అమృతా ప్రీతం: సాహిత్య జీవితం

Literary life of Amrita Preetaఅమృతాప్రీతమ్‌ 20వ శతాబ్దపు ప్రథమ ప్రముఖ మహిళా పంజాబీ రచయిత్రి, కవయిత్రి. ఆమె రచనలను భారతదేశం, పాకిస్తాన్‌ ప్రజలు సమానంగా ఇష్టపడతారు. ఆమె తన 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కవిత్వం, వ్యాసాలు, నవలలు, జీవిత చరిత్రలు మొదలైనవి వందకు పైగా రచనలు రచించింది.

అమృతా పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాలో ఆగస్టు 31, 1919న అమృతకౌర్‌గా జన్మించింది. తల్లి రాజ్‌ బీబీ, స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. తండ్రి కర్తార్‌ సింగ్‌ హిత్కారీ సాహిత్య పత్రిక సంపాదకునిగా పని చేసే వారు. వీరిది సాంప్రదాయ సిక్కు కుటుంబం. అమృతకు 11 ఏండ్లు ఉన్నపుడు ఆమె తల్లి మరణశయ్యపై ఉంది. తల్లి ఆరోగ్యం కోసం ఆమె దేవున్ని ఎంతగానో వేడుకుంది. పసి పిల్లల ప్రార్ధనలను దేవుడు వింటాడని నమ్మింది. కానీ తల్లి చనిపోయింది. దేవునిపై విశ్వాసం కోల్పోయింది. తల్లి మరణం తర్వాత అమృత లాహోర్‌కు వెళ్లి తండ్రితో సమయం గడపసాగింది.
అమృత చాలా చిన్న వయసులోనే రాయడం ప్రారంభించింది. కేవలం 17 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ‘అమృత్‌ లెహ్రాన్‌’ (1936) (అమర తరంగాలు) పేరుతో తన తొలి కవితా సంకలనాన్ని విడుదల చేసింది. ఆ తర్వాత 1936 నుండి 1943 వరకు కనీసం ఆరు కవితా సంకల నాలను ప్రచురించింది. తన సాహిత్య రచనల ద్వారా ప్రజలను ప్రేరేపించడానికి ‘ప్రగతిశీల రచయితల ఉద్యమం’లో చేరింది. 1944లో ‘లోక్‌పీడ్‌’ (ప్రజల వేదన) రచనల సంకలనాన్ని రూపొందించింది. ఇది ‘1943 బెంగాల్‌ కరువు’, దేశంలోని అప్పటి యుద్ధం వల్ల దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థకు కారణమైన బ్రిటిష్‌ రాజ్‌ను విమర్శించింది.
అమృత లాభాపేక్షలేని అనేక సంస్థలలో చురుకైన సభ్యురాలు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం పని చేసేది. 1947లో భారతదేశ విభజనకు ముందు కొంతకాలం ‘లాహోర్‌ రేడియో స్టేషన్‌’లో పని చేయడం ద్వారా ప్రజలతో ఆమెకు నేరుగా సంబంధం ఏర్పడింది. తర్వాత కాలంలో అమృతా ప్రీతమ్‌ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఆమెను స్త్రీవాదిని చేశాయి. ఆమె రాసిన కథలు, కవితలు ఎక్కువ శాతం తన వైవాహిక జీవితంలోని దుర్భర అనుభవాల నేపథ్యంలో రాసినవే. ఆమె స్వీయచరిత్రలైన ‘బ్లాక్‌ రోజ్‌’, ‘రసిది టిక్కెట్‌’ (రెవెన్యూ స్టాంప్‌) ఆ కోవకు చెందినవే. ‘రసిది టిక్కెట్‌’ లో ముఖ్యంగా తన ప్రణయ గాథలను ధైర్యంగా వివరించింది. తను రాసిన చాలా కథల్లో ప్రముఖ ఉర్దూ షాయర్‌, సినీ గేయ రచయిత సాహీర్‌ లూధియాన్వితో తన ప్రేమవ్యవహారం తొంగి చూస్తుంది. మంచి పేరున్న పైంటర్‌ ఇమ్రోజ్‌తో గడిపిన సహ జీవనం గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది.
1947లో భారతదేశ విభజన తర్వాత అమృతా ప్రీతమ్‌ లాహోర్‌ నుంచి ఢిల్లీకి వలస వెళ్లింది. 1947లో ఆమె డెహ్రాడూన్‌ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్నప్పుడు దేశ విభజనపై ఒక కాగితంలో తన వేదనను వ్యక్తం చేసింది. అది ఒక కవితగా మారింది. అదే ‘అజ్‌ ఆఖాన్‌ వారిస్‌ షా ను’ కవిత. ఈ కవితలో అమృతా ప్రీతమ్‌ భారతదేశం విభజన సమయంలో జరిగిన ఘోరాలను చిత్రించింది. అమృత అత్యంత ప్రసిద్ధ నవలల్లో ఒకటి ‘పింజార్‌’ (1950). అదే పేరుతో చలనచిత్రంగా రూపొందించబడింది (2003). అవార్డు కూడా పొందింది.
విదేశాలలో ఆవార్డులు, గౌరవ పురస్కారాలు
1979లో రిపబ్లిక్‌ ఆఫ్‌ బల్గేరియా ఆమెను బల్గేరియన్‌ కవి, విప్లవకారుడి పేరు మీద ‘ఇంటర్నేషనల్‌ వాప్త్సరోవ్‌ గౌరవ అవార్డు’తో సత్కరించింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం 1987లో ఆమెకు ‘ఆర్డ్రే డెస్‌ ఆర్ట్స్‌ ఎట్‌ డెస్‌ లెటర్స్‌’ (ఉతీసతీవ సaర Aత్‌ీర వ్‌ సవర ూవ్‌్‌వతీర) తో పురస్కరించింది. పాకిస్తాన్‌కు చెందిన ‘పంజాబీ అకాడమీ’ కూడా ఆమెను సత్కరించింది.
నవలలు : ధర్తి, కోరే కాగజ్‌, ఉంచాస్‌ దిన్‌, సాగర్‌ ఔర్‌ సీపియాన్‌, దిల్‌ కి గలియ, డాక్టర్‌ దేవ్‌, తేర్‌ వా సూరజ్‌, జిలవతన్‌, యాత్రి, రంగ్‌ క పత్త.
ఆత్మ కథలు : రసిది టికెట్‌,(1976) కాల గులాబ్‌ (1968), అక్షరో క సాయ (2004). ‘లోక్‌ పీడ్‌’ (ప్రజల వేదన 1944) సంకలనంలో ఆమె పడిన బాధ, వ్యధ స్పష్టంగా కనిపించింది. ఇది 1943 బెంగాల్‌ కరువు తర్వాత ఆర్థిక వ్యవస్థను బహిరంగంగా విమర్శించిన రచన.
కథల సంకనాలు : కహానియా జో కహానియా నహి, స్టెంచ్‌ ఆఫ్‌ కిరోసిన్‌
కవితా సంకలనాలు : అమ్రిత్‌ లెహ్రన్‌ (1936), జిఉంద జివన్‌ (1939), త్రెల్‌ ధొతె ఫుల్‌ (1942), ఓ గీతన్‌ వలియ (1942), బద్లాం ది లాలి (1943), సంజ్‌ ది లాలి (1943), లోక్‌ పీర (1944), పథర్‌ గీతే (1946), పంజాబి ది ఆవాజ్‌ (1952), సునేహెరే (1955), అశోక చెట్టి (1957), కస్తురి (1957), నగ్మని (1964), ఇక్‌ సి అనిత (1964), చక్‌ నంబర్‌ చట్టి (1964), ఉనింజ దిన్‌ (1979), కాగజ్‌ తె కన్వాస్‌ (1981).
పంజాబీ, హిందీలో రాసిన ఆమె రచనలు చాలా వరకు స్వీయచరిత్రతో సహా ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, డానిష్‌, జపనీస్‌, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె కథలు కొన్ని తెలుగులో కూడా అనువాదమవుతున్నాయి. వీటిని తెలుగు పాఠకులు ఇష్టపడుతున్నారు. సాహిత్య రంగంలో ఇంత సేవ చేసిన అమృతా ప్రీతం అక్టోబర్‌ 31, 2005లో తుది శ్వాస విడిచి వెళ్లిపోయినా ఆమె రచనలు మాత్రం మన మధ్య తిరుగాడుతూనే ఉన్నాయి.

