సింగిల్‌ విండోలో 469 మంది రైతులకు రుణమాఫీ

నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు రైతుసేవా సహకార సంఘంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కింద 469 మందికి మాఫీ జరిగిందని సంఘం చైర్మెన్‌ కంచర్ల అశోక్‌ రెడ్డి తెలిపారు. మోత్కూరు సింగిల్‌ విండో కార్యాలయంలో సోమవారం జరిగిన సంఘం 19వ కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రుణమాఫీ కింద ప్రభుత్వం విడుదల రూ.కోటి 82 లక్షల 9152లతో రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు.రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌ కు కతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించినట్టు తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలకు సకాలంలో వడ్డీ చెల్లించి అప్పులను రెన్యూవల్‌ చేసుకోవాలని కోరారు. సంఘం సర్వసభ్య సమావేశం వచ్చే నెల 25న నిర్వహిస్తామని, అదే రోజు సంఘం కార్యాలయ ఆవరణలో ఖాళీ స్థలంలో ఏడు షట్టర్లు,500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈసమావేశంలో డైరెక్టర్లు సామ పద్మారెడ్డి, జిట్ట లక్ష్మయ్య, తాళ్లపల్లి స్వామి, కారుపోతుల ముత్తయ్య, దేవసరి రాములు, బుశిపాక సుజాత, సంఘం సీఈవో కె.వరలక్ష్మీ పాల్గొన్నారు.