పిల్లలకు పుష్టికరమైన ఆహారం పెట్టాలని ప్రతి తల్లీ భావిస్తుంది. కానీ నోటికి రుచిగా లేకపోతే పిల్లలు వాటిని ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఆరోగ్యకరమైన చిరుతిళ్లను అందిస్తున్నారు దివ్య అరోరా. రాగులు, జొన్నలు, మఖానా, క్వినోవా, చిక్‌పాలతో తయారు చేసిన స్నాక్స్‌ను అందుబాటులో ఉంచారు. ప్రిజర్వేటింగ్ లేని అధిక పోషకాహార పదార్థాలతో వ్యాపారం మొదలుపెట్టి లక్షలు సంపాదిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
కరోనాకంటే ముందు దివ్య అరోరా తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. దీనికోసం పశ్చిమ బెంగాల్‌లోని తన భర్త స్వస్థలమైన మాల్దాకు వెళ్లారు. వీరిద్దరూ ఎంబీఏ చదువుతున్నప్పుడు ఐఎంటీ ఘజియాబాద్‌లో కలుసుకున్నారు. 2019లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో దివ్య డెలాయిట్‌లో పనిచేస్తున్నారు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన దివ్య ఒక చిన్న పట్టణంలో నివసించడం ఇదే తొలిసారి. ‘ఇది పూర్తి మార్పుతో కూడుకున్నది. ఇంటి నుండి పని చేసే ఉద్యోగం కోసం కొన్ని నెలల పాటు ప్రయత్నించాను. కానీ ఎక్కడా అవకాశం రాలేదు. దాంతో కోల్‌కతా లేదా ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేశాను. నా భర్త తరచుగా మాల్దాకు వెళ్తుంటాడు’ అంటూ ఆమె పంచుకున్నారు.
మంచి రంగంగా…
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈమె ఎక్కువ కాలం మాల్డాలోనే ఉన్నారు. ఇంటి నుండి పని చేయడం కొనసాగించారు. అయితే 2020 ప్రారంభంలో సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక ఆమెలో మొదలయింది. 2021 డిసెంబర్‌లో స్నాక్ బ్రాండ్ ‘హేకా బైట్స్’ను ప్రారంభించడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. వ్యవసాయ పద్ధతులు, పంట ఉత్పత్తి గురించి తెలుసుకునేందుకు తమకు దగ్గరలోని పట్టణాలకు వెళ్లడం ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే మంచి అధ్యయనం చేసింది. ‘మాల్దా భారతదేశంలోని మఖానా-ఉత్పత్తి బెల్ట్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ దేశంలోని 80శాతం మఖానా (ఫాక్స్ నట్స్) ఉత్పత్తి అవుతుంది. మా ఇంటికి చాలా దగ్గరలో ఈ ఉత్పత్తి ఉండటంతో ఒక గొప్ప అవకాశంగా దీన్ని నేను భావించాను. అలాగే కరోనా తర్వాత తినే తిండి విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. అందుకే ఇది నాకు మంచి రంగంగా అనిపించింది’ ఆమె వివరించారు.
బ్రాండ్‌లు వస్తున్నప్పటికీ…
ముసాడి పదోతరగతిలో ఉన్నప్పుడే అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించింది. మహమ్మారి సంమయంలో ఆమెను కొన్ని భయాలు వెంటాడాయి. అప్పుడు సాంప్రదాయ ఆహార పదార్థాల నుండి తయారు చేయబడిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం వెతకడం ప్రారంభించింది. ఇలాంటి వారి కోసం దివ్య కొత్త ప్రయోగాలు మొదలుపెట్టారు. ‘ఆరోగ్యకరమైన చిరుతిండి విభాగంలో చాలా బ్రాండ్‌లు వస్తున్నప్పటికీ, అవి ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేను వివిధ ప్రాంతాలలో ప్రయాణించాను. జోవర్, మఖానాతో పాటు చాలా మంది ఇతర ఉత్పత్తులను ఇష్టపడతారు. అందుకే వివిధ పంపిణీదారులతో, రిటైలర్లకు నమూనాలను పంపమని అడిగాను’ అంటూ పంచుకున్నారు.
