– కొత్త రుణాలు ఇచ్చేందుకు కొర్రీలు
– అన్ని సహకార సంఘాలకు ఆదేశాలు జారీ
– ఈసీ సర్టిఫికెట్ నిబంధన తొలగించాలి : సహకార సంఘాల అధ్యక్షులు
నవతెలంగాణ – బోనకల్
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహకార సంఘాల ద్వారా తిరిగి రైతులకు రుణాలు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుంది. కమర్షియల్ బ్యాంకులు లాగా ప్రస్తుత వాస్తవ పరిస్థితుల ఆధారంగా రుణాలు ఇవ్వకుండా కొత్త కొత్త కొర్రీలు పెట్టి రైతులకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొత్త డ్రామాకు తెరలేపినట్లు అర్థమవుతుంది. అనేక ఏళ్లుగా కమర్షియల్ బ్యాంకులు, సహకార సంఘాలు ప్రస్తుత అర్హత ప్రకారం రైతులకు రుణాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రుణంలోపు గల రైతులకు రుణమాఫీ చేసింది. రుణమాఫీ జరిగిన రైతులకు వెంటనే సహకార సంఘాలు ప్రస్తుత అర్హతను బట్టి రుణం అందజేయాలి. ఈ క్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈవో అబిద్ ఉర్ రెహమాన్ ఈనెల 23న కొన్ని షరతులు విధిస్తూ జిల్లాలోని అన్ని సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్‌లకు, సహకార సంఘాలకు జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో మొత్తం 9 షరతులు విధించింది. ఇందులో 6వ షరతు రైతులకు ప్రమాదకరంగా ఉండటంతో పాటు రుణాలు ఇవ్వకుండా రైతులకు పంగనాలు పెట్టే విధంగా ఉంది. గతంలో రుణాలు ఇచ్చే సమయంలో రైతులకు సంబంధించి పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, 1బి తీసుకొని రైతుకు ఉన్న పొలం ఆధారంగా సహకార సంఘాలు, కమర్షియల్ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ప్రస్తుతం కమర్షియల్ బ్యాంకులు గత నిబంధనల ప్రకారమే తాజాగా రుణాలు ఇస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. కానీ సహకార సంఘాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి విడుదలైన జీవో ప్రకారం రైతులు తిరిగి రుణాలు పొందాలంటే 15 సంవత్సరాల నుంచి ఈసీ సర్టిఫికెట్ తీసుకురావాలని నిబంధన విధించింది. 15 సంవత్సరాల నుంచి ఈసీ సర్టిఫికెట్ తీసుకురావాలంటే రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అర్థమవుతుంది.
ఒక్కొక్క రైతు 15 సంవత్సరాల నుంచి ఈసీ సర్టిఫికెట్ తీసుకురావడానికి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగటానికే సమయం పడుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పొలాలు కొనుగోలు చేసుకున్నారు. అటువంటి రైతులు కూడా 15 సంవత్సరాల నుంచి ఈసీ సర్టిఫికెట్ తీసుకురావడం ఎలా సాధ్యమవుతుందని అన్నదాతలు అంటున్నారు. ఇటువంటి కొర్రీలు పెట్టకుండా రైతుల ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఆధారంగా కమర్షియల్ బ్యాంకులు ఇచ్చిన విధంగానే సహకార సంఘాల ద్వారా రుణాలు ఇవ్వాలని రైతుల కోరుతున్నారు. వెంటనే జీవోలో పేర్కొన్న 6వ నిబంధనను తొలగించి గతంలో లాగా తమకు రుణాలు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ విషయం తెలిసిన సహకార సంఘాల చైర్మన్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులను కలిసేందుకు బుధవారం తరలి వెళ్లినట్లు తెలిసింది.
ఈసీ సర్టిఫికెట్ నిబంధన తొలగించాలి
పెద్ద బీరవల్లి సొసైటీ అధ్యక్షుడు చింతలచెరువు కోటేశ్వరరావు
15 సంవత్సరాల నుంచి ఈసీ సర్టిఫికెట్ అనే నిబంధన సరైన నిబంధన కాదు. దీని వలన రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఆధారంగా రుణాలు ఇవ్వాలి. ఈ నిబంధనను తొలగించాలని తాము బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులు పునరాలోచన చేయాలి.