నట్టు అనేక బడుల్లో పిల్లలు, ఉపాధ్యాయుల నిష్పత్తి కూడా అసం బద్ధంగా ఉంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట టీచర్ల సంఖ్య తక్కువగానూ, టీచర్లు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటమ నేది ఏండ్ల తరబడిగా కొనసాగుతున్న తంతు. వెరసి… సర్కారు బడుల మీద ఆధారపడే పేద పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది.
‘దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలోనే నిర్దేశించబడుతుంది…’ అన్నారు మన పెద్ద లు. అంతటి కీలకమైన తరగతి గది, ముఖ్యం గా సర్కారు బడుల్లోని తరగతి గదులు.. పిల్లలతో కళకళలాడాలన్నా, వారికి అక్కడ నాణ్యమైన విద్య అందాలన్నా… ప్రభుత్వ చిత్త శుద్ధి ఎంతో అవసరం. ఆ రంగానికి అధిక నిధులను కేటాయించడమే ఆ చిత్తశుద్ధి. దాన్ని ప్రదర్శించటంతోపాటు నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రయివేటు, కార్పొరేట్‌ మోజు నుంచి తల్లిదండ్రులను బయటపడే యగలం. ఇది జరిగితేనే ప్రభు త్వ పాఠశాలల పట్ల వారిలో విశ్వాసాన్ని ప్రోది చేయగలం.