సాహిత్య గమనావలోకనం

Literary overviewఆర్థిక, రాజకీయ ప్రభావాలతో సామాజిక జీవనం కొనసాగటం సర్వసాధారణ విషయం. అయితే ఆ ప్రభావాల కారణంగా సమాజంలో చోటుచేసుకుంటున్న సంఘర్షణలను కళా, సాహిత్యం ప్రతిఫలిస్తున్నదా అన్నదే సాహిత్యపు చైతన్యపూరిత చలనశీలతను తెలుపుతుంది. తెలుగు సాహిత్యాన్ని ఆ దృష్టితో పరిశీలించినపుడు మందగమనమే కనిపిస్తుంది. ఆర్థిక రాజకీయాల ఆధిపత్య భావజాలాలు గణనీయంగా కళా సాహిత్య రంగాలపై ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. వైయక్తిక ధోరణులు పెరిగిపోయాయి. సభలు సమావేశాలు, ఉత్సవాలు ఆ దిశగానే సాగాయి. సామాజిక స్పృహ, చైతన్య పూరితమైన సృజన, సభలూ లేవని కాదు, ఆశాజనకంగా ఆశయ జనకంగా లేవన్నదే విమర్శ. దేశంలోనూ, రాష్ట్రంలోనూ తిరోగమన శక్తుల, విద్వేష ఆలోచనల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల స్థానిక రాజకీయాలు వాటిని ఎదుర్కొనే దిశలో ఆలోచన కానీ ఆచరణ కానీ లేకపోగా అనుకూలంగా సాగటం, లేదా సందిగ్థంగా కొనసాగటం ప్రగతిశీలతకు పెద్ద ఆటంకం. కళా సాహిత్య సృజనకు శత్రువు అయిన మతోన్మాదము, విద్వేషముపై మరింత ఐక్యంగా కలాలను గళాలను ఎక్కు పెట్టవలసే ఉన్నది. ఎందుకంటే ఈ తిరోగమన శక్తులు, మన వైవిధ్యపూరితమైన, భిన్నసాంస్కృతిక జీవనంపై దాడి చేస్తున్న సందర్భంలో ఉన్నాము. అంతేకాక మన పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని, విధ్వంస మొనరిస్తూ సహజ వనరులను దోపిడీ చేస్తున్న శక్తులు కూడా వీరితో కలిసి సాధారణ ప్రజల జీవనాన్ని దెబ్బ తీస్తున్నారు. నష్టపోతున్న, వెతలు పడుతున్న, వేదనకు గురవుతున్న వారి గొంతుకగా ఉండాల్సిన సాహిత్య రంగం కృషి మరింత పెరగవలసే ఉంది. చైతన్యధార సంఘటితమైతేనే వీటిని ఎదుర్కోగలము.
తెలంగాణలో ఆనాటి సాహిత్య కారులకు ఒక ప్రత్యే కత ఉన్నది. సాహిత్య సృజనతో పాటుగా, నాటి రాజ కీయ, సామాజిక ఉద్యమాలలో భాగస్వాములుగా కొనసాగటం మనం చూస్తాము. దాశరథి కృష్ణమా చార్యులు, ఇక్కడి నిజాం నిరంకుశపాలనపై కవితాగ్ని ధారను కురిపించటమే కాక, ప్రత్యక్షపోరాటంలో నిర్బంధ జీవితాన్ని గడిపాడు. అట్లాంటి దాశరథి శత జయంతి సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా ఇక్కడి సాహితీ కారులు తమ గమనాన్ని ఒక మారు పరిశీలించుకోవలసి ఉంది. ఇదే సంవత్సరం తెలంగాణ సాయుధ పోరు కాలపు ప్రజా జీవన చిత్రాన్ని కావ్యంగా మలచిన ‘త్వమేవాహం’ కవి ఆరుద్ర శతజయంతి కూడా కావడం, మన పున:చైతన్య స్ఫూర్తికి దోహదం చేస్తుందని భావిస్తాను. వారి స్ఫూర్తితో ప్రజా సాహిత్య కృషి జరగాలి. వారి వారసత్వంగా చైతన్యంతో సాహిత్య సృజన చేస్తున్న వారూ ఉన్నారు. కానీ ఇలాంటి సందర్భం లోనూ స్థానిక, స్థానికేతర అనే వైషమ్యాలకు తావి వ్వడం సరికాదని అనుకుంటు న్నాను. ఇక గత పదేళ్లుగా సాఫీగా లేదా సాధారణంగా సాగిన సామాజిక సాహిత్య రంగం మళ్లీ ఇపుడు ప్రాంతీయ అస్థిత్వ విషయాలను ఎందుకు ముందుకు తెస్తున్నదో అర్థం కాదు. రాజకీయ ప్రేరణలుగానే అనుకోవాలా! లక్ష్యం ఏమిటి? వర్తమానపు విరోధి ఎవరనే స్పృహ సాహిత్యకారులకు చాలా అవసరం. కలాన్ని ఎవరి మీద ఎక్కుపెట్టాలో స్పష్టత ఉండాలి. ఇది లేకుంటే ప్రజాహితమైన విషయం వెనక్కు పోతుంది. సమూహంగా కదలాల్సిన వేళ వేరు పడడాన్ని నిరోధించుకోవాలి.
