స‌ముద్ర‌మంత ప్రేమ‌

Love is like an oceanఎనిమిదో క్లాసు చదివే వినయ్ గత మూడు రోజులుగా స్కూలుకు వెళ్ళట్లేదు. ఇంట్లో వాళ్ళు అడిగితే, వొంట్లో బావుండటం లేదనీ, వెళ్ళాలి అనిపించడం లేదని చెప్తూ వస్తున్నాడు.
కానీ అసలు కారణం అది కాదు. రెండక్షరాల ఫీలింగ్‌, మూడక్షరాల పేరున్న అమ్మాయి.
”అబ్బే, పన్నెండేండ్లకు ప్రేమేంటి, వెర్రి కాకపోతేనూ, మహా అయితే అట్రాక్షన్‌ అయి ఉంటది, ఈ మాత్రం దానికి స్కూల్‌ మానేయాలా? నాలుగు తన్ని స్కూలుకి తరమండి” అనే వాళ్ళకి వినయ్ దగ్గర బయటకి చెప్పని సమాధానం/ ప్రశ్న ఒకటి ఉంటుంది.
వాళ్ళ క్లాస్‌లో, అదే సెక్షన్‌లో ఇంకా పద్నాలుగు మంది అమ్మాయిలున్నారు. ‘వాళ్ళెవరిమీదా కలగని ఆ ఫీలింగ్‌, ఆ అమ్మాయి మీదే ఎందుకు కలిగింది?”
వినయ్ అడిగింది నిజంగా చాలా అవసరమైన ప్రశ్నే. చాలా సినిమాల్లో సరదాగా అడిగేసినా, ఇప్పుడు అదొక జోక్‌గా మారిపోయినా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అది.
మనకి తెలీదు. తెలిసినా చెప్పే ప్రయత్నం చేయము. చేసినా ‘అద్దంలో కొండను చూపించి చిన్నగా ఉంది’ అన్నట్లే ఉంటుంది ఆ యవ్వారం.
”ఆ, ఇలాంటివి ఎంకరేజ్‌ చేయండి, ఆ మూడో వీధి చివర్న ఉండే పండుగాడు, హేమ నో చెప్పిందని చేసిన అఘాయిత్యమే అందరు పిల్లలూ చేస్తారు” అని అరిచేవాళ్ళు చాలా మంది ఉంటారు.
అఫ్‌ కోర్స్‌! వాళ్ళు అరవడంలోనూ పెద్ద ఆశ్చర్యమేమీ లేదనుకోండి. మనల్ని మనం హింసించుకోవడం కూడా మర్డర్‌ తో సమానమే మరి.
అయితే ఆ అరిచే వాళ్ళకి ఆపోజిట్‌గా పండు తరఫున వాదించే వాళ్ళున్నారండోయ్!

