బీజేపీలో లొల్లి

– రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణుల నిరసన జ్వాలలు
– అర్వింద్‌ డౌన్‌..డౌన్‌..వీవాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు
– నేతల తీరుపై రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం
– ‘ఏరు ఏం మాట్లాడుతున్నవ్‌..’ అంటూ ఎదురు తిరిగిన కార్యకర్తలు
– ఉక్కిరిబిక్కిరి అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం
– మీడియా సాక్షిగా రచ్చరచ్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అగ్నిపర్వతం బద్దలయినప్పుడు లావా నిరంతరం ఎగిసిపడ్డట్టుగానే బీజేపీలో నిరసన జ్వాలలు ఏదో ఒక రూపంలో ఎగసిపడుతూనే ఉంది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో రాష్ట్ర నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అయింది. కొద్దిసేపు ధర్నా… కొంత సమయం అర్వింద్‌ డౌన్‌..అర్వింద్‌ డౌన్‌…వీవాంట్‌ జస్టిస్‌..వీవాంట్‌ జస్టిస్‌..నినాదాలతో అంతా గందరగోళం నెలకొంది. ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డిపై ‘ఏరు ఏం మాట్లాడుతున్నావ్‌…..’ అంటూ కార్యకర్తలు ఉగ్రరూపం దాల్చారు. కిషన్‌రెడ్డినే తమ వద్దకు రావాలని డిమాండ్‌ చేయడం వంటి పరిణామాలతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అతి కష్టం మీద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాంసుందర్‌, ఆర్మూర్‌లో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వినరురెడ్డి, బాల్కొండ నుంచి రెండు సార్లు పోటీ చేసిన రాజేశ్వర్‌, బోధన్‌ మున్సిపాలిటీ బీజేపీ ప్లోర్‌ లీడర్‌, తదితర నాయకులకు ప్రకాశ్‌రెడ్డి, రాణి రుద్రమ దేవి, పలువురు నేతలు నచ్చజెప్పారు. మీడియా ముందు రచ్చచేయడం సరిగాదని బతిమిలాడి నేతలను కిషన్‌రెడ్డి క్యాబిన్‌ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడకు మీడియాను రానివ్వలేదు. ‘కొద్దిసేపు తమతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. న్యాయం చేస్తామని హామీనిచ్చి పంపారు’ అని కొందరు నాయకులు చెప్పారు. కిషన్‌రెడ్డి కూడా తమకు న్యాయం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు అర్వింద్‌ మాత్రం మండలాధ్యక్షుల మార్పులో తన ప్రమేయమేమీ లేదంటూ దాటవేయడం గమనార్హం.
అసలేం జరిగిందంటే…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. అది ముగిసాక ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ, పలువురితో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు కార్యాలయంలోని తన క్యాబిన్‌కు వెళ్లారు. అదే సమయంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 60 నుంచి 70 మంది నాయకులు ఒక్కసారిగా రాష్ట్ర కార్యాలయంలో బైటాయించారు. ‘భారత్‌ మాతాకీ జై..అర్వింద్‌ డౌన్‌డౌన్‌.. వీవాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాం సుందర్‌ మాట్లాడుతూ..’నిజామాబాద్‌ జిల్లాలో ఎవ్వరికీ తెల్వకుండా, పార్టీకి సమాచారం లేకుండా 13 మంది మండలాధ్యక్షులను మార్చేశారు. దానివల్ల పార్టీ బలహీన పడుతున్నది. ఒక్క బోధన్‌ నియోజకవర్గంలోనే నలుగురు బలమైన మండలాధ్యక్షులను మార్చేసి వారి స్థానంలో కొత్తవాళ్లను పెట్టారు. ఆ నలుగురూ దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నవాళ్లు. వారికి ఎలాంటి సమాచారం లేకుండా జిల్లా ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య వ్యతిరేకించినప్పటికీ ఉన్నతస్థాయిలోని నాయకులెవ్వరికీ సమాచారం లేకుండా జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్యపై ఒత్తిడి తెచ్చి ఎంపీ అర్వింద్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని కార్యకర్తలందరూ భావిస్తున్నారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షులైన కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడానికి, నిలుపుదల చేయడానికి ఈ రోజు నిజామాబాద్‌ జిల్లాలోని ముఖ్యమైన నాయకులు ఇక్కడకు వచ్చారు. కాబట్టి వెంటనే కిషన్‌రెడ్డి కలుగజేసుకుని సమస్యను పరిష్కరించి దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోస్తున్న నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయాలని ఏకైన విజ్ఞప్తితో ఇక్కడకు వచ్చాం. ఎంపీ అర్వింద్‌ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారనే దానికి రాష్ట్ర అధ్యక్షులకు వివరిస్తాం’ అని చెప్పారు.
