విన్నపాలు వినవలె..

Please listen..– సీఎంకు వినతుల వెల్లువ
– ప్రజా దర్బార్‌ కిటకిట
– వికలాంగులకు ప్రాధాన్యతనిచ్చిన రేవంత్‌
– సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ
– మంచినీరు, టెంట్లు తదితర ఏర్పాట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తొలిరోజు ప్రజాదర్బార్‌ కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలొచ్చిన ప్రజానీకంతో హైదరాబాద్‌ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ (నిన్నటి వరకూ ప్రగతి భవన్‌) కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజైన శుక్రవారం నిర్వహించిన ఈ దర్బార్‌కు విశేష స్పందన లభించింది. ఉదయం 7 గంటల నుంచే జనం పెద్ద ఎత్తున తరలొచ్చారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలతో వారు క్యూ లైన్లలో నిలబడ్డారు. 9.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి… మొదటగా వికలాంగులకు ప్రాధాన్యతనిచ్చారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామంటూ హామీనిచ్చారు. ఉదయం 11.15 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు. సీఎంతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాసరెడ్డి తదితరులు దర్బార్‌లో ఉన్నారు. అనంతరం సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశాల కోసం ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత సీతక్క… ప్రతి ఒక్కరి నుంచీ వినతిపత్రాలను స్వీకరించారు. మరోవైపు ప్రజా దర్బార్‌ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎమ్‌డీ దానకిశోర్‌, జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ తదితర అధికారులు ప్రజాదర్బార్‌ నిర్వహణను సమన్వయం చేశారు.
రిజిస్ట్రేషన్లకు 15 ప్రత్యేక డెస్కులు…
గ్రీవెన్సు రిజిస్ట్రేషన్లకు ప్రత్యేకంగా 15 డెస్కులను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ విజ్ఞాపన పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసి, ప్రత్యేక గ్రీవెన్స్‌ నెంబరును కేటాయించారు. దరఖాస్తుదారులకు ప్రింటెడ్‌ ఎకనాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వటంతోపాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా పంపే ఏర్పాటు చేశారు.
కుర్చీలు, ఇతర సౌకర్యాలు…
ప్రజా దర్బార్‌ కోసం వచ్చే ప్రజలు కూర్చోవటానికి వీలుగా లోపల 320 కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. బయట క్యూ లైన్లను, ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లను, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
పలువురి ఆందోళన…
సీఎం ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజాదర్బార్‌ను నిర్వహించటంతో అధికారులు తమ శక్తి మేరకు ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి. దర్బార్‌ లోపలికి వెళ్లేందుకు తమకు అనుమతినియ్యలేదంటూ కొందరు మహిళలు ప్రజా భవన్‌ ముందు ఆందోళనకు దిగారు. చాలా దూరంలో ఉన్న జిల్లాల నుంచి తాము సీఎంకు వినతిపత్రాలు ఇవ్వటానికి వస్తే సమయం లేదంటూ తిప్పి పంపటమేంటని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘మొదటి రోజు కాబట్టి… కొంత అసౌకర్యం కలిగింది. మున్ముందు ఇలాంటివి జరక్కుండా చూసుకుంటాం…’ అని పోలీసులు వారికి సర్ది చెప్పారు. వచ్చిన దరఖాస్తుల్లో పింఛన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, విద్య, వైద్య సహాయాలు తదితరాంశాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
రోజుకో మంత్రి..ఎమ్మెల్యే… జిల్లాకో అధికారి : సీఎం రేవంత్‌ నిర్ణయం
ప్రజా దర్బార్‌ తొలి రోజు అనుభవంతో సీఎం రేవంత్‌… ఆ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోబుతున్నట్టు సమాచారం. తాము ఊహించిన దానికంటే ఎక్కువగా, అంచనాలకు మించి దర్బార్‌కు జనం వచ్చారని ఆయన అధికారులతో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో దర్బార్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అది సజావుగా కొనసాగేలా చూడాలంటూ వారిని ఆయన ఆదేశించారు. వినతుల స్వీకరణ, సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకోకుండా, సులభంగా ఉండేందుకు వీలుగా రోజుకో మంత్రి, ఎమ్మెల్యే దర్బార్‌లో ఉండేలా నిర్ణయించాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు జిల్లాల వారీగా దరఖాస్తుదారులను, వారి అర్జీలను విడగొట్టి.. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించేందుకు ఆయన కసరత్తు చేయాలంటూ ఉన్నతాధికారులకు సూచించారు. తద్వారా త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరమయ్యేలా చూడాలంటూ ఆదేశించారు.