సంక్షుభిత వ్యవస్థకు సజీవ సాక్ష్యాలు

to the crisis system
Living testimoniesరచయిత సమాజ మార్పును ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకోవాలి, సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించాలి. తనదైన దక్పథాన్ని ఏర్పరచుకోవాలి. ఆ దక్పథం ప్రగతి శీలమైనదై ఉండాలి. వస్తు, శిల్పాల మధ్య సమన్వయ ధోరణితో కథ రాసే సత్తా ఉండాలి. నిజానికి కథే కథకుడి స్థానాన్ని నిర్ణయిస్తుంది. అతడి నిజాయి తీని బయటపెడుతుంది. నిర్దయగా కథను విమర్శకు పెడుతుంది. అంతే నిర్దయగా వదిలేస్తుంది కూడా. అందుకే కథకుడు కథా నిర్మాణం, నేపథ్యం, వస్తువులపై ఎప్పటికప్పుడు జాగురూకతతో వ్యవహరిస్తూ నవ్యత వైపు అడుగులేయాలి. ఈ దష్టితో చూసినప్పుడు దేశ రాజు కథా సంపుటి ”రొమాంటిక్‌ డాగ్‌” పాత, కొత్తల మేలు కలయిక. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబం ధాలే అన్న సత్యాన్ని మరోసారి గుర్తు చేసే కాంతివీచిక. గ్లోబలైజేషన్‌ పీరియడ్‌లో బంధాల కొలతలను మానవీయ దష్టితో తూచే సాహిత్యపు త్రాసు.
దేశరాజుకున్న బహుళత్వం ఈ పుస్తకంలోని పన్నెండు కథల్లో సుస్పష్టంగా కనిపిస్తుంది. వస్తువు ఎంపిక, శిల్పాలను బట్టి కథల మధ్య అంతస్సూత్రత లేకపోయినా, కథకుడికి సమాజంపై ప్రేమపూర్వక స్పందన ఉందనిపిస్తుంది. రాతి హదయాలను తట్టి లేపి, ప్రేమగా బతకడం ఎలాగో నేర్పాలన్న తపన ఉంది. కోల్పోతున్న సామూహిక వ్యవస్థలోని బంధాలను పొదివి పట్టుకుని వైక్తిక పోకడలతో వెళ్తున్న అత్యాధునిక యువతకు అందించాలన్న స్పహ ఉంది.
ఆధునికత తెచ్చిన అభివద్ధి మంత్రంలో దాగిన గుట్టు రట్టు చేసి, మనిషి తన సహజత్వాన్ని కోల్పోతున్న తీరును బలంగా చెప్పాలన్న ఆశా ఉంది. బల్లపరుపుగా జీవించడం సౌఖ్యం కాదు, గుండ్రంగా తిరగడంలోనే మార్మిక సౌందర్యం ఉందని, దాన్ని మనుషులకు చూపించాలన్న కోరికా ఉంది. తన కథల ద్వారా భూత, వర్తమాన బతుకుచిత్రాన్ని తవ్వి, భవిష్యత్తుకు సుందర వనాన్ని నిర్మించి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో అక్కడక్కడా శిల్పాన్ని వస్తువు డామినేట్‌ చేయొచ్చు, శిల్పం సాగి వస్తువును కప్పేయవచ్చు. ఏది ఏమైనా ఒక కథకుడిగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడీ రచయిత. ఇంకా సాగించే ధైర్యం అతని కథలకూ ఉంది. వస్తు విస్తతి, సారంలో సాంద్రత ఉన్న కొన్ని కథల్లో వర్తమాన ప్రపంచ వైవిధ్యంతో పాటు, భిన్నత్వమూ కనిపిస్తుంది. ఏకథకాకథ స్వయం సంవేదనతో ప్రకాశిస్తుంది.
కూతురిపైనే అఘాయిత్యం చేసిన భర్తపై కోర్టుకెక్కినా, న్యాయం జరగని ఒక స్త్రీ తీసుకునే తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తుంది ”ఓ తల్లి తీర్పు” కథ. ”దణ్ణాలు పెట్టినా, అదేంటో.. ఆ మాయదారి దేవుడు మగాడివైపే నిలబడుతూ వున్నాడు. అవున్లే ఎంతైనా ఆయనా మగాడు కదా” అని మగ దేవుళ్ళపై వేసే సెటైర్‌, మహిళా న్యాయవాదు ల్లోనూ కనిపించే పురుష స్వభావం, ”ఆడు అదురుష్టవంతుడ్రా.. తల్లీ కూతురు- ఇద్దరినీ” అని కథలో సందర్భానుసారంగా పురుషుల మనస్తత్వాలను నిప్పుల కాల్వలా కవాటాలు పగులగొట్టి మరీ గుండెల్లోకి ప్రవహింపజేస్తాడు రచయిత.
