– ఛత్తీస్‌గఢ్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణాలపై…
– 24 గంటల కరెంటు సరఫరాపై అఖిలపక్షం
– కరెంట్ సెంటిమెంట్‌ను ఆర్థిక అవసరాలకు వాడుకున్నారు
– ప్రతిపక్షం కోరినందుకే విచారణ : అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి
గడచిన పదేండ్లలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా తీరుతెన్నుల సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజనిర్థారణ కమిటీ నియమిస్తామన్నారు. అంతకుముందు బీఆర్‌ఎస్ సభ్యులు, మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ శాఖ ‘శ్వేతపత్రం’పై మాట్లాడుతూ అప్పుల గురించే మాట్లాడుతున్నారనీ, కూడబెట్టిన ఆస్తుల గురించి ప్రస్తావించట్లేదనీ, తప్పులు జరిగినట్టు భావిస్తే న్యాయ విచారణ జరిపించాలని సవాలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షం విజ్ఞప్తి మేరకే న్యాయవిచారణకు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కరెంట్ అనే సెంటిమెంట్‌ను ఆర్థిక అవసరాలకు గత ప్రభుత్వం వాడుకుందని విమర్శించా రు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందం పూర్తి లోపభూయిష్టంగా ఉందని తాము గతంలో చెప్తే, అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఇప్పుడు దీనివల్ల వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని చెప్పారు. ”ఈ ఒప్పందంతో ప్రభుత్వంపై రూ.1362.42 కోట్ల భారం పడింది. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా, ఎలాంటి టెండర్లు లేకుండా అధిక ధరకు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు 2014 నవంబరు 3న ఒప్పందం చేసు కున్నారు” అని తెలిపారు. ఈ ఒప్పంద ంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)లోనూ వాదనలు వినిపించామని గుర్తుచేశారు. ఆనాడు అసెంబ్లీలో దీనిపై ప్రశ్నించిన తమను మార్షల్స్‌తో బయటకు గెంటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో పని చేసిన తెలంగాణ విద్యుత్ జేఏసీ నిపుణుడు ఛత్తీస్ గఢ్ ఒప్పందం రాష్ట్రానికి ఆర్థికంగా భారమనీ నిజాలు చెప్పి, దీనిపై నివేదిక ఇవ్వడంతో పాటు ఈఆర్సీలో వాదనలు వినిపించారని గుర్తుచేశారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సదరు అధికారికి స్వరాష్ట్రంలో ప్రమోషన్ ఇవ్వకపోగా మారుమూల ప్రాంతానికి డిమోషన్‌తో బదిలీ చేశారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం, నిర్లక్ష్యంపై కేసులు నడుస్తున్నాయనీ, ఫిక్స్‌డ్, వేరియబుల్ చార్జీలకు సంబంధించి ఛత్తీస్‌గడ్ ఈఆర్‌సీలో కేసు నడుస్తున్నదని తెలిపారు. న్యాయ విచారణలో గత ప్రభుత్వ ఉద్దేశ్యాలు ఏమిటో వెల్లడవుతాయని అన్నారు.
ఇండియా బుల్స్ కోసం భద్రాద్రి నిర్మాణం
భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోనూ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 1080 మెగావాట్ల భద్రాద్రి ప్రాజెక్ట్‌ను రెండేండ్లలో నిర్మాణం చేస్తామని చెప్పి, ఒక్క మెగావాట్‌కు రూ.6.75 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, రిపోర్టులు ఇచ్చారని వివరించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీని కాదని, నిబంధనలకు విరుద్ధంగా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వినియోగించారని చెప్పారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఏడేండ్లు పట్టిందనీ, ఒక్క మెగావాట్ వ్యయం రూ.9.74 కోట్లకు పెరిగిందని తెలిపారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కేటిపీఎస్ యూనిట్‌ను 48 నెలల్లో ఒక్క మెగావాట్ వ్యయం రూ.8.02 కోట్లతో నిర్మించినప్పుడు, భద్రాద్రి వ్యయం ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. కేవలం గుజరాత్‌కు చెందిన ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి, కమిషన్లు దండుకోవడం కోసం రాష్ట్రాన్ని ముంచేశారని విమర్శించారు.
యాదాద్రి అంతే…
నాలుగు వేల మెగావాట్ల వ్యవస్థాపక సామర్థ్యం కల్గిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి, 8 ఏండ్లయినా పూర్తి చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అంటూ బీహెచ్‌ఈఎల్‌కు 2015 జూన్ 1వ తేదీ నామినేషన్‌పై కేటాయించారన్నారు. అదే బీహెచ్‌ఈఎల్ సంస్థ జార్ఖండ్‌లో కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో 18శాతం తక్కువకు కోట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఒక్క మెగావాట్‌కు రూ.6.27 కోట్ల వ్యయం అవుతుందని రిపోర్టులో పేర్కొన్నారనీ, కానీ ఇప్పటికే దీని నిర్మాణ వ్యయం ఒక్క మెగావాట్‌కు రూ.9 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. అదే సమయంలో ఎన్‌టీపీసీ రామగుండంలో నూతన టెక్నాలజీతో నిర్మించిన తొలి దశ పవర్ ప్లాంట్ మెగావాట్‌కు రూ.7.63 కోట్లకే పూర్తయ్యిందని చెప్పారు. దీనిపైనా న్యాయవిచారణ జరిపిస్తామన్నారు.
సోలార్ అంతా ప్రయివేటుకే…
పవర్ ప్లాంట్‌ల స్థాపిత సామర్థ్యం పెంచామని గొప్పలు చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు వారి హయాంలో కట్టింది కేవలం ఒకే ప్రాజెక్ట్ అనీ, అదికూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిందే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 74 మెగావాట్ల నుంచి 5,600 మెగావాట్లకు పెంచామని చెప్తున్నారనీ, దీనిలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది కేవలం ఒక్క మెగావాట్ మాత్రమే అని ఆయన వివరించారు. మిగిలిన సోలార్ ప్లాంట్లన్నీ ప్రయివేటు రంగంలో వచ్చినవేనని చెప్పారు.
24గంటల విద్యుత్‌పై అఖిల పక్షం
వ్యవసాయానికి 24గంటల కరెంట్ సరఫరాపై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు సరఫరా చేయలేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ప్రతిపక్ష సభ్యులు దబాయింపుగా మాట్లాడుతున్నారనీ, సబ్‌స్టేషన్లలో ఉండాల్సిన లాగ్ బుక్‌లు హైదరాబాద్‌కు ఎందుకు తెప్పించారని అడిగారు. వ్యవసాయానికి అవసరమయ్యే త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఇచ్చి 24గంటలు ఇచ్చామని చెప్పుకున్నారని విమర్శించారు. అఖిలపక్షం నిజనిర్ధారణ కమిటీలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కూడా సభ్యునిగా నియమిస్తామన్నారు.
సంక్రాంతి తర్వాత ఓటాన్ అకౌంట్?
సంక్రాంతి తర్వాత (జనవరి మూడోవారంలో) రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నది. అందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి మొదటివారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికానికి సరిపోయేంత బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదించనుంది. ఆ తర్వాత తొమ్మిది నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ లోపు రాష్ట్రానికి వస్తున్న ఆదాయ,వ్యయాలపై ఒక అంచనాకు రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.