సాహితీ వార్తలు

17న ‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’ ఆవిష్కరణ
ఈ నెల 17న కె.పి. అశోక్‌కుమార్‌ రచించిన తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్‌లో కె.ఆనందాచారి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, పుస్తక ఆవిష్కర్తగా నందిని సిధారెడ్డి రానున్నారు. విశిష్ట అతిథిగా మామిడి హరికృష్ణ, వక్తలుగా ఎన్‌.వేణుగోపాల్‌, ఎస్‌. రఘు, ఎ.కె. ప్రభాకర్‌ తదితరులు హాజరు కానున్నారు.
21న ‘కరచాలనం’
కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కార గ్రహీత, కవి, సినీ విమర్శకులు వారాల ఆనంద్‌ రచించిన కవులూ కళాకారులతో ‘కరచాలనం’ పుస్తకాన్ని పోయెట్రీ ఫోరం ఆధ్వర్యంలో డిసెంబర్‌ 21 శనివారం ఆవిష్కరించనున్నారు. కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌. ఆర్‌. ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యావేత్త పూర్వ ప్రిన్సిపాల్‌ బి. రాంచందర్‌ రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మాజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, వైద్యులు, సాహితీవేత్తలు ఆత్మీయులు హాజరవుతారు.
21న ‘మాట్లాడటానికో మనిషి కావాలి’
శీలా వీర్రాజు చేతి వ్రాతతో రూపొందిన ‘తెలుగు ఫాంట్‌’ ను ఈ నెల 21న శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలులో సాయంత్రం 6:00 గం||లకు శీలావీ సాహిత్య చిత్ర కళా వేదిక అధ్వర్యంలో ప్రారంభించడంతో పాటు, శీలా సుభద్రాదేవి కవితా సంపుటి ‘మాట్లాడటానికో మనిషి కావాలి’ ఆవిష్కరణను నిర్వహించనున్నారు. సభలో నందిని సిధారెడ్డి, సుధామ, డా.అమతలత, పుప్పాల శ్రీరామ్‌, శీలా సుభద్రాదేవి పాల్గొననున్నారు.
26న ‘శ్రీ శూద్రగంగ’ ఆవిష్కరణ
డా|| సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘శ్రీ శూద్రగంగ’ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 26న గురువారం సాయంత్రం 6 గంటలకు ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. యోగ వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్‌ వినోదిని మాదాసు అధ్యక్షతన ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆత్మీయ అతిథులుగా అంతర్జాతీయ చిత్రకారులు ఏలే లక్ష్మణ్‌, ప్రముఖ చిత్రకారులు బంగారు బ్రహ్మం, వక్తలుగా ప్రొఫెసర్‌ కాశీం, కవి అందెశ్రీ, ప్రొఫెసర్‌ కాత్యాయని వద్మహే, ప్రముఖ కవి బెల్లి యాదయ్య రానున్నారు. ప్రముఖ కవి కోయి కోటేశ్వరరావు పుస్తక సమీక్ష చేయనున్నారు.