మనుషులకంటే కుక్కే మేలని, గొప్పదని నిరూపించే కథ ”రొమాంటిక్‌ డాగ్‌”. కామవాంఛను తీర్చుకునేందుకు మగ కుక్క, ఆడకుక్క కోసం వెతకడం, ఆ వెదకడంలో జరిగే సంఘటనలు, సంఘర్షణలు ఇందులో ప్రధాన వస్తువు. అయితే కథకుడు ఆ సంఘటనల్లో హిందూ – ముస్లీం గొడవ, ముస్లీం – క్రిస్టియన్ల తగాదా, భక్తి పేరుతో జరిగే డబ్బు, హోదా, అలంకరణల ప్రదర్శన, పేదలు, ఖరీదైన భక్తుల మధ్య ఆంతర్యాలను ఘాటైన రియలిస్టిగ్గా కూర్చాడు. గొడవల్లో మతాలు కాదు, మనుషులే మరణిస్తారన్న వాస్తవాన్ని ధవీకరించాడు. ”ఇండియా దటీజ్‌ భారత్‌ అని రాజ్యాంగంలోనే వుందని” తాగి తూలే మనిషి కుక్కను బెదిరిస్తే, అది మొరిగితేనే అతను భయపడి పారిపోయాడని కథను ముగిస్తాడు. వ్యంగ్యాన్ని అస్త్రంలా సంధించిన ఈ కథలో ”ఆవులా కుక్క పవిత్రమైన జంతువు కాకపోవడంతో, అది పేపర్లు తినదు. దాంతో దానికి తాజా వార్తలేమీ తెలియవు. లేకపోతే చిన్నచిన్న సంఘటన లకే మనుషులు నిట్టనిలువునా ప్రాణాలెందుకు తీసుకుంటున్నారో అని విచారం వ్యక్తం చేసేది” అంటాడు. కథలో రచయిత ప్రవేశం ఏమేరకు? అనే ప్రశ్నను పక్కన పెడితే, రచయిత దష్టికోణాన్ని, కథ అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ వాక్యాలు మనలోని చీకటి గోడల్ని బద్దలు కొడతాయి. కొంత భావాత్మక శైలిలో నడిచినా కథ ఆసాంతం చిక్కని కాఫీలా లోపలకెళ్లి, కాషాయంలా మనసుల్లో కెక్కిన మత పిచ్చి రోగాన్ని నయం చేస్తుంది.
సమాజ పరిణామంలో మంచిచెడు బేరీజు వెయ్యా లంటే మార్పు వెనకున్న గుణాత్మకతను పసిగట్టాలి. అలా పసిగట్టి ప్రేమ, పెళ్లిళ్లలో వచ్చిన అత్యాధునిక ధోరణిని వివరించే కథే ”తలుపులు”. మూడు తరాల స్త్రీల ద్వారా వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పును వివరించాడు. ”తలుపులు”ని పాత్రల ఆలోచనలు, సంఘర్షణలు, సన్నివేశాలు, హదయాలకు ప్రతీక చేయడం ఈ కథలో దేశరాజు చేసిన గొప్ప ప్రయోగ మనే చెప్పాలి.
మరో అరుదైన కథ ”రేటింగ్‌”. వర్తమాన విపణిలో కార్పొరేట్‌ ఉద్యోగుల నుంచి స్విగ్గీ జొమాటోల వరకు, అధికారుల పనితీరు నుంచి ఆటో డ్రైవర్ల బతుకు వరకు నిర్ణయించేది రేటింగే. ఆ రేటింగ్‌లోని భిన్నకోణాలను, మనుషుల ఆర్థిక, హార్ధిక స్థాయిలను చర్చకు పెట్టి, తీర్పు చెప్తుందీ కథ. యాప్స్‌ యాంత్రికమైన మనిషి జీవిత చట్రాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో నగంగా నిలబెట్టి చూపుతుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీతాల వెనుక, సంచార జాతికి చెందిన బాత్‌ రూమ్స్‌ క్లీన్‌ చేసే కూలీల బతుకుల వెనుక ఉన్నది డబ్బే అంటుంది. భార్యల ప్రవర్తనకు భర్తలు కూడా అంగీకార యోగ్యులుగా మారారన్న గ్లోబలైజేషన్‌ ఆర్థికసత్యాన్నీ వెల్లడిస్తుంది. ”ఆత్మాభిమానాలు చంపేసుకోవాలి. అంగాంగాలను కోసి కాకులకు గద్దలకు వేసినట్టు.. మనలాంటి మునుషుల ముందే వెదజల్లాలి. అప్పుడే పైసలు వస్తారు. రేటింగ్స్‌ వస్తారు” కథలోని ఈ ఒక్క విశ్లేషణ చాలు కథకుడికి నేటి సంక్షుభిత సమాజంపై ఉన్న తీవ్ర నిరసన అర్థం చేసుకోడానికి.
