ఏజెన్సీలో ఉత్తమ విద్యను అందిస్తున్న లిటిల్‌ ఫ్లవర్స్‌

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంస
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిన లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థల విద్యార్థులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలలో 467 అత్యధిక మార్కులు సాధించడమే కాక 49 మంది విద్యార్థులు 400 మార్కులు దాటి విద్యా ప్రపంచంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పారని కొనియాడారు. ఉన్నతమైన ఆశయాలతో కీర్తిశేషులు మాగంటి సూర్యం ఏజెన్సీ ప్రాంతంలో లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థలను నెలకొల్పారని సూర్యం తదనంతరం ఆయన కుమారులు కూడా మాగంటి ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రంలోనే లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థలను అగ్రస్థానంలో నిలుపుతున్నారని ప్రశంసించారు. ఇంటర్‌ ఫలితాలతో పాటు జేఈఈ పరీక్షలలో కూడా లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించి కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీపడి నిలిచారని గుర్తు చేశారు. ఇంటర్‌ విద్యతోపాటు పదో తరగతి పరీక్ష ఫలితాలలో కూడా గత 20 సంవత్సరాల నుండి లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యా సంస్థలే అగ్రస్థానం నిలవటం భద్రాచలం ఏజెన్సీకి గర్వకారణమని తుమ్మల కితాబ్‌ ఇచ్చారు. ఉన్నత ఆశయాలతో ఏజెన్సీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తయారు చేస్తున్న లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్‌బాబు, రమేష్‌బాబులను మంత్రి తుమ్మల ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ మాగంటి ప్రసాద్‌బాబుచ ఉపాధ్యాయులు బషీర్‌, ర్యాంకులు సాధించిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.