నష్ట నివారణ చర్యలు చేపట్టాలి

 Loss prevention Actions should be taken– ములుగు జిల్లాలో జూలకంటి, డీజీ పర్యటన
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లాలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌ రెడ్డి తదితరు లతో కూడిన బృందం గోవిందరావుపేట మండలంలోని పస్రా ప్రాజెక్టునగర్‌ గ్రామాల్లో పర్యటించింది. వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లు, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల వరదల్లో కొట్టుకు పోయి మృతి చెంది నేడు దెయ్యాల వాగు సమీపంలో దొరికిన సద్దాం హుస్సేన్‌ మతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పర్యట నలో బాధితులతో మాట్లాడి నష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూలకంటి, డీజీ మాట్లాడుతూ.. పస్రా, రంగాపూర్‌ ప్రాజెక్ట్‌ నగర్‌, మేడారం, రెడ్డిగూడెం, నార్లపురం, దొడ్ల మల్యాల, ఐలాపురం, కొండాపూర్‌ తదితర గ్రామాల్లో సుమారు 2000 నివాస గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న మరో 500 గృహాల మరమ్మత్తులకు సర్వే చేసి ఇంటికి సుమారు రూ.3 లక్షల వరకూ ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో సుమారు 12 వేలకు పైగా ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయన్నారు. విద్యుత్తు మోటార్లు, పంపు సెట్లు, స్టార్టర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు తెలిపారు. వెంటనే సర్వేలు నిర్వహించి ఎకరానికి లెవెలింగ్‌ కొరకు రూ.50 వేలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. జిల్లాలో దెబ్బతిన్న జాతీయ, ఆర్‌ అండ్‌ బీ, పీఆర్‌ రహదారులపై నివేదికలు పంపి యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తులు చేపించాలన్నారు. ప్రాజెక్టు నగర్‌ గ్రామం మళ్లీ వరదలో మునగకుండా ఎత్తయిన ప్రదేశంలో నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పస్రా గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ వాసులకు సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. పర్యటనలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, నాయకులు బీరెడ్డి సాంబశివ, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.