ప్రకతిలో భాగమైన మనిషి ప్రకతినే ధ్వంసం చేస్తున్న సమకాలీనతలోంచి పుట్టిన కథే ”అడవంటుకున్నాది”. అందమైన అడవుల్ని మైనింగ్‌ మాఫియా దోచుకుంటోంది. ప్రభు త్వాలు, పెద్ద దేశాలతో కలిసి కపట నాటకాలాడు తున్నాయి. అడవే సర్వస్వంగా బతికే అడవిబిడ్డల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రకతితో కలిసి జీవించాల్సిన మనిషి, నాగరికత, అభివద్ధి అంటూ ప్రకతినే నాశనం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్నాడు. కవితాత్మకభాషలో సాగే ఈ కథ నిండా ప్రతీకలు, భావచిత్రాలు, రూపకాలు స్వభావసిద్ధంగా ఆకట్టుకుంటాయి.
హంగులు, ఆర్భాటాల కన్నా కథకు స్పష్టత ముఖ్య మని చాటే వీటిలోని ”సాఫ్ట్‌ టార్గెట్‌” మొబైల్‌ టెక్నాలజీ, సమాచారవ్యవస్థ మాస్టారు, విద్యార్థుల రిలేషన్‌ ను ఎలా దెబ్బతీసిందో వివరిస్తుంది. ”వేషం” నానమ్మ, అమ్మమ్మలను నేటితరం ఎలా పాతచింతకాయ పచ్చడిలా భావిస్తుందో, ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ కాకపోతే వచ్చే కష్టాలేంటో కుటుంబ వాతావరణం లోంచి విశ్లేషిస్తుంది. ముసలివాళ్లైన తల్లిదండ్రులను పిల్లలు వదిలేసినా, ఫ్రెండ్స్‌ వదలరంటుంది ”సిగల్స్‌” కథ. ప్రపంచీకరణ వలలో చిక్కుకున్న మనిషి ఆశ నుంచి సంపాదననే దురాశవైపు పరుగులు పెడితే జీవితం ఎలా దుర్భరమైపోతుందో కళ్ల ముందు నిలబెడుతుంది ”బుద్ధుడి నవ్వు”.
కథనపరంగా వీటిలో ఎక్కువ భాగం ”పాత్రకేంద్ర” కథలు. అంటే సంఘటన, సన్నివేశం, భాషలవంటి వాటికన్నా పాత్రలేప్రధానంగా సాగుతాయి. ”ఓ తల్లి తీర్పు”లో అమ్మ, ”సాఫ్ట్‌ టార్గెట్‌”లో మాస్టారు, ”వేషం” లో బామ్మ, ”రొమాంటిక్‌ డాగ్‌”లో కుక్క, ”లోగుట్టు”లో తల్లి, ”రెక్కలు”లో అమ్మ.. ఇలా పాత్రలే కథను నడుపు తాయి. ప్రధాన పాత్ర స్వభావం, ఆలోచనాధోరణి, లక్ష్యం, ప్రవర్తన, సంఘర్షణలే ఇతర పాత్రలతో, వాతావరణంతో కలిసి కథకు పరిపూర్ణత తెస్తాయి. రచయిత దష్టికోణంలో సాగే కథల్లో రచయిత చొరవే కథను చెప్తుంది లేదా చూపిస్తుంది. అలాగే కథలో రచయిత ప్రవేశించి తను అనుకున్న సందేశాన్నో, కథా ర్థాన్నో, పాత్ర ప్రవర్తన వెనకున్న అంతరార్థాన్నో చెప్తుంటాడు. పాఠకులకు రచయిత కథోద్దేశ్యం అందుతుందో లేదో అన్న మీమాంసతోనో, కథను రక్తికట్టించడంలోని రసైక్యతను పంచడం కోసమో కథ మధ్యలో పాఠకులతో సంభాషిస్తాడీ కథకుడు.
”అడవంటుకున్నాది” కథ ఓపెన్‌ ఎండింగ్‌తో ముగిస్తే, ”కొత్త రెక్కలు” చెమటతో తడిసిన వాళ్లు చరిత్ర ను మారుస్తారు అని పాత్ర నిర్ణయంతో క్లోజ్డ్‌ ఎండింగ్‌ తో ముగుస్తుంది. అలాగే ”రేటింగ్‌” పాత్ర ఆలోచనలో వచ్చిన మార్పుతో క్లోజ్‌ అవుతుంది. దేశరాజులో రాయా లనే తపనతో పాటు ఇతివత్తాల ఎంపిక, వైవిధ్యంగా పాత్రలను తీర్చిదిద్దేవిధానం, భాషలో వ్యవహారిక, పాత్రోచిత ఔచిత్యం గొప్పగా అనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని కథలు చదువుతుంటే నేటితరం కథకుల సరసన నిలబడాలంటే పాతపోకడలు వదిలేసి, ఇతివత్తాల ఎంపిక, కథన పద్ధతుల్లో కొత్తదనం కోసం ఇంకా కొంత సాధన అవసరమనిస్తుంది. ఏది ఏమైనా నేటి సమాజ తీరుకు ప్రత్యక్షసాక్ష్యాలు ఈ కథలు.
డా|| ఎ. రవీంద్రబాబు
8008636981