శ్రీమతి లక్కరాజు నిర్మల అనగానే ఒక క్షణం ఆలోచిస్తాం… కానీ అదే ‘ఆత్మీయ నిర్మల’ అనగానే దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా మానసిక వికలాంగులు, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం పనిచేస్తున్న నిర్మలమ్మ గుర్తుకు వస్తారు. శ్రీమతి లక్కరాజు నిర్మల జనవరి 23, 1959న పాలమూరులో పుట్టారు. శ్రీమతి లక్కరాజు కమలమ్మ – శ్రీ రాఘవరావు వీరి అమ్మానాన్నలు. బిఎస్సీ., బి.ఇడి చదివి తొలుత పద్నాలుగేండ్లు ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేసి, స్వచ్ఛంద పదవీ విరమణపొంది మానసిక వికలాంగుల, ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ‘అభ్యాసన’ పాఠశాల నడిపారు. పిల్లల మనస్తత్వ్త శాస్త్రాన్ని అధ్యయనం చేసిన నిర్మల పిల్లల కౌన్సిలింగ్ నిపుణులుగా సేవలందిస్తున్నారు. అనేక టీవీ మాధ్యమాలు, పత్రికల ద్వారా స్నోలెర్నర్స్ కోసం ప్రేరణ వ్యాసాలు రాశారు, ప్రసంగాలు చేశారు, చర్చల్లో పాల్గొన్నారు. ఆటిజం మొదలు అనేక విషయాలపై తనదైన రచనల ద్వారా అవగాహనను కల్పిస్తున్న వీరు అవే అంశాలుగా కథలు రాశారు. విదేశీ పర్యటనల్లోనూ మానసిక వికలాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలు, ఆటిజం వంటివాటిని తన జెండాగా తీసుకుని పనిచేశారు.
ఉపాధ్యాయినిగా పిల్లల కోసం గణిత బోధనలో సులభమైన పద్ధతులను కథలుగా చెప్పి పిల్లలకు గణితం పట్ల భయానికి బదులు ఆసక్తిని కల్పించిన లెక్కల నిర్మల టీచర్. వాటిని టెలిస్కూల్ కోసం అందించారు. ఎన్.సి.ఈ.ఆర్.టి., ఎస్.సి.ఇ.ఆర్.టి వంటి సంస్థల కోసం రచనలు పంపారు. రచయిత్రిగా లక్కరాజు నిర్మల ‘కల్పన, త్రిపద, సంఘర్షణ, ఎన్నికలలో, ప్రపుల్లోకి., నిర్మల నానీలు, ఆత్మనివేదన, నిర్మల సూక్తులు, ఆత్మీయ సూక్తులు వంటివి వీరి ఇతర రచనలు. ఇవేకాక దూరదర్శన్ కోసం ‘బుద్దం శరణం’, ‘గుర్తింపు’ నాటికలు రాశారు. సేవా, సాహిత్య రంగాల్లో గుర్తింపుగా నెహ్రూ యువక కేంద్రం పురస్కారం, జన్మభూమి పురస్కారం, మహిళాభ్యుదయంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, భారత సాహిత్య రత్న పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం తరుపున మహిళా దినోత్సన పురస్కారం, ఆట-తానా వారి సత్కారాల వంటివి వీరు అందుకున్నారు. ‘ఆత్మీయ’ సంస్థను స్థాపించి తన పేరునే ఆత్మీయ నిర్మలగా మార్చుకున్న వీరు అనేక సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. వందలాది అవగాహనా సదస్సులు, క్యాంపులు, యోగా మొదలుకుని మహిళా శిశువుల చేతన కార్యక్రమాలు చేస్తూ అనేక సంస్థల కార్యక్రమాలలో భాగం పంచుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్, హనుమాన్ వ్యాయామశాల ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పాఠశాల మొదలుకుని పోలీసు స్టేషన్ల వరకు తన కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించిన వీరు కొంతకాలం లోక్ అదాలత్ సభ్యులుగా వున్నారు. ప్రపుల్ల మెమోరియల్ ట్రస్టు ద్వారా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈమె. సేవారంగంలోనే కాక ఆధ్యాత్మిక రంగంలోనూ తనదైన ఆసక్తితో వీరు ప్రవచనాలు చేస్తున్నారు. కేవలం సలహాలు, సూచనలతో సరిపెట్టక మూలమైన జెనటిక్ కారణాలు మొదలు వైద్యశాస్త్ర ఆవిష్కరణలో వెలువడిన అనేక అంశాలతో మానసిక వికలాంగులు, ఆటిజం పిల్లల తల్లితండ్రులను చైతన్య పరుస్తున్నారు. యునైటెడ్ థియాలాజికల్ రిసెర్చ్ స్టడీస్ యూనివర్సిటీ నుండి డాక్టర్ పట్టా అందుకున్నారు నిర్మల.
