‘ఏడాది పాలన’లో ఎదురుచూపులే..!

Looking forward to the 'year rule'..!పాలకులు మారితే తమ బతుకులు మారుతాయని కలలుగన్న కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలు పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సంక్షేమ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యమే చూపుతున్నది. దీంతో ప్రమాదకరమైన వృత్తి అని తెలిసినా బతుకుదెరువు కోసం తాటిచెట్లు ఎక్కి కుటుంబాల్ని పోషించుకుంటున్న వారి జీవనం రోజురోజుకూ ప్రశ్నార్థకమ వుతున్నది. గత సర్కార్‌ తమను పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశపడిన వారికి నిరాశే ఎదురవుతున్నది.
రాష్ట్రంలో కల్లు గీతసొసైటీలు 4366, టియఫ్‌టిలు 3709 ద్వారా సభ్యత్వం కలిగిన వారు రెండు లక్షల 18 వేల మంది, వృత్తి చేస్తూ సభ్యత్వం లేనివారు ఇంకా వేలాది మంది ఉన్నారు. సుమారు ఐదు లక్షల కుటుంబాలు వత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏ వత్తిలో లేని ప్రమాదాలు ఒక్క కల్లుగీత వత్తిలోనే ఎక్కువ.ఈ పదేండ్ల కాలంలో దాదాపు 5400మంది ప్రమాదానికి గురయ్యారు. వీరిలో 775 మంది చనిపోయారు. దీన్నిబట్టి గీతవృత్తి ఎలాంటి ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. కల్లు ప్రకతి పానీయం. అనేక ఔషధ గుణాలు కలిగినటువంటిది. స్వచ్ఛమైన కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. శీతల పానీయాలైన థమ్సప్‌, కోకో కోలా, లిక్కర్‌ లాంటివి తాగడం వల్ల ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ఆర్థికంగా కుంగిపోతున్నారు. పైగా మద్యం మత్తులో అరాచకాలకు కూడా పాల్పడుతున్నారు. మహిళలపై లైంగికదాడులు ఆకోవకు చెందినవే.వీటిని అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది.
అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో గీత కార్మికులకోసం సర్కార్‌ చేపట్టిన చర్యల్ని ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే, వత్తిలో ప్రమాదాలను నివారించడానికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ కిట్టును తప్ప మిగతా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. జులై 14న అబ్డుల్లాపూర్‌మెట్‌లోని లష్కర్‌ గూడాలో గీత కార్మికులతో సభ నిర్వహించిన ముఖ్యమంత్రి అనేక హామీలిచ్చారు. అక్కడే కాటమయ్య రక్షణ కవచాన్ని విడుదల చేశారు. అయితే ఈ ఐదు నెలల కాలంలో పదివేల మందికి ఎలా వాడాలో ట్రైనింగ్‌ ఇప్పించి రక్షణ కవచాన్ని పంపిణీ చేశారు.ఇది మంచి విషయమే. కానీ, ప్రభుత్వ లెక్కల ప్రకారమే సభ్యత్వం కలిగిన వాళ్లు రెండు లక్షల 50 వేల మంది గీతకార్మికులు ఉన్నారు. సభ్యత్వం లేకుండా వత్తి చేసేవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొన్ని గ్రామాలకు రక్షణ కవచాలు ఇంతవరకు అందలేదు. వచ్చిన గ్రామాలకు కూడా ఒకటి,రెండు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి మిగతా వాళ్ల పరిస్థితి? వారు రక్షణ కవచాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఈ కాలంలోనే పదహారు మంది గీత కార్మికులు వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి చనిపోయారు. ముందే రక్షణ కవచం ఇచ్చి ఉంటే బతికేవారు కదా? అని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఎన్నికల ప్రణాళికలో వృత్తిలో ప్రమాదవశాత్తు చనిపోయినవారికి, వికలాంగులైన వారికి నెలరోజులలోపు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, పరిహారాన్ని కూడా 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచు తామని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. ఈ ఏడాదికాలంగా చూస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా 