సాహిత్యవ్యాస ‘ధార’

Literary 'Dhara'Some books are to be tasted, others to be swallowed, and some few to be chewed and digested: Francis Bacon కవిగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనదైన తెలుగువాక్యాన్ని నిర్మించుకొని సాహిత్యాన్ని ధారావాహికంగా వ్యాఖ్యానిస్తున్న యువసాహితీకెరటం అనంతోజు మోహన్‌కృష్ణ. అనంతోజు ‘ధార’ అనే సాహిత్య వ్యాసాల సంకలనం 2023, 2024లో రెండుసార్లు వెంటవెంటనే ప్రచురించబడటం అంటే తనను తాను మంచి విమర్శకుడిగా నిరూపించుకున్నట్లే. మొత్తం 18 వ్యాసాలతో వెలువడిన ఈ ‘ధార’ గ్రంథం పాతతరం రచయితల్నే కాకుండా సమకాలీన రచయితల రచనల్ని కూడా ఇందులో పొందుపర్చటం మూలాన ఈ గ్రంథానికి పరిపుష్టి చేకూరింది.
మొదటి వ్యాసమైన ‘తెలంగాణ రుద్రవీణ’లో మహాకవి దాశరథి కృష్ణమాచార్యను గురించి రాస్తూ తెలంగాణలో ఆవేశం అనే తుపాకితో అక్షరాలనే తూటాలను పేల్చి ప్రజలను చైతన్యపరిచిన అచ్చమైన తెలంగాణ కవి అంటూ, ‘మా నిజాము నవాబు జన్మజన్మల బూజు” అని నిరసన గళమెత్తినందుకు చేతులకు బేడీలు పడినా దడవని మానుకోట బిడ్డ అని అభివర్ణిస్తాడు. అంతేకాక తెలుగుకు గజల్‌ సొగసు అద్దిన తొలికవిగా గాలీబ్‌ రాసిన ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించడమే కాక తెలుగు సినీగేయ రచయితగా దాదాపు 2000 అజరామరమైన పాటల్ని రాసిన అరుదైన సృజనకారుడిగా కొనియాడతాడు. ఒక కవిగానే కాక, ఒక బాధ్యత కల్గిన పౌరునిగా నూతన సమాజం కోసం పరితపించిన హృదయంతో రాసిన ఈ క్రింది కవితాపాదాలు దాశరథి హదయ వైశాల్యాన్ని తెలియపరుస్తాయి.
”రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్‌/ బుర్రలు బుర్రలు పగలక సమస్యకు లేదా సొల్యూషన్‌” ఈ వాక్యాల్ని కుణ్ణంగా పరిశీలిస్తే రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యల్ని అతిసామాన్య భాషలో కవిత్వం చేసి పండితుల్నే కాక సామాన్య పాఠకుల్ని సైతం మెప్పించిన అసాధారణ ప్రతిభావంతుడైన కవిగా దాశరథిని గుర్తించవచ్చు.
తెలంగాణ వాస్తవికతను ఆనాటి సమాజ పోకడల్ని చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తనరచనల్లో ప్రతిబింబించిన రచయితగా వట్టికోట ఆళ్వారుస్వామిని గుర్తించవచ్చు. ఆయన రాసిన ప్రసిద్ధ రచన ‘ప్రజలమనిషి’ని తెలంగాణలో మొట్టమొదటి నవలగా పేర్కొనవచ్చు. ఆళ్వారుస్వామిలోని కళాదృష్టి మనుషులపట్ల, అలాగే సమాజంపట్ల ఆయనకున్న విశ్వాసం, ఒక రచయితకుండవలసిన సాహిత్య నిబద్ధత, ఆయనను తెలుగుసాహిత్య సీమలో కలంయోధునిగా అజరామరుణ్ణి చేశాయి.
