– సీఎంకు రేవంత్ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. శనివారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. రైతులు అడిగినంత యూరియాను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ‘2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటకు దిక్కు లేకుండా పోయింది. ఆరు నూరు అవుతుందేమో కానీ.. మీరు మాట మీద నిలబడరని మరోసారి నిరూపితమైంది’ అని గుర్తు చేశారు. ఉచిత ఎరువులిస్తామంటూ రైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. సీఎం సొంత జిల్లాలోని తొగుట మండలంలోని రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. వారం రోజులపాటు పడిగాపులు కాసినా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.