రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్
నవతెలంగాణ కంఠేశ్వర్:  రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో ఉన్న రైతులందరికి రెండు లక్షలు లోపు మాఫీ చేస్తామని ప్రకటించి 31 వేల కోట్ల రూపాయలకు గాను 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే నిధులను విడుదల చేయటంతో అనేకమంది రైతులు రుణమాఫీ కాక, కుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ తీవ్రమైన మానసిక వేదనతో ఆందోళన చెందుతున్నారని, చిన్న, చిన్న కారణాలు చూపుతూ, ప్రభుత్వ నిబంధనలను సడలించకపోవడంతో రుణమాఫీ వర్తించటం లేదని తిరిగి దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పటం జరుగుతుందని ,రైతులు మనోవేదనను అనుభవిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వం రుణాలు తీసుకున్నా రైతులందరికీ రెండు లక్షల రూపాయల్లో రుణాలను మాఫీ చేయడానికి కావలసిన నిధులను విడుదల చేసి నిబంధనలను సడలించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు అందరికీ పంట పండించే వారికి ఎకరానికి రూ.15వేలు రైతు భరోసాను ఇస్తామని హామీ ఇచ్చి రెండు పంటలు గడిచినప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని వెంటనే రైతులందరికీ ఎకరానికి 15 వేల రూపాయలు రైతు భరోసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో రైతుల పంటలకు అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి గత రెండు సీజన్లలో అమలు జరపలేదని, ఇప్పుడు కేవలం సన్నా వరి ధాన్యానికి మాత్రమే చెల్లిస్తామని తెలియజేస్తున్నారని దీని మూలంగా రైతులు నష్టపోతారని అన్నారు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయటంతో పాటు రైతు భరోసాను, పంటలకు బోనస్ ధరను అమలు జరపాలని ఆయన అన్నారు. లేనియెడల ఈ ప్రభుత్వానికి రైతాంగం తమ పోరాటాలద్వారా పట్టని చెప్పే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు కటారి రాములు, నల్వాల నరసయ్య , కృష్ణ, సతీష్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.