తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగం – తీరూ దారీ!

Literary and cultural sector of Telangana - Thiru Dari!మనకేం కావాలో ఎరుక కలిగి వుండటం, కావాల్సిన దానికోసం నిర్విరామంగా కృషి చేయటం అనేది మన సాంస్కృతిక, సామాజిక స్థాయిపైన ఆధారపడి వుంటుంది. ఇప్పటికీ శాశ్విత ప్రాతిపదికన మనం ఒనగూర్చుకోవాల్సిన వాటిపైన చర్చ కూడా జరుపుకోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దం గడిచింది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రత్యేకతలపైన, రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో ప్రస్తావనలు చేశాం. ఘనమైన సాంస్కృతిక చరిత్రపై విశ్లేషణలు చేశాం. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న కలల్ని కలబోసుకున్నాం. పాల్కురికి సోమన సహజ పదసంపదల సొగసును, పోతనామాత్యుని మధుర కవితాసుధను, రామదాసు భక్తి సంకీర్తనలను, హరిభట్టు కవన కళను, చందాల కేశవదాసు సినీ ఆరంభగీతాల పరంపరను మననం చేసుకుని మురిసాము. ఆధునిక చైతన్య సాహితీమూర్తులు మఖ్దూం, దాశరథి, కాళోజి, వట్టికోట, సుద్దాల, సురంవరం, సి.నా.రె. మొదలైన వారి అడుగుజాడలలో తెలంగాణ సాహితీ మాగాణం వెలుగులు విరజిమ్ముతుందని సగర్వంగా సంబరాలు చేసుకున్నాం. జానపద కళా సంగీతాలకు నెలవైన నేలలోని సాంస్కృతిక వైభవాన్ని చరిత్రగా భావితరాలకు అందించాలని, ప్రజలు కేంద్రంగా భాషను, సాహిత్యాన్ని ప్రజాస్వామ్యీకరించుకోవాలని భావించుకున్నాం. మరీ ముఖ్యంగా తెలంగాణ భాషా సంపదను భద్రపరిచే పనికి పూనుకోవాలని కోరుకున్నాం. ప్రజల భాషలో పాలన సాగటమే నిజమైన ప్రజాస్వామ్యం. అప్పుడే పాలనలో ప్రజలు భాగస్వాములవటానికి అవకాశం ఏర్పడుతుంది. చదువుల్లో మన తెలుగు వెలగాలని, భాషాభివృద్ధికి బాటలు ఏర్పడాలని కోరుకున్నాం.
ఎన్నెన్నో అనుకున్నాం. ఇంకా నిర్మాణాత్మకంగా పనులు చేపట్టలేక పోయాం. చరిత్ర ఘనతను చెప్పుకోవటం సరే, వర్తమానం, భవిష్యత్తును తీర్చుకోవాల్సిన అవసరం ఇంకెంతో వుంది. ఈ నేలలోని సామాన్య జనుల నిత్య శ్రమలలోంచి పుట్టిన పాటలు, కళలు, పదాలు, వాయిద్యాలు, నృత్యాలు మనమింకా రికార్డు చేయవలసే వున్నది. జానపదాలను ప్రజాకళగా తీర్చిన సాంస్కృతిక యోధుల చరిత్రను మన ముందు తరాలకు అందించాల్చి వుంది. మన భాష, కళలు, సమూహపు జనితాలు. అవి మన వారసత్వాలు. బడి నుండే ఆ పరంపర కొనసాగాలి. అందుకు ఒక సమగ్ర శాస్త్రీయ ప్రణాళిక కావాలి.