7 కోట్ల 90 లక్షల రూపాయలు నేటికీ విడుదల చేయలేదు. బాధిత కుటుంబాలు మాత్రం దు:ఖాన్ని దిగమింగుకుని కుటుంబపోషణకు కూలీపనులు చేసుకుంటూ బతుకులీడు స్తున్నారు. జులైలో జరిగిన సభలోనే ముఖ్యమంత్రి ‘ఈ డబ్బులు ఇప్పుడే విడుదల చేస్తామని’ చెప్పారు. ఐదు నెలలు గడు స్తున్నా ఆచరణకు నోచుకోలేదంటే గీతకార్మికులపై ఈ సర్కార్‌కున్న చిత్తశుద్ది తెలియజేస్తున్నది. ఏజెన్సీ ఏరియాలో వత్తి చేస్తున్న గీత కార్మికుల గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో గొప్పగా మాట్లాడారు. రద్దయిన కల్లుగీత సొసైటీలను పునరుద్ధరిం చాలన్నారు. ఒక అడుగు ముందుకేసి గీత కార్మికులందరికీ చట్ట ప్రకారం షెడ్యూల్‌ ట్రైబ్‌ సర్టిఫికెట్స్‌ కూడా ఇవ్వాలన్నారు.కానీ ఇప్పటివరకు కనీసం సొసైటీల పునరుద్ధరణ గురించి కూడా చర్యలు చేపట్టలేదు.అంటే అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చిన తర్వాత మరోమాటకు సాక్షత్తూ రేవంత్‌రెడ్డియే నిదర్శనం.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనవనంలో గత ప్రభుత్వ హయాంలో నీరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రూ.8 కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయింది. అందుకు సంబం ధించిన మిషనరీ కూడా ఏర్పాటైంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీని పట్ల దృష్టి సారించక పోవడంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనము, మిషనరీ నిరూప యోగంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఐదెకరాలు టాడి కార్పొరేషన్‌కు సంబంధించిన భూమి ఉన్నది. విస్తారంగా తాటి, ఈత చెట్లూ ఉన్నాయి. నీరా, తాటి, ఈత అనుబంధ ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి. వివిధ ప్రాంతాలకు సమద్ధిగా నీరా ను బాటిలింగ్‌ చేసి పంపిణీ చేయవచ్చు. బుట్టలు, బ్యాగులు, దండలు తదితర ఫ్యాన్సీ వస్తువులను తయారుచేసి మార్కెటింగ్‌ చేయవచ్చు. ఫలితంగా గీత కార్మికులకి ఉపాధి కలుగుతుంది.కానీ ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో గీత కుటుంబాలు ఎప్పటిలాగే బతుకులీడుస్తున్నాయి. అలాగే వత్తిలో ప్రమాదాలు జరిగిన వారికి టాడి కార్పొరేషన్‌ నుండి ఇస్తున్న తక్షణ సహాయం దహనసంస్కారాల కోసం రూ.25వేలు, గాయాలైనవారికి రూ.10వేలు బడ్జెట్‌ లేదనే పేరుతో నిలిపేశారు. ఇది సమంజసమేనా? కొత్తగా పథకాలు పెట్టకపోగా ఉన్న సాయాన్ని కూడా అర్థంతరంగా సరైందేనా? వెంటనే ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చెప్పాలంటే ‘బెల్ట్‌ షాపులు పెట్టి మద్యం అమ్మితే బెల్ట్‌ తీస్తామని’ సీఎం అనేక సభల్లో ఉత్సాహభరితంగా ఉపన్యాసమిచ్చారు.ఎన్నికల ప్రణాళికలోనైతే బెల్ట్‌షాపులు పూర్తిగా లేకుండా చేస్తామన్నారు. కానీ ఆచరణలో అమలు మరిచారు.పైగా అదాయం పెం చుకోవడం కోసం ఎక్సైజ్‌శాఖా అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.
యాభై ఏండ్లు నిండిన గీత కార్మికులకు ప్రస్తుతమిస్తున్న రూ.2వేల పెన్షన్‌ను చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించినా అమలుకు నోచలేదు. మద్యం షాపుల్లో ఇస్తున్న 15శాతం రిజర్వేషన్‌ 25శాతానికి పెంచి కల్లుగీత సొసైటీలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ట్యాంక్‌బండ్‌పై సర్వారు పాపన్నగౌడ్‌ విగ్రహం, జనగామ జిల్లాకు ఆయన పేరును పెట్టాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది కాంగ్రెస్‌ పాలనలో కాట మయ్య రక్షణ కవచం మినహా గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ ఏడాది పాలనపై సమీక్షించుకుని ఇప్పటికైనా గీతకార్మికుల సమస్యల్ని పరిష్కరిం చేందుకూ ప్రభుత్వం కృషి చేయాలి.