వినరురెడ్డి ప్రసంగం…ప్రకాశ్‌రెడ్డి జోక్యం..కార్యకర్తల ఆగ్రహం
‘ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు మండలాధ్యక్షులను మార్చారు. కొత్తగా నియమించిన సురేశ్‌నాయక్‌ వాయిస్‌ రికార్డ్‌ నా దగ్గర ఉంది. ఎంపీటీసీ ఎన్నికల్లో సురేశ్‌నాయక్‌ బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. పార్టీ మండల నాయకులకు ఫోన్లు చేసి ”అరె ఫాల్తుగాళ్లారా ఇంకెన్ని రోజులు బీజేపీలో ఉంటరు? బీఆర్‌ఎస్‌లోకి రండి. జీవన్‌రెడ్డి సార్‌తో నేను పైసలిప్పిస్త” అన్న వ్యక్తి పార్టీకి మండలాధ్యక్షుని పదవి ఎలా ఇస్తారు?’ అని గత ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వినయరెడ్డి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతుండగానే…బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి అక్కడకు చేరుకున్నాడు. ‘ఏరు బాబూ..ఏరు బాబూ..హల్లో హల్లో ముందు నువ్వు మైకు ఆపు..ఏరు ముందు నువ్వు ఆపు…నడ్వు బయటకు రా. నీకే నివ్వు బయటకు రా. ఇదేనా పద్ధతి? నువ్వు అసలు నాయకుడివేనా? మీడియా ముందు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతావా?’ అంటూ కోపంతో ఊగిపోయారు. ‘ఏం జేయమంటవ్‌ సార్‌.’ అని కొందరు నాయకులు ప్రకాశ్‌రెడ్డితో మాట్లాడుతుండగానే.. ‘అర్వింద్‌ డౌన్‌..అర్వింద్‌ డౌన్‌’ అంటూ కొద్దిసేపు నినాదాలు చేశారు. ‘పైకి నడవండి. ఈడ ఏం మాట్లాడొద్దు’ అని ప్రకాశ్‌రెడ్డి అంటుండగానే… ‘ఏరు నువ్వేం మాట్లాడుతున్నవ్‌? ఈడ కూసోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. నువ్వు ఎవ్వడరవు బై మమ్ముల్ని అంటందుకు. ఊర్లల్లో 30, 40 ఏండ్ల నుంచి జెండా మోస్తున్నోళ్లం. మాకు ఇచ్చే గౌరవం ఇదేనా? పార్టీని ఆగంచేస్తున్నరు. ఇప్పుడు కూడా నోర్లు మూసుకుని ఉండాలా? మీరేం జేస్తరు? మహా అంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తరు అంతేగా? చేయండి చూద్దాం’ అంటూ గ్రామస్థాయి నాయకులు ఆవేశంతో ఊగిపోతూ ఎదిరించారు. ధిక్కార స్వరం తీవ్రస్థాయిలో వినిపించటంతో ప్రకాశ్‌రెడ్డి, ఇతర నాయకులు వారికి నచ్చజెప్పారు. కిషన్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. మూలిగే నక్కమీద తాటి పండు పడ్డ చందంగా ఈ పరిణామం చోటుచేసుకున్నది. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.