సజ్జ జొన్న కూడుతో, గంజి, నూకలన్నాలతో బతుకు నడిపిన గరుకు నేల ఇది. అక్షరాల తెలివికన్నా, లక్షలాది జీవనానుభవాల జ్ఞానమున్న నేల. ఇక్కడ కష్టానికి వెనుకడుగేయని కండ, గొంతు విప్పేందుకు వెనుకాడని గుండె గల జనుల సమూహం ఇది. అందుకే చైతన్యానికి మారుపేరుగా, ధిక్కార స్వరానికి ఆనవాలుగా నిలిచింది. ఇక్కడ పాటల జలపాతాలుంటాయి. కవన పూదోటలుంటాయి. కళలు కంజిర నాదాలు, కొండలు, కోయిల రేలా కోరస్‌లు ధ్వనిస్తాయి. పనికి, కళకు కలలకు, సంబంధాలు, అనుబంధాలు అన్నింటినీ అక్కున చేర్చుకోవాల్సిన తరుణమిది. ఎక్కడ పదిమంది వున్నా అందులో ఒక పాట పాడే వాడుంటాడు. పద్యం రాసే వాడుంటాడు. కవులకు కరువులేని నేల, సామాజిక స్పృహ కలిగిన కవనధార విరివిగా కొనసాగుతుంది. సృజనశీలత కళాసమూహాలను సమాదరించే వేదికలు ఊరూరా వెలయాలి. ఇక్కడి చరిత్ర, సంస్కృతి వికాసాల పరిణామాల అధ్యయనానికి కేంద్రాలు తెరవాలి. ప్రభుత్వాలు ఒక సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమీ జరగలేదని అనలేం. కానీ సాహిత్య, సాంస్కృతిక రంగానికి సంబంధించి నిర్మాణాత్మక కృషిని కొనసాగించాల్సిన అవసరం చాలా వుంది. కేవలం రాజధానిలోనే కాదు, ప్రతి జిల్లా కేంద్రంలో కవులకు, కళాకారులకు సభా మందిరాలు నిర్మించాలి. సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణకు గర్వకారణంగా నిలచిన కవులు, రచయితలు, కళాకారుల జన్మ స్థలాలను వారి పేర సాంస్కృతిక కేంద్రాలుగా, సాహిత్య శాలలుగా అభివృద్ధి పరచాలి. ఔత్సాహికులకు కార్యశాలలు నిర్వహించాలి. ప్రదర్శనలకు చేయూతనివ్వాలి. సాహితీకారుల రచనలను ప్రభుత్వమే వెలుగులోకి తేవాలి. సాహిత్య అధ్యయనానికి, చర్చలకు గ్రంథాలయాలను అభివృద్ధి పరచాలి.
గ్రంథాలయాలను బలోపేతం చేసి, యువతరానికి అవసరమైన విజ్ఞాన సముపార్జనకు అనువుగా తీర్చిదిద్దాలి. ఇప్పటికీ గ్రంథాలయాలు చిన్నచూపు చూడబడుతున్నాయి. నిధులకేటాయింపులు, పుస్తకాల కొనుగోళ్లు జరగడం లేదు. విజ్ఞాన, సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా గ్రంథాలయాలు ఎదిగితేనే భావితరాలకు మేలు జరుగుతుంది.
ఇక ఇతిహాసపు చీకటి కోణాలలో… అట్టడుగున పడి కనిపించని కథలను, చరిత్రను వెలికితీయాలి. ఎంతోమంది యోధులు, వీరులు, సంఘ సంస్కర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సమాజం కోసం పాటుపడిన వారున్నారు. వారి కథలను మన తరాలకందించాలి. ఎందుకంటే నేడు మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే శక్తులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు పాశ్చాత్య సంస్కృతి దాడి చేస్తున్నది. వ్యాపార సంస్కృతి పెరిగి మానవీయతను విధ్వంసమొనరిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా ఒక సాంస్కృతికోద్యమం నడపవలసి వున్నది. ఇందుకు సాహిత్యం, కళ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నేటి చైతన్యయుతమైన జ్ఞాన తెలంగాణను నిర్మించుకోవటం మనముందున్న కర్తవ్యం.
అంతేకాని అకాడమీలు, అవార్డులు, రివార్డులు, సన్మానాల వరకే పరిమితమై, వ్యక్తుల చుట్టూ తిరగకూడదు. కళను, కళాకారులను, సృజనకారులను కేవలం ప్రచారకులుగా పరిగణించకూడదు. సామాజిక హృదయ స్పందనలను వినిపించే గొంతుకలు గల రచయితలను మనం వినాలి. నేడు అణగారిన వర్గాల నుండి అనేకులు కళాసాహితీ రంగంలోకి విరివిగా వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు తమపై జరుగుతున్న వివక్షతలపై కలాలు ఎక్కుపెడుతున్నారు. యువత ముందుకొస్తున్నారు. వీరి రచనలను వెలుగులోకి తేవాలి. సమాజంలో మైనారిటీ సమూహాలు తీవ్రమైన ఒత్తిడి, భయాలకు గురవుతున్న పరిస్థితిని రచనల రూపంలో వెల్లడిస్తున్నారు. వీటన్నింటినీ విని అవగాహన చేసుకోవటం మనందరి బాధ్యత. బాధలను, గాధలను వినగలిగే సంస్కృతిని నిర్మించాలి. సమాజ చైతన్యం కోసం పనిచేస్తున్న సాహితీ, సాంస్కృతిక సంస్థలు, వ్యక్తులు, శక్తులు తెలంగాణలో అనేకమున్నాయి. వాటినన్నింటినీ సమన్వయపరచి, ఒక సామరస్య మానవతా గీతికను సృజించగలగాలి. అందుకు ఒక ప్రణాళికను వేసి ఆరంభించుకోవాలి.
– కె.ఆనందాచారి, 9948787660