రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ

Loan waiver for those without ration card– గ్రామాల వారీగా కుటుంబాల నిర్ధారణ
నవతెలంగాణ – మల్హర్ రావు
రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ వర్తించేలా గ్రామాల వారీగా బుధవారం నుంచి కుటుంబాల నిర్ధారణ చేయాలని ప్రభుత్వం సూచించింది. రుణమాఫీ సమస్యలపై మంగళవారం రైతునేస్తం కార్యక్ర మంలో భాగంగా వీడియో సమావేశంలో ఉన్నతాధికారులు మార్గదర్శకాల గురించి వివరించారు. రూ. 2 లక్షల లోపు పంట రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ పొందని కుటుంబాలను గుర్తించి ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని వారు సూచించారు. బ్యాంకులను ప్రాతిపదికన తీసుకొని ఇప్పటి వరకు రుణమాఫీ పొందని జాబితాను అధికారులకు అందజేసిన యాప్ లో వివరాలు పొందుపరిచారు. ఆయా రైతుల వివరాలను గుర్తించి వారి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని యాప్లో నమోదు చేయనున్నారు. ఇందులో భాగంగా రైతు నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకోనున్నారు. మండలంలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ జరిగింది. తెల్లరేషన్ కార్డు ఉండి, అన్ని వివరాలు సక్రమంగా ఉన్న వారికి రూ.2 లక్షల మేరకు మాఫీ సొమ్ము జమైంది. తాజాగా రూ.2 లక్షల్లోపు ఉండి రేషన్ కార్డు లేని రైతులను గుర్తించి, కుటుంబ వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇందుకు మండలాల వారీగా నోడల్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. గ్రామాల వారీగా రూపొందించిన జాబితాలో పేర్లు ఉన్న రైతులకు ఒక రోజు ముందుగానే సంబంధిత వ్యవసాయ సిబ్బంది సమాచారాన్ని చేరవేస్తారు. ఆ రోజు నోడల్ అధికారి గ్రామాన్ని సందర్శించి రైతుల వారీగా వివరాలు పరిశీలించి నిర్ధారించుకుంటారు. రైతులు అందు బాటులో ఉండి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీరితోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదు చేసుకోవడంతో రుణమాఫీ రాని రైతులు అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.