ప్రత్యేక అవసరాలున్న ప్రత్యేక బాల బాలికల కోసం ‘అమ్మ’గా మారిన లక్కరాజు నిర్మల పిల్లల్లో మూఢనమ్మకాలు, దయ్యాలు భూతాల వంటి వాటిపట్ల ఆవగాహన కలిగించే రచనలు చేస్తూనే, వారి కోసం చక్కని గీతాలు రాశారు. పిల్లల కోసం ఆంగ్లంలో రైమ్స్ ఉన్నట్టే తెలుగులో కూడా వుండాలన్న సంకల్పంతో ‘అక్షరమాల’ రైమ్స్‌ను కూర్చారు. అ నుండి ఱ వరకు అక్షర క్రమంలో ఈ గీతాలను రాశారు. ‘మనం మనకోసం చేసేపని మనతోనే అంతమవుతుంది. మనం పదిమంది కోసం చేసేపని శాశ్వతంగా నిలుస్తుంది’ అని నమ్మిన వీరు ఆ దిశగా నడుస్తున్నారు. ‘చక్కనైన పాపాయికి/ బుగ్గ చుక్క అందం/ అందని ఆకాశానికి/ చందమామ అందం’ వంటి చక్కని గేయాలున్న పుస్తకంలో ‘అదిగో అదిగో ఆకాశం/ అల్లదిగో ఆకారం/ అదిగో అదిగో ఆమేఘం/ అల్లనల్లని ఆధారం’, ‘ఇదేనోయి ఇదేనోయి/ ఇదేనోయి నా దేశం/ ఇదేనండి ఇదేనండి/ ఇంటింటికి సందేశం’, ‘ఈలలు వేస్తూ బాలలు/ గోలలు చేస్తూ ఉన్నారు/ ఈగలు తోలుతు అన్నలు/ గోటీలాడుతున్నారు’ వంటి పిల్లల కోసం రాసిన రైమ్స్ ఉన్నాయి. ఇంకా చలాకీ పిల్లలు చక్కగా ఆడుకుంటూ, పాడుకునేందుకు ‘ఊరు వాడ తిరుగుతూ/ ఉరుసులన్నీ చూసొద్దాం/ ఊట బావిలో నీళ్ళు త్రాగి/ ఊరవతల గుడి చూసొద్దాం’ అంటారు. నిజానికి నిర్మలమ్మ రాసిన రైమ్స్ ఆంగ్లంలో మనం పిలుచుకునే నాన్సెన్స్ రైమ్స్ వంటివి కావు, సెన్సున్న గీతాలు. ఈ గీతంలో పిల్లలకు ‘ఉరుసు’, ‘ఊట బావి’ వంటివి పరిచయం చేయడం, వారికి ఆటపాటలతో అవగాహన, ఆసక్తి కలిగించడమనే ఎత్తుగడ. ఇటువంటివే ‘ఐదు వేళ్ళు నీకు/ ఐదు వేళ్ళు నాకు/ ఐనవాళ్ళు నీకు/ ఐసుక్రీము నాకు’, ‘చిటపట చినుకులు/ టపటప పడెను తోటలో/ రెపరెప మనెను ఆకులు/ పకపక నవ్వెను పువ్వులు’, జాబిలమ్మ రావే/ జాజి పూలు తేవే/ కోయిలమ్మ రావే/ కూత కూసి పోవే’ వంటి అంత్యప్రాసలతో కూడిన బుజ్జిబుజ్జి గేయాలు చక్కని వన్నెతెచ్చాయని చెప్పొచ్చు. అటు సామాజిక సేవ, ఇటు సాహిత్యం, మరోవైపు బాలల మనసెరిగిన మనస్తత్వ నిపుణత… వెరిసి డా. లక్కరాజు నిర్మల. చక్కని బాలల గీతాలు అందించిన నిర్మలమ్మ మీకు అభినందనలు. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548