‘విశ్వనరుడు’ అనే వ్యాసంలో నవయుగకవి చక్రవర్తి గుర్రం జాషువా ‘గబ్బిలం’ కావ్యం గురించి రాస్తూ ‘కసరి బుసకొట్టు నాతని గాలిసోక/ నాల్గు పడగల హైందవ నాగరాజు’ అనే కవితా వాక్యాల్ని ఉటంకిస్తూ హిందుత్వాన్ని చాలా తీవ్రంగా నిరసించాడని.. కలాన్ని గళంగా మార్చి తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యదీపాల్ని వెలిగించాడని జాషువాను కొనియాడుతూ, ఆయన రచనలను చదివి వారి ఆశయాలను నెరవేర్చడమే మనం ఆయనకిచ్చే అసలుసిసలైన నివాళి అంటాడు.
‘రగులుతున్న పంక్తులు.. పగుళ్ళుపారిన పాదాలు నెత్తురోడ్చే అక్షరాలు… కత్తిమొనలాంటి కవిత’ అనే కవిత్వపాదాల్ని తీసుకొని తెలంగాణ సాహితీదిగ్గజం సినారె గురించి… అత్యంత ప్రతిభావంత బహుముఖ కవిగా, ఆయన రాసిన పద్యాల్ని, కవితల్ని, సినిమా పాటల్ని, గజళ్లను కథల్ని, ఇలా వివిధ ప్రక్రియల్లో అందెవేసిన చేయిగా తెలుగు సాహిత్యంలో అనేక కొత్త ప్రయోగాలకు ఆధ్యుడైన సినారె సాహిత్య అద్భుతంగా వర్ణిస్తాడు.
ఆకలికేకల్లోంచే అసలైన కళలు, కళాకారులు ఉదయిస్తారనడానికి జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత డా.రావూరి భరద్వాజ సృజియించిన సాహిత్యాన్ని, జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. కణకణలాడిన పేగుల బాధలు పాకుడు రాళ్లపై జారీ జారీ… అనుభవాల ఉలితో తనను తాను చెక్కుకున్న ఆక్షరశిల్పి రావూరి అంటూ… ఆకలి ఆ రచనలకు ప్రేరణ అని… ఆ ఆకలిబాధను మర్చిపోవడానికే అక్షరాలను ఆలింగనం చేసుకొని సృజన కళను ఆవాహన చేసుకున్న అక్షరబ్రహ్మ రావూరి.
ప్రపంచ సాహిత్యచరిత్రలో గొప్ప రచయితగా నిలిచిన మాక్సిమ్‌ గోరీ రాసిన ‘అమ్మ’ నవల ఎంత ప్రభావవంతమైనదో ఆ నవల గురించి ఎన్ని భాషల్లో ఎంతమంది ఎన్ని వ్యాసాలు రాసినా ఆ నవలలో ఏదో కోణం మిగిలే ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎందుకంటే అమ్మ అనే పదమే అనంతమైనది. ఆ పదానికి హద్దులు, సరిహద్దులు ఎవరూ గీయలేరు. ఎంతరాసినా పూర్తికాని కావ్యం/ అమ్మంటే అనంతం అని ‘అనంతం’ అనే కవితలో నేను మా అమ్మగురించి రాసుకున్న వాక్యాలు గుర్తుకొచ్చినవి. ధారలోని ‘నాటికి ..నేటికీ.. స్పూర్తి.. అమ్మ’ అనే వ్యాసంలో గోర్కీ ఎందుకు ఉత్తమశ్రేణి రచయిత అయినాడో వివరిస్తూ యదార్ధ జీవితసత్యాల్ని, సంఘటనలను, సంభాషణలను తన రచనలలో చూపడమే కాకుండా, పోరాటస్ఫూర్తిని ప్రోదిచేస్తూ మనుషులమధ్య మనిషిగా బతకడంలోని ఉదాత్తతను చెప్పి రచనగా కితాబు ఇస్తాడు.
”అన్యాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి/ అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి/ అన్యాన్నే దిరించినోడు నాకు ఆరాధ్యుడు” అని జీవితాంతం తెలంగాణ ప్రజల ప్రత్యేక అస్తిత్వం కోసం కలమెత్తి, గళమెత్తి నినదించడమే కాకుండా వాళ్ళ పక్షాన నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన గొప్ప మానవతావాది అంటూ ”దిక్కారకలం” అనే వ్యాసంలో కాళోజీని ఆవిష్కరించాడు. కాళోజీ వంటి ప్రజాస్వామ్య విలువలు బోదించిన ప్రజాస్వామిక ప్రవక్త మరో వెయ్యి ఏండ్లకు కూడా పుట్టబోరని కన్నాభిరాన్‌ వ్యాఖ్యానించాడంటే కాళోజీ బహుముఖీన ప్రతిభని అర్థం చేసుకోవచ్చు.
