– 71 శాతం మందిది ఇదే పరిస్థితి
– యువకులు, చిన్నవ్యాపారులపై ఎక్కువ ప్రభావం
– సెబీ నివేదిక
న్యూఢిల్లీ: క్యాష్ ఈక్విటీ మార్కెట్లలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో పాల్గొనే వ్యక్తుల సంఖ్య 4.6 రెట్లు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.9 లక్షల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 68.9 లక్షలకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 78.3 లక్షలకు చేరుకున్నది. ట్రేడింగ్ కార్యకలాపాలు ఈ పెరుగుదలతో సమానంగా.. ట్రేడర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వ్యాపారులు డబ్బును కోల్పోయే నిష్పత్తిలో పెరుగుదల ఉన్నది. ఇంట్రాడే ట్రేడింగ్ సిస్టమ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో పాల్గొన్న 70 శాతానికి పైగా వ్యక్తిగత పెట్టుబడిదారులు 2023 ఆర్థిక సంవత్సరంలో నష్టాలను చవిచూశారు. ఇది 2019లో 65 శాతంగా ఉన్నది. ఇంట్రాడే ట్రేడింగ్ కార్యకలాపాల్లో నిమగమైన ట్రేడర్ల సంఖ్య పెరగటానికి అనేక అంశాలు కారణమని మార్కెట్స్ రెగ్యులేటర్ పేర్కొన్నది. నివేదిక సగటు ఇంట్రాడే వ్యాపారిని 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వ్యక్తిగా వివరించింది. అటువంటి వ్యాపారుల శాతం 2019లో 18 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 48 శాతానికి పెరిగింది. ముఖ్యంగా, యువ వ్యాపారులు అధిక సంఖ్యలో నష్టాలకు కారణ మయ్యారు. ”2023 ఆర్థిక సంవత్సరంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తకులు అత్యల్ప నష్టాన్ని కలిగి ఉన్నారు. ఇది 53 శాతం. అయితే 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు అత్యధికంగా నష్టపోయినవారు (81 శాతం)” అని అధ్యయనం హైలైట్ చేసింది.మహమ్మారికి ముందు, తర్వాత కూడా ఈ నష్టాలలో తేడా గణనీయంగా పెరిగింది. నివేదిక ప్రకారం.. స్వల్పకాలిక నష్టాలను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్న చిన్న-స్థాయి వ్యాపారులను మార్కెట్లు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ”2023 ఆర్థిక సంవత్సరం సమయంలో, ఇతర టర్నోవర్ గ్రూపులతో పోలిస్తే ‘వెరీ స్మాల్’ టర్నోవర్ గ్రూప్ అత్యధిక నష్టాలను కలిగి ఉన్నవారిలో (77 శాతం) ఉంది” అని అధ్యయనం పేర్కొన్నది. ‘చాలా పెద్ద వ్యాపారుల’ (వార్షిక టర్నోవర్ రూ. 1 కోటి కంటే ఎక్కువ) టాప్ 5.6 శాతం మొత్తం టర్నోవర్‌లో 90 శాతం, నష్టాల్లో 76 శాతం వాటా కలిగి ఉన్నది. ఇది చాలా చిన్న వ్యాపారుల ట్రేడ్‌లలో తక్కువ నిష్పత్తిని ఏర్పరుస్తుంది. కానీ నష్టాల పరంగా అధిక నిష్పత్తిని కలిగి ఉంటుంది. అయితే చాలా పెద్ద వ్యాపారులు ట్రేడ్‌లలో అధిక నిష్పత్తిని సృష్టించారు.