త్వరలో రుణమాఫీ.?

– రూ.లక్ష వరకూ అన్నదాత అప్పులు చెల్లింపు  కేసీఆర్‌ యోచన
– ప్రతిపక్షాల నోరు మూయించే వ్యూహం
– రైతు బంధు, బీమాతోపాటు రుణమాఫీనీ ఎన్నికల్లో వాడుకునే ఎత్తుగడ
– కాంగ్రెస్‌ ప్రకటించకముందే వెల్లడించనున్న గులాబీ దళపతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రానున్న శాసనసభ ఎన్నికల కోసం గులాబీ దళపతి కేసీఆర్‌ తన అమ్ములపొదిలోంచి మరో అస్త్రాన్ని వదలనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఇదే విషయాన్ని ఇటు అధికారులు సైతం ధృవీకరిస్తున్నారు. ఆ అస్త్రమే రైతు రుణమాఫీ. కారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా ఆ పార్టీకి ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లను గుమ్మరించాయి. కానీ రుణమాఫీ చేయకపోవటాన్ని ప్రతి పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రతీసారి ఎత్తి చూపుతూ వస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అది కూడా ఆగస్టు, సెప్టెంబరు లోపే రుణమాఫీ చేయటం ద్వారా ప్రతిపక్షాల నోళ్లను మూయించేందుకు కేసీఆర్‌ వ్యూహం పన్నుతున్నారు. తద్వారా అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం కాబట్టి.. మాకే ఓట్లేయాలంటూ ఆయన అన్నదాతలకు విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు ‘అబ్‌ కీ బార్‌-కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలి, అందుకనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు తమ పార్టీని వేలెత్తి చూపకుండా ఉండాలన్నదే కేసీఆర్‌ వ్యూహమని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి రూ.లక్ష లోపున్న రైతు రుణాలను మాఫీ చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీనిచ్చారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌…తాను అధికారంలోకి వస్తే రూ.రెండు లక్షల లోపున్న రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. కానీ రైతులు కారు పార్టీ హామీనే నమ్మి ఓట్లేశారు. ఆ క్రమంలో సీఎం చెప్పినట్టు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా సర్కారు జీవోను జారీ చేసింది. ఇది గడిచి నాలుగున్నరేండ్లు అయింది. అయితే రూ.35 వేల లోపున్న రుణాలను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. తద్వారా సుమారు 45 లక్షల మంది రైతులు లబ్దిపొందారని అధికారులు ప్రకటించారు. అయితే రూ.35 వేల పైబడి, రూ.లక్ష లోపు రుణమున్న వారికి మాత్రం అప్పులు మాఫీ కాలేదు. వీరి రుణాల మాఫీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ నిధులను విడుదల చేయలేదు. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోందని అధికార పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ ప్రక్రియ ఊపందుకుంటోందని తెలిసింది. ఇది పూర్తయితే… దాంతోపాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, తద్వారా భూగర్భ జలాల పెరుగుదల, రైతు బంధు, రైతు బీమా తదితరాంశాలను ఎన్నికల సభల్లో ఏకరువు పెట్టటం ద్వారా అన్నదాతల మనస్సులను మరోసారి గెలుచుకోవాలనే పక్కా ప్లాన్‌తో బీఆర్‌ఎస్‌ బాస్‌ ముందుకెళుతున్నారు. అది కూడా కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేయకముందే, రుణమాఫీ అంశాన్ని లేవనెత్తక ముందే రుణమాఫీని ప్రకటించి, అమలు చేయటం ద్వారా ఆ పార్టీ విమర్శలకు అడ్డుకట్ట వేయాలన్నది ఆయన స్ట్రాటజీగా ఉండబోతోందని తెలిసింది.