దరఖాస్తుల పరిశీలనపై లొల్లి

– ఒకే కుటుంబంలో రెండు సీట్ల ప్రతిపాదనపై రేవంత్‌, ఉత్తమ్‌ వాగ్వాదం
– అభ్యర్థి పూర్తి వివరాలు పొందుపరచాలి
– అవసరమైతే నా సీటు బీసీలకు ఇస్తా : కోమటిరెడ్డి
– 4న స్క్రీనింగ్‌ కమిటీ రాక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీలో దరఖాస్తుల లొల్లి మొదలైంది. టికెటు కోసం వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించే క్రమంలో వాడీవేడిగా చర్చలు జరిగాయి. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో దరఖాస్తుల పై చర్చించేందుకు ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ (పీఈసీ) సమావేశమైంది. ఒక్కో నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను పరిశీలించి, ముగ్గుర్ని ఖరారు చేసి, ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన పీఈసీ…అభ్యర్థుల పూర్తి వివరాలు లేకుండా ఎలా చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటుందంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అరకొర సమాచారాన్ని బట్టి ఖరారు చేయలేమని ఆయన తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై పీసీసీ అధ్యక్షులు ప్రతిపాదన చేయాలని ఉత్తమ్‌ పట్టుబట్టగా…తాను ఎలాంటి ప్రతిపాదన చేయబోననీ, ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని రేవంత్‌ అన్నట్టు తెలిసింది.
పీసీసీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఉత్తమ్‌ చెప్పగా.. తనను డిక్టేట్‌ చేయవద్దని రేవంత్‌ బదులిచ్చినట్టు సమాచారం. దీంతో ఆగ్రహించిన ఉత్తమ్‌ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వచ్చే నెల 2వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి కూడా జోక్యం చేసుకుని అన్ని విషయాలను సానుకూలంగా చర్చిస్తామని వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం మరోలా స్పందించినట్టు తెలిసింది. సామాజిక తరగతులకు సముచిత స్థానం ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే తన సీటును బీసీలకు ఇస్తామని వెల్లడించారు. ప్రతి పార్లమెంటుకు రెండు సీట్ల చొప్పున బలహీన వర్గాలకు ఇవ్వాల్సిందేనన్నారు. బీసీల విషయంలో సీఎం కేసీఆర్‌ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్‌ పార్టీగా మనం చేయకూడదని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనపై కొన్ని నియమ, నిబంధనలు రూపొందించాలని మరికొంత మంది కోరినట్టు వినికిడి. ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ వచ్చేనెల 4న హైదరాబాదు రానుందనీ,ఆ కమిటీతో పీఈసీ సమావేశమై దరఖాస్తులపై చర్చిద్దామన్న అభిప్రాయంతో సభ్యులు ఏకీభవించినట్టు తెలిసింది.
సమావేశానంతరం పార్టీ నేతలు సంపత్‌ కుమార్‌, బలరాం నాయక్‌, శివసేనా రెడ్డి, జితేందర్‌తో కలిసి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ పీఈసీ సమావేశంలో దరఖాస్తు దారులకు పార్టీతో ఉన్న అనుబంధం, పార్టీలో చేరిన తేదీ, దరఖాస్తు చేసుకున్న, పాల్గొన్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు చేపట్టిన అంశాలకు సంబంధించి దరఖాస్తులో పొందుపరచిన వాటిపై చర్చించినట్టు తెలిపారు. స్క్రీనింగ్‌ కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండి వివిధ స్థాయిల్లో పని చేస్తున్న నాయకత్వంతో మాట్లాడుతారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలో టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గేకు లేఖ రాయాలని తీర్మానించినట్టు చెప్పారు. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 1006 దరఖాస్తులు వచ్చాయనీ, ఇల్లందు నియోజకవర్గానికి అత్యధికంగా 38 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొడంగల్‌, జగిత్యాల నియోజకవర్గంలో కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయన్నారు.
తుమ్మల కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారు : మల్లు భట్టి విక్రమార్క
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆ పార్టీలో ఆయనకు టికెట్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పారు. ఆయన్ను కాంగ్రెస్‌లోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా బేషరతుగా ఆహ్వానిస్తామన్నారు. మోడీ పాలనలో క్యాప్టిలిస్టులు…కేసీఆర్‌ పాలనలో దొరలు మాత్రమే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. వామపక్షాలు కూడా కాంగ్రెస్‌ తో కలిసి నడవాలని కోరారు.