ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. ఏడాదికేడాది సాధికారత దిశగా మహిళలు పరుగులు తీస్తూనే ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తలుగా తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. సామాజిక అసమానతలను సవాల్ చేస్తూ సమానమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు శ్రమిస్తూనే ఉన్నారు. స్టార్టప్‌ల నుండి సామాజిక మార్పుకై ఉద్యమాలు నడిపిన మహిళల సాహస గాథలు మనచుట్టూ ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది కొత్త ఆవిష్కరణలకు వారు నిదర్శనంగా నిలిచారు. కలలు కనే ప్రపంచం కోసం అసమాతలను ధిక్కరించే స్వరాలుగా వెలిశారు. 2024ను మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చే ఏడాదిగా మార్చిన వారి చిరుపరిచయాలు నేటి మానవిలో…
తన రాతను తిరిగి రాయడానికి
మనాలికి చెందిన టెన్జిన్ డోల్మా 15 ఏండ్ల వయసులో వివాహం చేసుకుంది. 30 ఏండ్ల వయసులో పరుగు ప్రారంభించింది. హిమాలయాల్లో అత్యంత భయంకరమైన మారథాన్‌లలో కొన్నింటిని గెలుచుకుని తన పట్టణంలోని ఏకైక మహిళా మారథానర్‌గా నిలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఆసియాలోనే ఎత్తైన గ్రామమైన కోమిక్‌లో జన్మించిన డోల్మా పేదరికంతో పోరాడుతున్న ఆ కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో చిన్నది. బాల్య వివాహం వల్ల అవకాశాలను పోగొట్టుకునే చాలా మంది మహిళల్లా కాకుండా డోల్మా తన రాతను తానే తిరిగి రాసుకుంది. అత్తమామల రూపంలో ఆమెకు ఓ సహాయక వాతావరణం కనిపించింది. ఏడేండ్ల కిందట మనాలిలో 21కె మారథాన్ చేయాల్సిందిగా స్నేహితురాలు సలహా ఇచ్చినప్పుడు డోల్మా ఎంతో ఇష్టంగా తన పేరు నమోదు చేసుకుంది. ఆ రేసులో ఆమె పోలీసు కుటుంబాల నుండి వచ్చిన మహిళలతో సహా అనుభవజ్ఞులైన రన్నర్లను ఓడించింది. అంతేకాదు హెల్ అల్ట్రాను సమయ పరిమితిలో పూర్తి చేసిన మొదటి మహిళగా అవతరించింది. ఇదే ఆమెను సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో జరిగిన క్రూరమైన రేసు లాహౌల్‌లోని స్నో మారథాన్‌కు తీసుకెళ్లింది.
వయసు అడ్డంకులు బద్దలు కొట్టి
డెబ్బై రెండేండ్ల విజి వెంకటేష్… ది మ్యాక్స్ ఫౌండేషన్‌కు భారతదేశంతో పాటు దక్షిణాసియాకు రీజియన్ హెడ్‌గా ఉన్నారు. ఇది లాభాపేక్షలేని సంస్థ. భారతదేశంలోని క్యాన్సర్ కేర్ కమ్యూనిటీకి మూలస్తంభం. ఈ రంగంలో ఆమెకు 35 ఏండ్ల అనుభవం ఉంది. 2002 నుండి ఈమె ది మాక్స్ ఫౌండేషన్‌లో పనిచేస్తున్నారు. గ్లివెక్ ఇంటర్నేషనల్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రాంకు నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక నోవార్టిస్ ఆంకాలజీ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఏడాది ఈమె అఖిల్ సత్యన్ దర్శకత్వంలో నటుడు ఫహద్ ఫాసిల్‌తో కలిసి ‘పచ్చుం అల్బుతావిలక్కుమ్’ చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం కూడా చేశారు.
నటనతో పాటు…
సినిమాకి అతీతంగా నటి సమంతా రూత్ ప్రభు… నటనతో పాటు ణ2జ ఫ్యాషన్ ప్రపంచంలోకి కూడా అడుగు పెట్టింది. నోరిష్ యుతో సహా బ్రాండ్‌ల సీడ్ ఫండింగ్ రౌండ్‌లలో కూడా పాల్గొంది. ఇటీవలె వెల్‌నెస్ స్టార్టప్, సీక్రెట్ ఆల్కెమిస్ట్‌లో సహ వ్యవస్థాపకురాలిగా పెట్టుబడి పెట్టింది. జుట్టు పెరుగుదల, కీళ్ల నొప్పులు, చర్మ సంరక్షణ కోసం ఈ సంస్థ నూనెలను ఉత్పత్తి చేస్తోంది. ‘నేను ఈ ఉత్పత్తులను నమ్ముతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి మంచి చేసే బ్రాండ్‌లలో భాగం కావడం చాలా అవసరం. అర్థవంతమైన ప్రభావాన్ని చూపే ఆలోచనలు, బ్రాండ్‌ల విషయంలో నేను సంతోషిస్తున్నాను. అయితే నా ఆశయాలు గొప్ప ఉద్దేశ్యంతో ముడిపడి ఉండాలి. అర్ధవంతమైన ప్రభావాన్ని చూపాలి’ అంటుంది సమంతా రూత్.
