సాహితీ వార్తలు

సాహిత్యకళాలోకం చదవాల్సిన పుస్తకాలివి. విలువైన జీవితాలను, అరుదైన సమాచారాన్ని, చరిత్రను, కళలను ప్రజల పక్షాన ఆలోచనచేసి రచించిన పుస్తకాలివి. ఎంతో ఆర్ధ్రంగా, ఆకర్షణీయ శైలిలో రచించినవి. మంచి అనుభూతిని కలిగించేవి. ఆలోచనలలో చైతన్యాన్ని నింపే పుస్తకాలు ఇటీవల నవతెలంగాణ ప్రచురించిన సాహిత్య సంపద.
ప్రజాకవి సుద్ధాల హనుమంతు
ఇది 312 పుటల సుద్ధాల హనుమంతు సమగ్ర సాహిత్య సంపుటం. ”సుద్ధాల పాటలు, గేయాలు పుస్తక రూపంలో రాకముందే, ఆయన కవిగా ప్రజలలో ప్రాచుర్యం పొందారు. ప్రజాకవిగా గుర్తించబడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన నిబద్ధతతో తన పాత్ర నిర్వహించారు. పెన్ను, గన్ను ఏకకాలంలో పట్టుకున్న పోరాట కవి సుద్ధాల. ఇబ్బందులు, ఇక్కట్లు అనుభవించి పలవరించారు. ఆయన జీవితం, సాహిత్యమంతా ఇందులో ఉంది” – సురవరం సుధాకరరెడ్డి
కంచెలపై దేహాలు
రాయకుండా ఉండలేక ఊపిరాడని స్థితిలోంచి రాసిన రచన ఇది. సమాజంలోని సంఘటనలను, ఆందోళన కలిగించే సామాజిక పరిణామాలను, విదేష రాజకీయాల ఫలితాలను ఎంతో సృజనాత్మకంగా, సాహిత్య విలువలతో చేసన బ్రహ్మ ప్రకాశ్‌ రచన. దీన్ని ఉషారాణి సమర్థవంతంగా అనువదించారు. ”విద్వేషం, కరుణ, విచారం, దు:ఖం, కష్టం, ప్రతిఘటన, న్యాయం మొదలైన అర్థాలపై సృజనాత్మక రచన. ఈనాడు మనమున్న భయంకర స్థితి నుంచి బయటపడే మార్గాన్ని చూపే దారిదీపం ఈ పుస్తకమని” అరుంధతి రారు ప్రశంసించిన రచన.
తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు
పరిశోధనాత్మక రచన ఇది. తెలంగాణ తొలితరం కథకులు 30మందిని స్థూలంగా పరిచయం చేయటమే కాక, వారి కథలను, కథన రీతులను విశ్లేషించిన గ్రంథమిది. కె.పి.అశోక్‌కుమార్‌ శ్రమకోర్చి రాసిన ఈ రచన సాహిత్య పరిశోధకు లకు మరింత పరిశోధనకు ఉపయోగపడే విధంగా ఉంది. ”ఇది గతానికి సంబంధించినవి మాత్రమే కాదు, వర్తమానానికీ, బహుశా భవి ష్యత్తుకూ సంబంధించినవి. కథా ప్రక్రియకు పరిమితమైనవి మాత్రమే కాదు, సమాజ చరిత్రకు అవసరమైన ఎన్నో అంశాలూ ఇందులో ప్రస్తావనకు వచ్చాయ”ని ఎన్‌.వేణుగోపాల్‌ ప్రశంసిచిన రచన.
రేపెక్కడికెళ్తావ్‌..!
పదిహేను కథలున్న ఈ సంపుటిలో దేశంలోనే ప్రసిద్ధులైన రచయతలు రాసినవి. ఇందులో ఎనిమిది కథాంశాలు మహిళ ప్రధానంగా కొనసాగినవే. ఏ ప్రాంత రచయిత అయినా, ఏ భాషా రచన అయనా, కాలం ఏదయినా ఇందులోని కథలన్నీ సమకాలీన సామాజికతకు సంబంధించిన కథలుగా చైతన్యాన్ని, మానవీయతను పెంపొందిం చేవిగా ఉండటం వీటి ప్రత్యేకత. దేశంలోని వివిధ ప్రాంతాల జీవన ప్రతిబింబాల సంపుటి ఇది. అచ్చమైన తెలుగు నుడికారంతో రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ అనువదించారు.
