– స్కూల్ బస్సు కింది నలిగి మరణం
– బాచుపల్లిలో గుంతల రోడ్డుపై స్కిడ్ అయిన స్కూటీ
నవతెలంగాణ- దుండిగల్
భారీ వర్షాలకు గుంతలమయమైన మహానగర రోడ్డు చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైంది. ఇందుకు స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు వేగమూ తోడైంది. రోడ్డుపై గుంత వల్ల స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోయిన చిన్నారిపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో పసికందు విలవిల్లాడి ప్రాణం విడిచింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాచుపల్లి నివాసితుడు కిషోర్ కూతురు దీక్షిత(8) బౌరంపేట్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 3వ తరగతి చదివేది. రోజూ కిషోర్ స్కూటీపై దీక్షితను స్కూల్‌కి తీసుకెళ్తాడు. అదేవిధంగా బుధవారం ఉదయం కూడా వెళ్తుండగా
బాచుపల్లి రెడ్డిల్యాబ్స్ వద్ద గుంతల రోడ్డుపై స్కూటీ కొంత అదుపుతప్పడంతో దీక్షిత కింద పడిపోయింది. అదే సమయంలో వెనుకాల వేగంగా వచ్చిన భాష్యం స్కూల్ బస్సు స్కూటీని ఢకొీట్టి చిన్నారిపై నుంచి వెళ్లింది. బస్సు వేగంగా ఉండటం వల్ల డ్రైవర్ రహీం అదుపు చేయలేకపోయారు. దాంతో దీక్షిత అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తండ్రి చేయి విరిగింది. స్థానికులు వెంటనే బాచుపల్లి పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్కూల్ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీక్షితను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.