”ప్రజాపాలన”కు విశేష స్పందన లభిస్తోంది. తొలి రోజే 7,46,414 అర్జీలు రావడం ఆరు గ్యారెంటీల కోసం ప్రజలు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో తెలియజేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ గెలుపులో ఈ వాగ్దానం ఎం తటి కీలకపాత్ర పోషించిందో కూడా రుజువు చేస్తోంది. ఎన్నికలనగానే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిం చడం, వాటిలో అనేక హామీలివ్వడం సాధారణం. కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే ప్రజాతీర్పుకు నిజమైన గౌరవం. ఇది ఎన్నికైన కొత్త ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్య మంత్రిగా రేవంత్‌రెడ్డి తొలి సంతకాన్ని ఆరు గ్యారంటీల హామీపైనే చేయడం ఈ దిశగా వేసిన మొదటి అడుగని చెప్పుకోవచ్చు. తద్వారా ఆయన ఆరు గ్యారెంటీలే కాదు, వాటి అమలు కూడా గ్యారెంటీ అనే నమ్మకాన్ని ప్రజలకిచ్చారు. అంతేకాదు ఇచ్చిన హామీల్లో రెండు వచ్చిన వారంలోపే అమలు చేయడం ఈ నమ్మకాన్ని రెట్టింపు చేసింది.
మరి ఈ నమ్మకాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా? అన్న అనుమానాలు కొన్ని అక్కడక్కడా లేకపోలేదు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వరుస సమీక్షలు, వెల్లడిం చిన శ్వేతపత్రాల నేపథ్యంలో… ఒక వైపు వెక్కిరి స్తున్న ఖాళీ ఖజానా, మరో వైపు హెచ్చరిస్తున్న అప్పుల భారాల మధ్య వీటి ఆచరణ సాధ్య మేనా? అన్న ఈ సందేహాలు మరికొంత బల పడ్డాయి. అసలీ ఆరు గ్యారెంటీలను అటకెక్కిం చడానికే ఈ సమీక్షలూ శ్వేతపత్రాలనే విపక్షాల విమర్శల సంగతి చెప్పక్కర్లేదు. అయితే… ఇదంతా ప్రజలకు నిజాలు తెలియాలనే తప్ప, ఇచ్చిన హామీల నుండి తప్పుకునే ఉద్దేశ్యం తమకు లేదనీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేసి తీరుతామని ప్రభు త్వ పెద్దలు చెప్పడం, అందుకు తగ్గట్టుగానే ”ప్రజాపాలన” ద్వారా ఆచరణకు పూనుకోవడం అభినందనీయం.
ఇదిలా ఉండగా, ఉచితాలన్నీ అనుచితమైనవేననీ, ఆర్థిక వ్యవస్థకు పెనుభారమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలేమీ కొత్తవి కాదుగానీ ఈ సందర్భంగా మరో సారి చర్చకొస్తున్నాయి. ఓట్ల కోసం ఒకవైపు పథకాల మీద పథకాలనేకం ప్రకటిస్తూనే మరో వైపు వీటిపై ఉచితాలంటూ అను చిత వ్యాఖ్యలు చేసే ”మహానుభావులు” మనకు కేంద్ర ప్రభుత్వంలోనే కావాల్సి నంత మంది ఉండగా ఇలాంటి చర్చలేమీ ఆశ్చర్యం కలిగించవు. కానీ, పేదలకిచ్చే సంక్షేమ పథ కాలను ఉచితాలుగా హేళన చేసే మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ పదేండ్లలో కార్పొ రేట్ గద్దలకు రద్దు చేసిన బాకీలు అక్షరాల పద్నాలుగు లక్షల యాభ య్యారువేల కోట్లు. అంతేనా ఇచ్చిన రాయితీలు, అప్పనంగా అప్పగిస్తున్న ఆస్తులు అంతకు రెట్టింపు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పేరుతో బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెడు తున్న భూములు, ఇస్తున్న సబ్సిడీలు, కల్పిస్తున్న సదుపాయాలు తక్కువేమీ కావు? విచిత్రమే మిటంటే పై వాదనలు చేసే పెద్దమనుషులెవ్వరూ వీటి గురించి మాట్లాడరు. ఇవి ఆర్థిక వ్యవస్థకు భారమని గుర్తిం చరు. కానీ ప్రజలకిచ్చే ఈ కాస్త సంక్షేమాన్ని మాత్రం ఉచితాలంటూ తక్కువ చేసి మాట్లాడుతారు!!
నిజానికి కేవలం సంక్షేమ పథకాలే సమస్యలకు పరి ష్కారం కాదుగానీ, ఈ అసమానతల సమాజంలో ప్రజల కు అవి అతిపెద్ద ఊరట. అందువల్ల ఏ ప్రభుత్వానికైనా ప్రజల సంక్షేమమే మొదటి ప్రాధాన్యత కావాలి. ఈ ప్రాధా న్యతను గుర్తించడం, పథకాలకు రూపకల్పన చేయడమే కాదు, వాటి ఆచరణకు, వనరుల సమీకరణకు సహేతు కమైన ప్రణాళికలు ఉండాలి. మన ప్రభుత్వాల ఆదాయ వ్యయాల్లో సమతూకం, అవినీతి అనవసర ఖర్చులపై నియంత్రణ, సంపద సృష్టికీ పంపిణీకీ తగిన ప్రజానుకూల విధానాలను అవలంబిస్తే ఇది కష్టమేమీకాదు. కానీ ఇదే భారమని భావిస్తే ఇక ఆ ప్రభుత్వాలు ఎందుకు? ప్రజా ప్రయోజనమే ప్రభుత్వాల ఏకైక లక్ష్యమై ఉండాలి. అదే సమయంలో ఏ పథకానికైనా అర్హులైన ప్రజలే లబ్దిదారు లుగా ఉండాలి. ఏది ఎవరికి అవసరమో వారికే అందాలి. దురదృష్టవశాత్తు మన ఏలికల్లో ఈ దృష్టే కొరవడుతోంది! ఎందుకంటే వారు ప్రజల్లో కేవలం ఓటర్లనే తప్ప మను షుల్ని చూడలేకపోతున్నారు! ఫలితంగా సంక్షేమం దుర్వినియోగం అవుతుంది. కొత్త ప్రభుత్వం ఇందుకు మినహాయింపు కావాలి.
ఇప్పుడు ఈ హామీల అమలే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఎందుకంటే… ఒకవైపు ప్రజలు హామీల అమలు పట్ల ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే ఓటమిని అతికష్టంగా జీర్ణించు కుంటున్న విపక్షం అప్పుడే అధికారపక్షం ప్రజల విశ్వాసాన్ని కోల్పోవాలని ఆత్రుత పడుతోంది. ఆరు నెలల పాటు వేచి చూస్తా మన్న వాళ్లు, ప్రభుత్వం పడిపోవడం గురించి, వాగ్దానాలను నెరవేర్చకపోవడం గురించి తీవ్రంగానే మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇది గుర్తెరిగి నడుచుకోవాలి. ప్రస్తు తానికైతే ఇది గుర్తించిన సూచనలే కనిపిస్తు న్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ప్రభుత్వం చర్యలను, వాటి ఫలితాలను సమీక్షించడం మొదలు పెట్టిన కొత్త ప్రభుత్వం… తన హామీలు, ఆలోచనల అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇది హర్షించదగినదేగానీ… ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదని ఆశిద్దాం.