విప్లవ నీతి కథలు
ఇది నిజంగా అవసరమైన నీతి కథలు. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా. ముఖ్యంగా శ్రామిక ఉద్యమాల్లో పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ఎంతో విలువైన కథలు. నిత్యం వారి రోజువారీ పనుల్లో, చర్చల్లో, వ్యూహాల్లో, సంభాషణల్లో, ఎత్తుగడల్లో ఇవెంతగానో ఉపయోగపడతాయి. పక్షులు, జంతువులు ప్రకృతిన ఆసరా చేసుకుని, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక విషయాలను చాలా గొప్పగా చెప్పిన కథలు ఇవి. చైనా రచయిత ఫెంగ్‌ షుఫెంగ్‌ రాసిన ఈ కథల్ని ముక్తవరం పార్థసారథి తెలుగులో మనకందించారు.
భళా! చిత్రకళా!
భారతీయ దృశ్య కళా చరత్ర పుస్తకం కేవలం కళా చరిత్ర మాత్రమే కాదు, మానవ సాంస్కృతిక జీవనంలోని అనేక అంశాలను, వారి చరిత్రను తెలిపే గ్రంథం ఇది. కళా చరిత్రకారిణి డా|| బాలమణి శ్రమకోర్చి సేకరించి, పరిశోధించి రాబోయే తరాలకు కానుకగా అందించారు. కళా సాంస్కృతిక రంగాలలో పనిచేస్తున్న, అభ్యసిస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగ పడే గ్రంథం. విశ్వవిద్యాలయ స్థాయిలో కళా చరత్రను బోధించే ఆచార్యులుగా ఉంటూ పరిశోధనాత్మకమైన ఈ రచనను చాలా ఆసక్తి గొలిపే రీతిలో చేశారు. చిత్రాలతో కూడిన కళా చరిత్ర.
స్త్రీ ఆధునిక కళాకారిణిగా శతాబ్దయానం
ఇదొక అపురూపమైన పుస్తకం. ఒక వంద సంవత్సరాల కాలంలో 1920 నుంచి 2020 వరకు భారతదేశంలో చిత్రకారిణులుగా, కళాకారి ణులుగా ప్రసిద్ధి చెందిన 69 మందిని, వారి కళా విశేషణాలను జీవిత పరిచయాలను ఎంతో ఆసక్తిని కలిగించేట్లు రచించారు డా. బాలమణి గారు. మహిళా చిత్రకారిణుల చరిత్రను నమోదు చేసిన అరుదైన గ్రంథం. వర్ణ చిత్రాలతో ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో కలిపి వేసిన అరుదైన రచన.
మాటలో మనసునై
‘జీవితంలోని అనుభవాలు, అనుభూతులను గురించి రాయడం, సాధారణ పాఠకుడి గుండెకు హత్తుకునేట్లు క్లుప్తంగా వ్యక్తీకరించడం సృజనాత్మక ప్రతిభకు తార్కాణం. మామూలు మనుషులకు సాదాసీదాగా అనిపించే అంశాల గురించి ఆసక్తికరంగా రాయడం సునిశిత దృష్టికి సృజనాత్మక యోచనలు ఉన్నవారికే సాధ్యం. అలాంటి రచనే ఇది’ అంటారు గుడిపాటి. ఆనందాచారి అంతరంగ ఆవిష్కరణే ఈ పుస్తకం.
తదేక
‘తదేక’ విమర్శనా వ్యాసాల సంపుటి. కొత్తగా వస్తున్న సహిత్య సృజనపై విశ్లేషణాత్మకమైన వ్యాసాలివి. కొత్తగా సాహిత్య రంగంలోకి వస్తున్న వారికి, సాహితీ పరిశోధకులకు ఎంతో అవగాహన కలిగించే విమర్శనా సంపుటి ఇది. సాహ్యి రంగంలో విశేష కృషి చేస్తూ బోధనా రంగంలో ఉన్న డా|| మహమ్మద్‌ హసేన వెలువరించిన విశ్లేషణ్మాక గ్రంథం.