తెలంగాణ వీరుల పురిటిగడ్డ. రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధాలు ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. సాహితీయోధుడు దాశరధి ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే తెలంగాణ ధైర్యసహసాలను తన సాహిత్యంలో గుప్పించాడు. జులై 22 దాశరథి శత జయంతి సందర్భంగా ఆ సాహితీ సమరయోథుని పరిచయం…
దాశరధి చిన్నగూడూరు గ్రామంలో 1925 జూలై 22న జన్మించాడు. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. దాశరధి మాతామహుల స్వగ్రామం చిన్న గూడూరు. తండ్రి తాతలది భద్రాచలం. దాశరథి తండ్రిగారు లక్ష్మణాచార్యులు తన అత్తగారి ఊరైన చిన్న గూడూరుకు వచ్చి స్థిరపడ్డాడు. లక్ష్మణాచార్యుల కుమారుడు వేంకటాచార్యులు తెలుగు, తమిళ, సంస్కత భాషలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు. దాశరధి తండ్రి వద్దనే సంస్కత కావ్యాలను చదివి, సంస్కత భాష వ్యాకరణ సంప్రదాయాలను అవగాహన చేసుకున్నాడు. తల్లి వెంకటమ్మ గారి దగ్గర తెలుగు కావ్యాలను, ప్రబంధాలను చదివాడు. అదే గ్రామంలో ఉన్న ఇస్మాయిల్ పటేల్ వద్ద ఉర్దూ భాషను నేర్చుకున్నాడు. దాశరధి నాలుగవ తరగతి చదివే రోజులలో వారి కుటుంబం ఖమ్మం చేరింది. ఖమ్మం ఉస్మానియా హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. అక్కడి అనేక అనుభవాలు దాశరధి మేధకు పదును పెట్టాయి. హై స్కూలు చదివే రోజులలోనే దాశరథిలో కవితాత్మ కూడా మెరుగుపడింది. తర్వాత అనివార్య కారణాలవల్ల దాశరధి కుటుంబం గార్లకు మారింది.
తెలంగాణ ఆంధ్ర మహాసభ కార్యకర్త సాయుధ రైతాంగ పోరాట యోధుడు తన కలాన్ని, గళాన్నీ పదునైన ఆయుధంగా మలుచుకొని నిజాం రాజు గుండెలకు దడ పుట్టించిన సాంస్కతిక సమరయోధుడు దాశరధి. ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచంలో పదునైన భాష గల పద్య కవిగా సుపరిచితుడైన దాశరధి పూర్తి పేరు దాశరధి కష్ణమాచార్యులు.
దాశరధి కష్ణమాచార్యులు పుట్టింది ప్రస్తుత మహబూబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామం అయితే, కలం పట్టింది, గళం విప్పింది, కవిగా జంఝా మారుతాన్ని ప్రసరించింది నాటి గార్ల జాగీరులో. విశాల సాహితీ స్రవంతిలోకి పయనించింది మాత్రం ఆయన జైలు జీవితంలోంచే. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఏ చదివాడు. సంస్కతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు కూడా. చిన్నతనంలోనే పద్యాలు అల్లడంలో ప్రావీణ్యం సంపాదించాడు. మొదట్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నాడు.
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టర్ గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కషి చేశాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు అనేకం రాశాడు.
నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న తెలంగాణను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
”రైతుదే తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాజరికంబు దక్కునే” అని గర్జించాడు.
”దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు/ దిగిపొమ్మని జగత్తంత నగారాలు/ కొడుతున్నది, దిగిపోవోరు, తెగిపోవోరు” అని నిజామును సూటిగా గద్దస్తూ రచనలు చేశాడు.
ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదులోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసింది నిజాము ప్రభుత్వం. దాశరథితో పాటు జైలులో వట్టికోట ఆళ్వారు స్వామి కూడా ఉన్నారు. పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో ”ఓ నిజాము పిశాచమా కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని/ తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరతనాల వీణ” అంటూ గోడలపై పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు.
మంచి ఉపన్యాసకుడు, భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు పని చేశాడు.
నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమతాభిషేకం, ఆలోచనాలోచలు మొదలైన కవితా సంపుటాలను, నవమి (నాటికలు) యాత్ర స్మతి (స్వీయ చరిత్ర) వంటి పలు గ్రంథాలను రచించాడు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్ళను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి ఎంతోమంది సాహితీ విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1967) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974)లో అందుకున్నాడు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోను, ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి దాశరధి.
