‘అంధత్వం శరీరానికే కానీ.. మేధస్సుకు ఏ మాత్రం కాదు.’ అని నిరూపిం చాడు లూయిస్ బ్రెయిలీ. అంధులు అంధత్వంతో బాధపడకుండా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించే విధంగా ముందుకు నడి పించే ధైర్యాన్నిచ్చాడు. కష్టపడితే తన దరికి రానిది ఏమీ లేదని, ఆశయంతో ముందుకు సాగాలనే సంకల్పాన్ని పెంపొందించాడు. పద్దెనిమిదో శతాబ్దంలోనే చీకట్లో మగ్గుతున్న అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడు. లూయిస్ బ్రెయిలీ జయంతి నేడు.ఈ సందర్భంగా ఆయన అంధత్వాన్ని జయించి కొత్తలోకాన్ని సృష్టించిన తీరును ప్రతిఒక్కరూ నేడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, సమాజంలో కండ్లుండి కూడా గుడ్డివారుగా జీవిస్తున్న అనేకమందికి లూయిస్ బ్రెయిలీ జీవితం ఆదర్శం.
ప్రపంచంలోని అంధులందరికి అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయ మేధావి అయిన లూయిస్ బ్రెయిలి ఫ్రాన్స్ కు చెందినవ్యక్తి. పారిస్ నగరానికి 20 మైళ్ల దూరంలోనున్న మారుమూలలో రాన క్రూవె గ్రామంలో మౌనిక్ సైమన్ దంప తులకు జనవరి 4, 1809లో జన్మించాడు. తీవ్ర దారిద్య్రరేఖలో ఉన్న నిరుపేద కుటుంబం వారిది. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో చివరి వాడే లూయీస్ బ్రెయిలీ. ఈ దంపతులు వృత్తిరీత్యా చర్మకారులు. లెదర్ ఉపయోగించి జీన్లు, రకాల సామాగ్రి తయారుచేసి చుట్టుపక్క ఊళ్లల్లో అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. లూయీస్ బ్రెయిలీ చాలా చురుకైన వాడు. మూడేండ్ల వయసున్నప్పుడే వాళ్ల అన్న పుస్తకాలు చదివేవాడు. తన తండ్రితో ఒక రోజు గుర్రపు జీన్లు తయారుచేసుకునే వాళ్ల షాపుకు వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తున్నాడు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఓ పదునైన కత్తి ఎగిరి వచ్చి ఒక కంటిలో గుచ్చుకుంది. స్థానిక హాస్పిటల్‌లో వైద్యునికి తల్లిదండ్రులు చూపించారు. బీదరికం కారణంగా మంచి వైద్యం అందిచంలేకపోవడంతో కంటిచూపు మొత్తం పోయింది. మొదట ప్రమాదానికి గురైన కన్ను కొంత కాలానికే ఇన్‌ఫెక్షన్ అయి రెండవ కంటిచూపు తన ఐదోయేటా పూర్తిగా కోల్పోయి అంధత్వానికి దారితీసింది. అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశయంతో లూయీస్ బ్రెయిలిని అక్క,అన్నతో పాటుగా వారి గ్రామంలోనున్న పాఠశాలకు పంపించారు. ఆ పాఠశాలలో లూయీస్ బ్రెయిలీ అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. ఈ ప్రతిభకు అంధత్వం అడ్డురావద్దనే అతని తండ్రి చెక్కపై మేకుల అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. చదువుకోవాలనే పట్టుదలను, అతని తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.
ప్రపంచంలో మొదటగా 1784లో వాలంటీస్ హవే చేత ప్రారంభమైన అంధుల పాఠశాలలో పుస్తకాలు అన్ని కాగితంపై మేకులతో ఉబ్బెత్తుగా చేసి అంధులు తడమడం ద్వారా గుర్తుపట్టేట్లు చేసి విద్యాబోధన చేసేవారు. ఈ పుస్తకాలు పెద్దగా బరువుగా ఖరీదైనవిగా ఉండడం వల్ల వీటి ద్వారా విద్యాభ్యాసం సాధ్యపడేది కాదు. 1821లో చార్లెస్ బార్బీయర్ అనే సైనిక అధికారి సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారాన్ని గుర్తించేందుకు పన్నెండు చుక్కలతో సంకేతలిపిని తయారు చేశారు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ పన్నెండు చుక్కలకు ఆరు చుక్కలు తగ్గించి వాటిని పేర్చుతూ అక్షరాలు ,పదాలు, అంకెలు, సంగీత చిహ్నాలు రూపొందించారు. 1831లో ఆరు చుక్కల లిపిని కనుగొన్నప్పటికి కూడా ప్రశాంతంగా ఉండకుండా నిరంతరం శ్రమిస్తూ 1839లో సున్నితమైన సులభతరమైన డెకాపా యింట్ అను కొత్త పద్ధతిని ఉపయోగించారు. పేపరుపై రంధ్రాలు సులభంగా చేసే పద్ధతిని కనిపెట్టి బ్రెయిలీ లిపిని అభివృద్ధి పరిచాడు. లూయీస్ మంచి సంగీత విధ్వాంసుడు. ఇతను 1834 – 1839 వరకు ఫ్రాన్స్ దేశంలోనున్న చర్చిల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడు. వాలంటీస్ హలే చనిపోయిన తర్వాత అనంతరం వచ్చిన అంధుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా వచ్చినటువంటి డాక్టర్ అల్గెండర్ ప్రాన్సిస్ లూయీస్‌ను చరిత్ర పుస్తకాన్ని మొత్తం బ్రెయిలి లిపిలోకి అనువాదం చేసినందుకు తన ఉద్యోగం నుండి తీసేసాడు. లూయిస్ బ్రెయిలీ నాడు ఎంతో కష్టపడి సాధించిన ఈ లిపి నేడు అంధులకు చాలా ఉపయోగకరంగా మారింది. ఈ లిపి ద్వారా అంధులు ఇతరులు సహాయం లేకుండా వారు చదవగలరు, రాయగలరు. అంధులకు జ్ఞాన వెలుగులు ప్రసాదించిన లూయీ బ్రెయిలీ 1852 జనవరి 6న 43 ఏండ్ల వయసులోనే చనిపోయారు. ఆయన మరణ శతాబ్ది సందర్భంగా లూయిస్ బ్రెయిలీ పేరుతో అమెరికా డాలర్‌ను, ఇండియా రెండు రూపాయల నాణేన్ని విడుదల చేసి గౌరవించాయి.
(నేడు లూయిస్ బ్రెయిలి జయంతి)
పి.రాజశేఖర్
9490098018