సాహిత్యం మానవత్వానికి దారి దీపం

– మనశ్శాంతి కోవెల నవల ఆవిష్కరణ సభలో ఐఏఎస్ టి చిరంజీవులు
నవతెలంగాణ – కంటేశ్వర్
సాహిత్యం మానవత్వానికి దారి చూపుతోందని, మానవత్వం సాహిత్యానికి దోహదకారి అవుతుందని ఒకదానికి ఒకటి విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయని తెలంగాణ ప్రభుత్వ పూర్వ కార్యదర్శి టి చిరంజీవులు అన్నారు. ఈ మేరకు ఆదివారం  సాయంత్రం ఆయన హరిదారచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ మద్దుకూరి సాయిబాబు రచించిన మనశ్శాంతి కోవెల నవల ఆవిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నవలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలోనే గొప్ప సమాజ సేవకునిగా మంచి పేరు తెచ్చుకున్న సాయిబాబు తన ప్రవృత్తి అయిన సాహిత్య రంగంలో మానవత్వమే ఇతివృత్తిగా రచనలు సాగించడం అభినందనీయమని అన్నారు. ఈ రోజుల్లో ఆశయం పేరు చెప్పి ఎదిగే వాళ్ళు చాలా కనబడతారని, ఆశయం కోసం తన సాహిత్యాన్ని జీవితాన్ని సమర్పణం చేసుకొనే సాయిబాబు నేటి యువతరానికి ఆదర్శమని అన్నారు. మానవత్వం రక్త సంబంధానికి అతిదమని మనశ్శాంతి కోవెల నవల మనకు వివరిస్తుందని ఆయన తెలిపారు. సభలో ” సాహిత్యం – మానవత్వం” అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరః మాట్లాడుతూ మానవతామూర్తులు సాహిత్యంలో రాణించిన సమాజంపై చెరగని ముద్ర వేసిన సాహితీవేత్తల గురించి ఆయన వివరించారు. ఆ కోవలో మన నిజామాబాద్ కవి, రచయిత సాయిబాబు ఉండడం ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. సాహిత్య లక్ష్యం మానవత్వం అయినప్పుడు సమాజానికి అనేక సమస్యలు పరిష్కరింపబడుతాయని ఆయన అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ మానవతా దృష్టి హృదయంలో పుడుతుందని అది ఒక వెలుగుగా మారి జీవితాలను పునరుజ్జీవింప చేస్తుందని అన్నారు. సాయిబాబుతో పరిచయం ఈ అనుభూతిని అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా దృక్పథాన్ని అటువైపు మారుస్తుందని తెలిపారు. జిల్లా సాహిత్యంలో వైవిధ్యంగా మానవత్వమే ఇతివృత్తంగా ముందుకు సాగుతున్న వ్యక్తి సాయిబాబు అని అభినందించారు.  హైకోర్టు సీనియర్ న్యాయవాది ఐ గోపాల్ శర్మ మాట్లాడుతూ ఈరోజు సమాజంలో ఇంత అభివృద్ధి జరిగిందో, అంత స్వార్ధపరత్వం పెరిగిందని దానిని అధిగమించడానికి సాయిబాబా లాంటి మానవత సిద్ధాంతంలో పనిచేసే వ్యక్తి ఎంతో అవసరమని అన్నారు. ప్రముఖ కవయిత్రి డాక్టర్ అమృత లత మాట్లాడుతూ చెప్పిన పనిని నిజాయితీగా చేయడంలో సాయిబాబు తనకు బాగా నచ్చాడని, అందుకే తన వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ ప్రతిమరాజ్,  నరాల సుధాకర్, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, త్రివేణి,, తిరుమల శ్రీనివాస్ ఆర్య, కంకణాల రాజేశ్వర్,  దారం గంగాధర్, సుమీల శర్మ, లక్ష్మి, తొగర్ల సురేష్, వరలక్ష్మి, మండల సుధా, హరిప్రియ ఈ కార్యక్రమంలో కవులు రచయితలు పలువురు సంఘ సేవకులు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మద్దుకూరి సాయిబాబు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాల ఏ.వి మనసులను కరిగింపజేసింది. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి, అనంతరం రచయిత డాక్టర్ మద్దుకూరి సాయిబాబుకు సభలో ఘనంగా సన్మానించారు.