విద్యాశాఖకు తాళం

– సమ్మెలో సమగ్ర శిక్ష ఉద్యోగులు
– పని బారెడు..జీతం చారెడు
– సీఆర్పీలు, కాంట్రాక్టు ఉద్యోగులు
– లేక విద్యాశాఖ దివాళా
– సేవలు లేక స్థంభించిన విద్యాశాఖ
– పది రోజులుగా నిరాహార దీక్షల్లో సమగ్ర శిక్ష 634 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు
– ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌
ఎన్నికల కాలం నడుస్తుంది. తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి సరైన సమయం. ఇదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వీరే కాకుండా, గౌరవ వేతనం తీసుకుంటున్న వర్కర్లు సైతం పోరుబాట పట్టారు. ఇటు రెండో ఏఎన్‌ఎంలు 20 రోజులకు పైగా సమ్మెబాట పట్టిన విషయం విధితమే. ఇటీవల పంచాయతీ కార్మికులు కూడా నెలరోజుల పాటూ దీక్షలు చేపట్టారు. మున్సిపల్‌ కార్మికులూ సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆశాలు కూడా సమ్మెలోనే కొనసాగుతున్నారు. ఇదే తరుణంలో మూడు రోజుల నుంచి అంగన్‌వాడీ ఉద్యోగులూ సమ్మెలోనే ఉన్నారు. ఇక విద్యాశాఖలో ప్రధాన భూమిక పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరుమార్గాన్ని వదిలేదిలేదని తేల్చి చెబుతున్నారు. శంషాబాద్‌ కేంద్రంగా దీక్షలు చేపట్టారు. దాంతో మండల విద్యాశాఖ కార్యాయాల తాళం తీసిశుభ్రం చేసే వారు లేరు. దాంతో విద్యాశాఖకు తాళం పడింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పదిహేను ఏండ్లుగా విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగుల పోరుమార్గాన్ని ఎంచుకోవడంతో ఎమ్మార్సీ కేంద్రాలు మూత పడ్డాయి. తాళం తీసే వారు కరువయ్యారు. అంటెండర్‌ మొదలుకుని, సీఆర్పీలు మొత్తం సమ్మెలోనే ఉండటంతో విద్యాశాఖ కార్యాలయాలు బోసుపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా కనీస వేతనాలు అందడం లేదు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరాహారదీక్షలకు దిగారు. విద్యాశాఖలో ప్రధాన భూమిక పోషిస్తున్న వీరు సమ్మెకు దిగడంతో ఎమ్మార్సీల్లో సేవలు ఒక్క సారిగా నిలిచిపోయాయి.
పని తగ్గ వేతనం లేదు..
విద్యాశాఖలో పలు విభాగాల్లో పని చేసే సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌, మెరిట్‌ ఆధారంగా నియమితులయ్యారు. 2006 నుంచి 2018 డీఎస్సీ వరకు కాంట్రాక్టు పద్ధతిలో వీరి నియామకం జరిగింది. వీరికి రూ.7800 నుంచి రూ.19,500 వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఇతర విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారి వేతనాలు పెంచిన ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రం పట్టించుకోలేదు. దాంతో చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్నారు.
ఎమ్మార్సీల్లో సేవలకు బ్రేక్‌…
మండల విద్యాశాఖలో పని చేస్తున్న వారంతా కాంట్రాక్టు ఉద్యోగులే. చివకు జిల్లాలోని 99శాతం మండల విద్యాధికారులూ ఇన్‌చార్జులే. సీఆర్పీలే విద్యాశాఖలో కీలకంగా మారారు. మధ్యాహ్న భోజన బిల్లులు, మన ఊరు మన బడి, విద్యార్థులు ప్రగతి నివేదికలు, రిపోర్టులు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. టీచర్ల ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల విషయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న టీచర్ల వివరాలను మండల ఎమార్పీకి అప్పగించాల్సి ఉంది. ఉపాధ్యాయుల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా స్థాయికి పంపించాలి. అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్లు, సిస్టం అనలిస్ట్‌లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు జిల్లా స్థాయిలో జరిగే నివేదికలను రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. ఈ సేవలన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి.
వారి ప్రధాన డిమాండ్లు…
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు కనీస వేతనం అమలు చేయాలి. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లను ఒకేషనల్‌ ఉపాధ్యాయులుగా గుర్తించాలి. వృత్తి విద్య ఉపాధ్యాయులం దరికీ 12నెలల పూర్తి వేతనం చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సౌకర్యాలు, ఈహెచ్‌ఎస్‌ కల్పించాలి. ఉద్యోగి మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లకు సమాన వేతనం చెల్లించాలి.

రెగ్యులరైజ్‌ చేసే వరకూ పోరాటం
తమవి గొంతెమ్మకోర్కెలు కావు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. తమను వెంటనే రెగ్యూలర్‌ చేయాలి. కనీస వేతనం అమలు చేయాలి. 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలి. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తాం.
– జగదీశ్‌ సీఆర్పీ, సంఘం రాష్ట్ర నాయకుడు

ఉద్యోగ భద్రత కరువు..
గత పదిహేను ఏండ్లుగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లను వోకేషనల్‌ టీచర్లుగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
– గిరీష్‌, మంచాల మండలం