మసాలాలు జోడించి
ఇండియన్ చాట్, చాట్ మసాలా, పుదీనాతో పాటు ఇతర పదార్థాల మిశ్రమం, మెజెస్టిక్ మసాలా, జోవర్ పఫ్‌పై మసాలా, చీజీ సల్సా, టమోటా చీజ్ మిశ్రమం వంటి వాటితో వివిధ రుచులను సమ్మిళితం చేశారు. ‘రుచికరమైన ఆహారం లేదా మీరు ఇష్టపడే వాటిని తినడం మానేయమని మేము మీకు చెప్పడం లేదు. నేను మీకు ఇష్టమైన మసాలాను అందిస్తాను. ఆలూ, మొక్కజొన్న, జొన్న, మఖానా, చిక్‌పా, క్వినోవాకు రుచిని లేదా బేస్‌ని మారుస్తున్నాను. అయితే నేను వేయించడం కాకుండా కాల్చుతాను. అందరూ వీటిని సంతోషంగా తినేలా అందుబాటులో ఉంచుతాను’ అని దివ్య అంటున్నారు. స్నాక్స్‌లో 100 కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. హేకా బైట్స్‌లోని బృందం రాగి (మిల్లెట్)ను కూడా ఒక ఎంపికగా పరిశోధిస్తోంది.
మహిళల బృందం
ప్రస్తుతం హేకా బైట్స్ స్నాక్స్, ట్రైల్ మిక్స్‌లు, నట్ మిక్స్‌లను కలిగి ఉన్న 20 రకాల స్నాక్‌లను అందిస్తోంది. గుమ్మడికాయ గింజలు, చియా గింజలు, మఖానా వంటి ముడి, ప్రాసెస్ చేయని విత్తనాలు కూడా ఉన్నాయి. ఉత్పత్తుల ధర రూ.30 నుండి రూ.500 మధ్య ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వెంచర్ మొదట్లో ముగ్గురు మహిళా ఉద్యోగులతో ప్రారంభించబడింది. ఇప్పుడు 35 మంది మహిళలతో కూడిన టీమ్‌గా ఎదిగింది. హేకా బైట్స్ ఉత్పత్తులు మొదట అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రారంభించబడ్డాయి. ఏడాదిలోనే వారు స్పెన్సర్స్, నేచర్స్ బాస్కెట్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్‌కు కూడా చేరుకున్నారు.
అవగాహాన కల్పించడం
హేకా బైట్స్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్ముడు పోవడం కాస్త కష్టమే అని దివ్య గ్రహించారు. అందుకే ఆన్‌లైన్, శీఘ్ర వాణిజ్యంపై దృష్టి పెట్టారు. »Zepto, Instamarతో త్వరిత వాణిజ్యం మాకు బాగా పనిచేసింది. మూడేండ్లలో మేము 10 రెట్లు వృద్ధిని సాధించా. గత ఆర్థిక ఏడాదిలో రూ.3 కోట్ల నికర ఆదాయాన్ని చూశాము’ అని ఆమె అంటు న్నారు. హేకా బైట్స్ తాను లక్ష్యంగా పెట్టుకున్న ప్రేక్షకులను చేరుకునేందుకు అనేక మార్గాలను వెదుకుతుంది. ‘తల్లులు తమ పిల్లల కోసం ప్రత్యామ్నాయ స్నాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మా ఉత్పత్తుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఈ అవగాహన కల్పించడమే మేము ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాలు’ అని ఆమె పంచుకున్నారు. భౌతిక దుకాణాల్లో కూడా వీటిని అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. తన కోరికను అనుసరించిన వ్యక్తిగా, మహిళలు తమ మార్గంలో ఎదురయ్యే సవాళ్లతో సంబంధం లేకుండా తమ కలలను ఎల్లప్పుడూ వెంబడించాలని దివ్య నమ్ముతుంది.