ఉద్యోగులకు రుణమాఫీ చేయాలి

– మంత్రి తుమ్మలకు టీజీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగులకు రైతు రుణమాఫీని పరిశీలించి తగు ఆదేశాలను జారీ చేయాలని టీజీవో కేంద్ర సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ కలిసి వినతిపత్రం సమర్పించారు. చాలా మంది ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద రైతు కుటుంబాలకు చెందిన వారేనని తెలిపారు.
వారి జీవనోపాధి వ్యవసాయ ఆదాయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులు, ప్రభుత్వ రుణాలను తీసుకున్నారని వివరించారు. తక్కువ వేతనం పొందే ఉద్యోగులు, అసిస్టెంట్‌ క్యాడర్‌, క్లాస్‌-4 ఉద్యోగులకు పంట రుణాల మాఫీ సమస్యను పరిష్కరించాలని కోరారు. అర్హత, దరఖాస్తుల ప్రక్రియ కోసం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆ కుటుంబం రుణాలను మాఫీపై ప్రభావం చూపడం వల్ల ఆ కుటుంబంలో వివాదాలకు దారితీస్తుందని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఈహెచ్‌ఎస్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. 317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.