సొంత దేశంలో అవార్డులు, గౌరవ పురస్కారలు
అమృతా ప్రీతమ్‌ తన కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడింది. పంజాబ్‌ ప్రభుత్వం అందించే ‘పంజాబ్‌ రత్తన్‌’ ప్రతిష్టాత్మక అవార్డును పొందిన మొదటి గ్రహీత అమృతా. ఈ అవార్డు కళ, సాహిత్యం, సైన్స్‌, టెక్నాలజీ, సంస్కృతి, రాజకీయ రంగాలలో గుర్తింపు పొందిన వారికి ఇవ్వబడుతుంది.
1956లో ‘సాహిత్య అకాడమీ’ అవార్డు అందుకున్న మొదటి మహిళ. ‘సునేహాదే’ (సందేశాలు) అనే తన కవితా సంకలనానికి అందుకున్న అవార్డ్‌ ఇది. ‘సునేహాదే’ ఆమె గొప్ప రచనగా పరిగణించబడుతుంది.
1982లో భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారంగా పరిగణించబడే ‘జ్ఞానపీఠ్‌ అవార్డు’ను అందుకుంది. ‘కాగజ్‌ తే కాన్వాస్‌’ అనే పుస్తకానికి గానూ ఆమెకు ఈ అవార్డు లభించింది.
2004లో ‘సాహిత్య అకాడమీ’ (ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లెటర్స్‌) అందించే అత్యున్నత సాహిత్య పురస్కారమైన ‘సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌’ని అందజేసింది.
1973లో ‘జబల్‌పూర్‌ విశ్వవిద్యాలయం’, ‘ఢిల్లీ విశ్వవిద్యాలయం’ ఆమెకు డి.లిట్‌ని ప్రదానం చేశాయి.
1987లో సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి ‘భారతి విశ్వవిద్యాలయం’ నుండి గౌరవ డిగ్రీ డి.లిట్‌ను అందుకుంది.
1969లో కళలు, సాహిత్యంలో ఆమె చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని అందుకుంది.
2004లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్‌’తో ఆమెను సత్కరించారు.
1986-92 వరకు రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ చేయబడింది.

– అమ్జద్‌
+966 507662638
amjuali1993@gmail.com