భూమి అమ్ముకున్న వృద్ధురాలిపై రూ.6 లక్షల 40 వేల రుణాలు మంజూరు

Loan of Rs. 6 lakh 40 thousand was granted to the old woman who sold the land– 10 గుంటల భూమి అమ్మితే 1 ఎకరా 7 గుంటలు రిజిస్ట్రేషన్
– ఒకే సర్వేనెంబర్, వృద్ధురాలిపై పలు బ్యాంకుల్లో రుణాలు
– మోసం చేసి భూమి లాక్కున్నాడు అంటున్న బాధితులు
– బాధితులకు సంబంధం లేకుండా రుణాలు మంజూరు
– రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు
– న్యాయం చేయాలని భిక్నూర్‌ లో ధర్నా చేసిన బాధితులు
నవతెలంగాణ – భిక్కనూర్
వృద్ధురాలికి తెలియకుండా కోపరేటివ్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లలో రూ.6 లక్షల 40 వేల రూపాయలు పంట రుణాలు మంజూరు చేసి మరొకరికి బదిలీ చేసిన ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్ముకున్న భూమిపై రుణాలు మంజూరు కాగా బ్యాంకు నుండి నోటీసులు రావడంతో కంగుతున్న బాధితురాలి కుటుంబీకులు బ్యాంకులకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకొని పరిశీలించగా వృద్ధురాలికి తెలియకుండా లక్షల రూపాయలు మంజూరు చేసి మరొకరికి బదిలీ చేసిన ఉదాంతం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మి మనమరాలి పెళ్లికి గ్రామానికి చెందిన సుదర్శన్ వద్ద 2014 సంవత్సరంలో 80 వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. 2015 సంవత్సరంలో అప్పు కింద 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయాలని సుదర్శన్ ఒత్తిడి తీసుకురావడంతో 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కానీ వద్దురాలికి తెలియకుండా మాయమాటలు చెప్పి  1 ఎకరా 7 గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2016 సంవత్సరంలో అమ్ముకున్న భూమిపై 40 వేల రూపాయలు భిక్కనూర్ సహకార బ్యాంకులో, 2017 సంవత్సరంలో  పెద్ద మల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 1 లక్ష 20 వేల రూపాయలు, అలాగే లక్ష్మి కొడుకు ఎల్లయ్య భూమిపై 2017 సంవత్సరంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 1 లక్ష 50 వేల రూపాయలు, కుటుంబీకుల మరో సర్వే నెంబర్ పై రూ.1 లక్ష 88 వేల రూపాయలు మొత్తం అమ్మిన భూమి, కుటుంబ సభ్యుల భూమిపై కుటుంబీకుల తెలియకుండా 6 లక్షల 40 వేల రూపాయలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ  సుదర్శన్ మంజూరు చేసుకొని వారి కుటుంబ సభ్యులకు నగదు బదిలీ చేసుకున్నట్లు బాధితురాలి మనుమడు నితీష్ తెలిపారు.
కుటుంబీకులకు తెలియకుండా రుణాలు మంజూరు చేసుకుని వారి కుటుంబ సభ్యుల పై బదిలీ చేసుకొని డబ్బులు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు బాధితుల ఇంటి వద్దకు వచ్చి  రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వగా రుణాల విషయం బయటకు వచ్చింది. విషయంపై కుటుంబీకులు సుదర్శన్ తో మాట్లాడగా మొదటగా బ్యాంకు అధికారులతో మాట్లాడతానని చెప్పి బ్యాంకు అధికారుల ఒత్తిడి కారణంగా మరోసారి సుదర్శన్ తో మాట్లాడితే మీకు నచ్చింది చేసుకోండి అని బాధితులపై దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు. విషయాన్ని రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం చేయకపోవడంతో జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్, రెవెన్యూ, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయ చుట్టూ తిరిగిన న్యాయం జరగకపోవడంతో శనివారం బిక్కనూర్ పట్టణ కేంద్రంలో కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. అమ్ముకున్న భూమిపై బాధితులకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా 6 లక్షల 40 వేల రూపాయలు రుణాలు ఇలా మంజూరు చేశారని, నిరుపేద కుటుంబానికి చెందిన రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన మంజూరు కానీ రుణాలు రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులకు ఎలాంటి దర్యాప్తు, విచారణ చేయకుండా ఏ విధంగా రుణాలు మంజూరు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అన్యాయం చేసి 10 గుంటల భూమి అమ్ముకుంటే మొత్తం భూమి కాజేసిన వ్యక్తిపై, అమ్మిన భూమిపై విచారణ చేయకుండా రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుచున్నారు.