”ఎల్లలు లేని కవితాకాశంలో/ ఎవరెవరి బాధలైనా రాస్తా/ క్షమించండి…/ నా ఒక్కడివి మాత్రం దాస్తా…” అని కన్నీటికడలిలో ప్రయాణంచేస్తూ కూడా కవిత్వాన్ని రాయడం మానని ఆక్షరయోధుడని, ఈ దోపిడీ సమాజంపై ఆక్షరాయుధాల్ని ఎక్కుపెట్టి సాహితీ చీకటిని చీల్చిన ఆద్యతీయకవి అని అలిశెట్టిని ప్రశంశిస్తాడు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక గెరిల్లా యోధునిగా, రాత్రిబడి నేర్పిన అక్షరాలతో బానిస బతుకుల కథలు చెరిపి నెత్తురు. కన్నీళ్లతో తడిసి ముద్దైన తెలంగాణ ప్రాంత చరిత్రని బండెనకబండి కట్టి/ పదహారు బండ్లు కట్టి /ఏ బండ్లో పోతవు కొడకో/నా కొడకా ప్రతాపరెడ్డి.. అనే పోరాటగీతాన్ని రచించిన బండి యాదగిరిని, ఆయన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరన్నది వాస్తవం.
గిడుగువారి వ్యవహారిక భాషోద్యమంవల్ల ఆధునిక సాహిత్యం కొత్తసొగసులు సంతరించుకోవటమే కాకుండా రచనా వైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టి చేకూరిందని అంటారు. ఆధునిక విజ్ఞానవ్యాప్తికి వచన రచనలకు కావ్యభాష పనికి రాదని సామాన్య జనానికి అర్ధమయ్యే సమకాలీన ‘శిష్టవ్యవహారికం’లో ఉండాలని ఆనాటి సాంప్రదాయిక పండితులతో యుద్ధం చేసి ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్టించిన మార్గదర్శకుడని మోహన్‌కష్ణ తన ‘తెలుగు వెలుగు’ వ్యాసంలో గిడుగు కార్యదీక్షను కొనియాడతాడు.
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను/ నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను’… అంటూ మాటల్ని తూటాలుగా పేల్చి తెలుగుసాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ కవిత్వ ఇంద్రజాలాన్ని, సాహిత్య పరిమళాన్ని పరిచయం చేస్తారు. శ్రీశ్రీ ఒక సాహితీ మహాసముద్రమని, ఆ సముద్రంలో ఎన్ని బిందువులున్నాయో లెక్కపెట్టలేమని ఆయన కవితా నేపథ్యాన్ని అర్ధం చేసుకోవటం అనితరసాధ్యమని ఆయన కవిత్వ వైశిష్ట్యాన్ని గుర్తుచేస్తాడు.
ఇంకా ఈ ‘ధార’ గ్రంథంలో ‘సాయుధపోరాటం సాహిత్య చైతన్యం’, ‘స్త్రీల అభివృద్ధి సమాజాభివృద్ధి’, ‘దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమధర్మన్న’, ‘అగ్నివీణ అనిశెట్టి’, ‘సాహిత్యం మహిళలు’ అన్న అద్భుతమైన విశ్లేషణాత్మక వ్యాసాల్లో ఆయా రచయితల సృజనాత్మక శక్తిని అద్భుతంగా విశ్లేషించారు. తెలుగు సాహితీప్రియులు ముఖ్యంగా పరిశోధకులు తప్పక చదవవలసిన విమర్శనా గ్రంథం ఈ ‘ధార’. ఎంతో శ్రమకోర్చి ఇంతమంది అద్వితీయ రచయితల్ని సాహితీలోకానికి పరిచయం చేసిన అనంతోజు మోహన్‌ నిజంగా అభినందనీయుడు. ముందు ముందు ఇంకా లోతైన విశ్లేషణా వ్యాసాలు రాసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలి.
డా. బాణాల శ్రీనివాసరావు,
9440471423