తెలుగు సాహితీ ప్రపంచంలో పద్యకవిగా కీర్తి గడించిన దాశరథి కష్ణమాచార్యకు 1949 నాటికి ‘మహాకవి’ బిరుదు లభించింది. ఆ తర్వాత కవిసింహ, అభ్యుదయ కవి చక్రవర్తి, యువకవి చక్రవర్తి బిరుదులు పొందాడు. 1972లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం దాశరథిని జాతీయ ఉద్యమ సారథిగా గుర్తించి తామ్రపత్రంతో సన్మానించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపూర్ణతో సన్మానించింది. 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ డి.లిట్ పట్టానిచ్చింది. 1981లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్. పట్టానిచ్చి గౌరవించింది. 1978లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కతిక సంస్థ ఆంధ్ర కవిత సారథి అనే బిరుదునిచ్చి గౌరవించింది.
సుప్రసిద్ధ సినీ కవి, ఆచార్య ఆత్రేయ తాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘వాగ్దానం’ సినిమా కోసం ప్రముఖ సినీ పాటల రచయితలతో పాటలు రాయిస్తూ, ఆనాటికి మహాకవిగా, లలిత గీతాల రచయితగా పేరున్న దాశరథిని ఒక పాట రాయవలసిందిగా మద్రాస్‌కు ఆహ్వానించి, ఆత్రేయ గీతా రచయితగా సినీ రంగానికి దాశరథిని పరిచయం చేశారు. ‘వాగ్దానం’ సినిమా కోసం దాశరథి రచించిన ”నా కంటి పాపలో నిలిచి పోరా…. నీ వెంట లోకాల గెలవని రా” అనే పాట చాలా ప్రచారం పొందింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాకు మరో పాట రాశాడు. ఆ చిత్రంతో నాగేశ్వరరావుతో అయిన పరిచయం స్నేహంగా మారి చిరకాలం కొనసాగింది.
సినీ రంగానికి పరిచయమైన దాశరథి అనేక సినిమాలకు అనేకానేక యుగళగీతాలు, ప్రేమ గీతాలు అందించడంతో సినీ గీత రచయితగా ప్రఖ్యాతి గడించాడు. మొత్తం రెండు వేలకు పైగా గీతాలు రచించాడు. దాశరధి రచించిన అనేక గీతాలు వస్తు వైవిథ్యంతో సామాజిక విలువల్ని కలిగి ఉండి, వాటికి సాహిత్య గౌరవం దక్కింది. విషాద, వినోద అభ్యుదయ గీతాలతో పాటు అనేక బాలల గీతాలు కూడా రాశాడు. అలాగే దాశరథికి వీణ పాటల రచయితగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దాశరథి రచించిన ”ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” అనే గేయం ఇప్పటికీ ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
దాశరథి అనేక నాటికలు రచించాడు. అందులో 9 నాటికలు ‘నవమి’ పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. అవి, వాసనలేని పూలు, యశోదర, చిత్రాంగద, మహా శ్వేత, నేనొక్కన్నే కాను, స్వాతంత్య్ర వాహిని, గోల్కొండ నియాన్ లైటు తుంగభద్ర అనేవి ఉన్నాయి. దాశరధి ‘మహా శిల్పి జక్కన’, అనే పేరుతో ఒక నవల రాశాడు. అనేక వ్యాసాలు రాశాడు. ‘అన్నమయ్య, విద్యావతి, తెనాలి రామకష్ణుడు, పోతనమాత్యుని కవితాశిల్పం, విపులాచపథ్వి, అమెరికా సందర్శనం, మలేషియాలో తెలుగు వెలుగు, మలయ భాషా స్వరూప స్వభావాలు, మహాభారతంలో ఉపఖ్యానాలు, మహాకవి మీర్జా గాలిబ్ అనే వ్యాసాలు ‘వ్యాసపీఠం’ పుస్తకంగా వచ్చాయి. అనువాదకుడిగా కూడా దాశరథి కషి విశేషంగా ఉంది. అనేక ఉర్దూ కవితల్ని తెలుగులోకి అనువదించాడు. అంతేకాక అబ్దుల్ హలీం హారర్ రచించిన ‘ప్రాచీన లక్నో’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు.
‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణించెనో అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టెద” నని గర్జించడమే కాదు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తను పుట్టిన నేల కోసం గొంతెత్తి నినదించి తన కవిత జంఝా మారుతంతో తెలుగుదేశాన్నంతటినీ కదిలించి సంచలనంలో ముంచెత్తిన దాశరథిని మహాకవిగా గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ప్రభుత్వం దాశరథిని ఆస్థాన కవిగా నియమించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆస్థాన కవి పదవిని రద్దు చేసింది. అందుకు దాశరథి మానసికంగా ఎంతో కంగిపోయాడు. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ 1987 ఆగస్టులో గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలోంచి కోరుకున్నాడు. మళ్లీ అనారోగ్యంతో సెప్టెంబర్ 20 నాడు హైదరాబాదులోని ‘మదర్ థెరిసా’ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అక్టోబర్ 16న ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్దనే ఉండి చికిత్స చేయించుకుంటూ 1987 నవంబర్ 5న ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచాడు.
– డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681