ఈ దేశంలో రైతుల బాధలను, ఆందోళనలను తెలుగు కవిత్వం సమర్థవంతంగానే ప్రతిబింబిం చింది. అనేక కవితా సంపుటులు రైతు ఘోషను వినిపించాయి. మణిపూర్‌లో జరుగుతున్న అమానవీయ దాడులను, విధ్వంసాలనూ ఇక్కడి కవులు చిత్రిక పట్టారు. బాధితులకు మద్దతుగా నిలిచారు. దేశం మొత్తంలో దళిత, ఆదివాసీలపై పెరిగిన దాడులు, నిర్బంధాలపై సాహితీ గళం ఎత్తింది. మత విద్వేషాలపైనా ప్రతిస్పందన వచ్చింది. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదుల కుట్ర కారణంగా తలెత్తిన యుద్ధాల్లో బలౌతున్న ప్రజలకు సంఘీభావంగానూ తెలుగు కవులు స్పందించారు. పాలస్తీనాకు తమ నైతిక మద్దతును తెలిపారు. ఆహ్వానించాల్సిన పరిణామమేమంటే ఈ సంవత్సరం సాహిత్య సృజనలో యువత పెరిగారు. మరీ ముఖ్యంగా యువ రచయిత్రులు, కవయిత్రులు ఆధునిక సమాజపు సవాళ్లపై, సమస్యలపై రచనలు చేయడం ఒక శుభ పరిణామం. ‘యూత్‌ లిటరరీ ఫెస్ట్‌’లో పాల్గొన్న యువత ప్రసిద్ధుల సాహిత్య చర్చలకు సమఉజ్జీగా చర్చ చేయటం ఆశావహమైన విషయం. కొత్త తరం ఒక ‘వేవ్‌’లా వస్తోంది. వారికి సరైన మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది.
కొత్త తరం వస్తోంది పాతతరం పోతోంది. ఈ సంవత్సరం సాహిత్య రంగం నుండి శాశ్వతంగా నిష్క్రమిం చినవాళ్లు అందించిన స్ఫూర్తిని మననం చేసుకోవాలి. సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రసిద్ధ రచయిత్రి బోయి విజయభారతి మన నుండి దూరమయ్యారు. ప్రముఖ మళయాళీ రచయిత ఎం.టి.వాసుదేవ నాయర్‌ ఇటీవలె మరణించారు. హైద్రాబాదీ కళాస్రష్ట శ్యాం బెనగల్‌, భారతీయ తబలా కళను విశ్వవ్యాప్తం చేసిన జాకీర్‌ హుస్సేన్‌, వైవిధ్య రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌, ప్రసిద్ధ రచయిత ఉప్పల నర్సింహ, గుస్సాడి జానపద కళా కారుడు కనకరాజు, కవి అడిగోపుల వెంకట రత్నం, పరిశోధక రచయిత డా|| ముత్యం, వడ్డేపల్లి కృష్ణ, నల్లెల రాజయ్య, దార్ల రామచంద్ర, మండల స్వామి, సాధిక్‌ అలీ మొదలైన సాహిత్యకారులు మనకెంతో ప్రేరణనిచ్చి వెళ్లిపోయారు.
ఈ సంవత్సరమే తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చినవాళ్లూ ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీవారు అనువాద సాహిత్యంలో మన ఎలనాగ అవార్డును పొందారు. అదే విధంగా బాల సాహిత్య విభాగంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ అవార్డు దక్కించుకున్నారు. ఇక సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌ అందుకోవడం ఒక సంతోషకర విషయం. ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అభ్యుదయ రచయిత పెనుగొండ లక్ష్మీ నారాయణకు ప్రకటించారు. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాళోజీ పురస్కారాన్ని ప్రసిద్ధ కవి, భాషావేత్త నలిమెల భాస్కర్‌కు ప్రకటించినప్పటికీ ఇంకా అందజేయలేదు. జూకంటి జగన్నాథం దాశరథి పురస్కారాన్ని పొందారు.
ప్రభుత్వాలు కానీ, అకాడెమీలు, సంస్థలు ప్రకటించే అవార్డులు పురస్కారాలు రచయితలకు ఉత్సాహాన్ని నింపుతాయి, కానీ అంతకంటే సాహిత్యకారుల రచనలు వెలుగులోకి తీసుకురావటం ముఖ్యమైనది. సాహిత్య సభలు, కార్యశాలలు నిర్వహించడం అవసరమైనది. తెలంగాణ సాహిత్య అకాడెమీకి ఇంకా ఇంతవరకు చైర్మెన్‌ను నియమించలేదు. సాహిత్య సాంస్కృతిక విధానాన్ని ప్రకటించలేదు. చరిత్రకు, సంస్కృతికి సంబంధించినది ఎంతో వెలికితీయవలసి ఉంది. ప్రభుత్వాలు ఆ వైపుగా కదలాలి.
కొంత స్తబ్దంగా కళా సాహిత్యాలు ఉన్నప్పటికీ చైతన్యయుత వారసత్వపు మెరుపులూ సజీవం గానే ఉన్నాయి. వాటికి మరింత పదును పెట్టాలి. సాహిత్య రంగంలోకి వస్తున్న యువతను సమీకరించాలి. సాహిత్య విమర్శను పెంచాలి. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో రచయతలు నవనవోన్మేషంగా ముందుకు కదలాలి. సమాజాన్ని ముందడుగు వేయించడంతో సాహితీకారులు విజయవంతం కావాలి.
– కె.ఆనందాచారి
9948787660