వైకల్యాన్ని జయించింది
గీతా కన్నన్ పోలియోతోపాటు నీటి భయంతో పెరిగింది. శరీర కదలికలపై నియంత్రణను తిరిగి పొందడానికి మూలకంతో స్నేహం చేసింది. తన వైద్యం కోసం చేసిన ప్రయాణంలో నీటితో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం 43 ఏండ్ల వయసులో చెన్నైకి చెందిన ఈమె పారాలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్. ఈ ఏడాది మార్చిలో జరిగిన తమిళనాడు రాష్ట్ర స్థాయి పారాలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈమె దక్షిణ చెన్నై శివారులోని తాంబరంలోని తన ఇంటి నుండి పెరియమేడు వరకు ప్రతిరోజూ 34 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. ఇందులో రాంప్, కుర్చీ లిఫ్ట్‌తో కూడిన ఏకైక కొలను ఉంది. ఈ కుర్చీ లిఫ్ట్ ఆమె నీటిలోకి, బయటికి రావడానికి సహాయం చేస్తుంది. అనేక మంది పారా స్విమ్మర్లు, ఔత్సాహికులకు గీత గేమ్ ఛేంజర్‌గా మారారు.
వైరల్ దాదీలు
50 ఏండ్లు పైబడిన ఏడుగురు మహిళలతో కూడిన ఓ వీడియో ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షకుల హృదయాలను దోచుకుంది. వారే బాలీవుడ్ చిత్రం బాడ్ న్యూజ్‌లోని తౌబా తౌబా పాటకు నృత్యం చేసిన మహిళలు. కర్ణాటకలోని బెల్గామ్‌లో ఒక సాధారణ వృద్ధాశ్రమం వలె ప్రారంభమైనది శాంతై వృద్దాశ్రమం. ఇప్పుడు భారతదేశం అంతటా ఖ్యాతిని పొందింది. దానికి కారణమైన ఈ వృద్ధ మహిళలకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. వారు తమ నృత్య కదలికలతో సోషల్ మీడియాలో ప్రసిద్ధ పాటలకు నృత్యం చేస్తూ తమ యవ్వనాన్ని పునరుజ్జీవింపజేస్తున్నారు. వారిని ఇప్పుడు ఇంటర్నెట్‌లో ”వైరల్ దాదీలు” అని పిలుస్తున్నారు. దాదీ అంటే హిందీలో అమ్మమ్మ. గత సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ప్రస్తుతం 37,000 మంది ఫాలోవర్లను కలిగి ఉంది. అనేక మంది యువ సోషల్ మీడియా వినియోగదారులతో పాటు ప్రముఖులు వారికి మద్దతు ఇస్తున్నారు.
స్ట్రీమ్‌లో మహిళలకు సాధికారత
ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ అనే సంస్థను 2007లో లింగ సమానత్వం కోసం తన గొంతు విప్పిన న్యాయవాది గాయత్రి బురగోహైన్ స్థాపించారు. మహిళల జీవితాలను రూపొందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆమె గుర్తించారు. ‘మహిళలు సాంకేతిక నైపుణ్యాలను కలిగి ఉంటే, సామాజిక అడ్డంకులను ఛేదించగలరు, స్వాతంత్య్రం పొందగలరు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో తమ గొంతులను నొక్కి చెప్పగలరు’ అని నమ్మే గాయత్రి ఈ లాభాపేక్ష రహిత సంస్థ స్థాపించారు. ఏండ్లుగా ఇది మూడు ప్రధానమైన లక్ష్యలతో పని చేస్తుంది. అవే యంగ్ ఉమెన్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్, గర్ల్స్ ఇన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్, కలెక్టివిజేషన్ ఇనిషియేటివ్. మహిళా సాధికారత కోసం పని చేస్తున్న ఈ సంస్థకు పూణేతో పాటు చుట్టుపక్కల ఉన్న పట్టణ మురికివాడలు, గ్రామీణ ప్రాంతాలు, ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, జార్ఖండ్‌లోని గిరిదిV్‌ా, పాట్నా, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలో సాంకేతిక కేంద్రాలు ఉన్నాయి.
యక్షగానాన్ని ముందుకు తీసుకెళుతూ…
బెంగళూరులో పెరిగిన ప్రియాంక మోహన్ చిన్నప్పటి నుండి యక్షగానమే ప్రపంచంగా బతికింది. ఎందుకంటే ఆమె ఇల్లు యక్షగాన కళాకారులకు ఓ కేంద్రం. తండ్రి యక్షగాన ఔత్సాహికుడు. ఆ కళా రూపాన్ని ప్రోత్సహించేవారు. నగరంలో ప్రదర్శనలు ఇవ్వడానికి దక్షిణ కన్నడ నుండి కళాకారులను తీసుకువచ్చేవారు. కళపై తండ్రి ప్రేమను చూసి ప్రియాంక కూడా యక్షగానానికే అంకితమయ్యింది. అయితే ఆమె 10వ తరగతి తర్వాత కళకు కొంత విరామం ఇచ్చింది. ఆ విరామ సమయంలోనే కళకు విలువ కట్టి, సరికొత్త దృష్టి కోణంతో చూడటం మొదలుపెట్టింది. ఇప్పుడు యక్షగానాన్ని ప్రదర్శించే, నేర్పించే అతికొద్ది మంది మహిళల్లో ప్రియాంక కూడా చేరిపోయింది. తండ్రి ప్రారంభించిన యక్షదేగులతో కళను ముందుకు తీసుకెళుతోంది.