సింగారంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సీపీఐ(ఎం) సర్పంచ్ కావాలి

– అప్పుడే అంతయ్యకు నిజమైన నివాళులు

– వర్ధంతి సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశా నాయక్ 
నవతెలంగాణ – అచ్చంపేట 
మండల పరిధిలోని సింగారం గ్రామం సీపీఐ(ఎం) పార్టీ బలంగా ఉన్న గ్రామం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, అప్పుడే కామ్రేడ్ అంతయ్య కు నిజమైన నివాళులు అర్పించినట్లని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశాయ అన్నారు. శనివారం సింగారం గ్రామంలోని అంతయ్య స్తూపం దగ్గర 32 వ వర్ధంతి సభను నిర్వహించారు. అంతయ్య  చిత్రపటానికి గ్రామస్తులు, పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు పూలతో నివాళులర్పించారు.  ఈ సందర్భంగా దేశనాయక్ మాట్లాడారు. ప్రజా సమస్యల పైన అంతయ్య అలుపెరుగని పోరాటాలు చేశాడని ఇది జీర్ణించుకోలేని ఆనాటి నక్సలైట్లు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతయ్య ఆశయాలను ముందుకు తీసుకపోవడానికి సింగారం గ్రామంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత 32 సంవత్సరాల క్రితం అంతయ్య ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది దుర్మార్గులు నక్సలైట్లతో చేతులు కలిపి ఈ ప్రాంతంలో అంతయ్య ఉంటే మన ఆటలు సాగవని అంతయ్యను నడి ఊరిలో మధ్యరాత్రి కాల్చి చంపారాని అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేశారు.
కానీ ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర పోషించిన సీపీఐ(ఎం) పార్టీ ప్రభావం వల్ల నరేంద్ర మోడీ దూకుడుకు ముక్కుతాడు వేసి 240 సీట్ల మధ్యనే బీజేపీ దూకుడు ఆగిపోవలసి వచ్చిందని అన్నారు. ఒకవేళ  బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండేవి కాదన్నారు.  బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీహార్ లో నితీష్ కుమార్ పైన ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చిరకాలము ఉంటదని గ్యారెంటీ లేదన్నారు. కులం పేరు మీద, మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడిపి రాజకీయాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని, అవి నెరవేర్చాలని అన్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చకుంటే సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్ మల్లేష్, అంతయ్య కుమారుడు విజయ్ కుమార్, తల్లి ఎల్లమ్మ, సీపీఐ(ఎం) పార్టీ సింగారం శాఖ కార్యదర్శి బక్కయ్య, సీనియర్ నాయకులు చిన్న అంజనేయ, బొల్లు చిన్నయ్య, నీలం అంతయ్య, నీలం వెంకటయ్య ,మాజీ సర్పంచ్ బాల్ లింగయ్య , చంద్రు నాయక్, మహిళలు ,బుచ్చమ్మ, పార్వతమ్మ, కృష్ణమ్మ , డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధo సైదులు గ్రామస్తులు ఉన్నారు.