రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, రైతన్నకు ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. గురువారం సాయంత్రానికి 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానున్నట్టు పేర్కొన్నారు. ఆగష్టు 15లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారనీ, అందుకు నెలరోజుల ముందుగానే హామీని నిలబెట్టుకుని తమ నిబద్ధతను చాటుకున్నామని అన్నారు. పదహారేండ్ల క్రితం కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగానికి రూ. 72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారి, రైతులు ఆర్థికంగా బలపడడానికి వీలుగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అనే విధంగా పరిస్థితిని మారుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారనీ, రైతును రాజు చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకెళుతున్నదని పేర్కొన్నారు.