వాళ్ళు ఒకటే అంటారు, ”సమస్య గురించి మాట్లాడకుండా, విషయం గురించి అవగాహన కలిగించకుండా, పరిష్కారమో, జ్ఞానోదయమో ఎలా కలిగిస్తామండీ” అని.
ఓ రకంగా అది నిజమే కావొచ్చు. పదిహేడేండ్ల తన జీవితంలో లేని అమ్మాయి, తన జీవితంలోకి రానని చెప్పినదానికి తనని తాను శిక్షించుకోవడం వెర్రితనమే,
కానీ అంత వెర్రితనానికి ఉసిగొల్పిన ఆ ఫీలింగ్‌ ఏంటనే విషయం గురించి కదా మనం ఎక్కువ మాట్లాడాల్సింది?
ప్రేమనే దానికి వయసుతో సంబంధం ఉండదు. మొగుడు ఒకరోజు కండ్ల ముందు కనబడకపోయేసరికి కన్నూ మిన్నూ తెలియకుండా బస్సెనక పరిగెత్తుకుంటూ పుట్టింటి నుంచి అత్తింటికి పరిగెత్తుకుపోయిన నరసమ్మ కావొచ్చు, శిరీషతో మాట్లాడడానికే భయం పుట్టి స్కూలు మానేసిన వినయ్ కావొచ్చు, నో చెప్పిందని కొంచెం ఘాటుగా ప్రవర్తించి గాట్లు పెట్టుకున్న పండుగాడు కావొచ్చు, అందరి కామన్‌ ఎజెండా ప్రేమనే.
ప్రపంచంలో ఎన్నో బంధాలుండగా ప్రేమ మాత్రమే ఎందుకు గొప్పదై కూర్చుంది? ఎందుకు ప్రేమ పాటలు రాగానే ప్రేమలో లేని వాడు కూడా ప్రేమించిన వాడికంటే ఎక్కువ బాధపడిపోతూ ఉంటాడు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు కావు. వీటికి సమాధానాలు ఉన్నాయి. కాసేపు వెతికే ప్రయత్నం చేద్దాం.
చాలా మంది చెప్పినట్లుగా, ప్రేమనేది ఒక స్పెషల్‌ ఫీలింగ్‌. ప్రేమ తాలూకు ప్రతి భావం, అంటే ప్రేమ ద్వారా కలిగే ప్రతీ ఉద్వేగం – సంతోషం, భయం, బాధ దుఃఖం, అన్నీ మన మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి.
మనకు నచ్చిన వాళ్ళ పక్కన ఉన్నప్పుడు కలిగే ఆనందం కాస్త ఎక్కువ మోతాదులో ఉంటే, ఆ నచ్చిన వాళ్ళు మనకు ఎక్కువ నచ్చేస్తున్నారని అర్థం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికీ మనమేమీ ఆనందపడిపోము. వీళ్లతో ఉండటం బావుంది అనిపించిన వాళ్ళతోనే ఆ ఆనందమైనా, సంతోషమైనా.
ఇంత ఆనందం, మనం పొందలేము అనే అనుమానం వచ్చినా, పొందే అవకాశం మనకు లేదని తెలిసినా, పొందటానికి మన అహాన్ని ఒకరి ముందు పణంగా పెట్టాలి అనే చేదు నిజం అవగతమైనా, ఆ నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడతాం.
దీన్నే Fear of Losing అంటారు. వినయ్ స్కూలుకెళ్ళక పోవడానికి కారణమదే. శిరీషను తను ఫేస్‌ చేయలేడు.
ఎంతో ఆశతో చేతిలో రోజా పువ్వు, గ్రీటింగ్‌ కార్డు పట్టుకెళ్ళి ధైర్యంగా ప్రపోజ్‌ చేసినా, అవతలి వాళ్ళకి భయం వల్లనో, ఈ ప్రేమ మీద నమ్మకం లేకనో, అసలు ఈ రిలేషన్స్‌ మీద ఆసక్తి లేకనో నో చెప్తే, తీసుకోలేం అనే భయం కూడా చాలా మందికి ఉంటుంది.
దీన్ని Fear of Rejection అంటారు. చాలా ప్రేమ కథలు వన్‌ సైడెడ్‌గా మిగిలిపోవడానికి కారణం ఈ భయమే.

ధైర్యం చేసి చెప్పాలనుకున్నా, ఏమనుకుంటారో అని భయం, చెప్పాక నో చెప్తే రేపట్నుంచి ఎలా బతకాలో అనే భయం, ఈ భయాలన్నింటినీ కలిగించేది ఒక్క ”ప్రేమే”.
ఈ భయం తాలూకు మోతాదు ఎక్కువైనా పర్లేదు గానీ, భయం కోపమూ, బాధగా మారినప్పుడే పండుగాడు లాంటివాళ్ళు అలాంటి పనులకి పాల్పడతారు.
అయితే ఇప్పటిదాక మనం మాట్లాడింది ప్రేమల్లో ఒకవైపు ప్రేమల గురించే.
ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే సంఘటనలు, సంఘర్షణలు ఇవన్నీ ఇంకో రకమైన కోవకు చెందినవి.
షోయబ్‌, జెన్నాలు ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెండ్లి చేసుకుందాం అనుకున్నారు. మొదట్లో ఇద్దరూ బానే ఉండేవాళ్ళు. మెల్ల మెల్లగా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవ పడినపుడు ఎందుకు పడ్డాం అని ఆలోచించే వాళ్ళు కాస్తా, ఎవరు మొదలెట్టారు అని ఆలోచించడం ప్రారంభించారు. అలా ఆలోచిస్తే చివరకు ఏం మిగులుతుంది, సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎవరి దారి వాళ్ళదే.
వీళ్ళు విడిపోతారని చుట్టూ ఉన్న ఎవ్వరూ అనుకోలేదు. మెల్లగా షోయబ్‌ను ప్రశ్నిస్తే, ఇంకా ప్రేమ అయితే ఉందని, అదెప్పటికీ పోదని అంటాడు. చిత్రంగా జెన్నా కూడా అదే మాట అంటుంది. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు చెరో పెండ్లి చేసుకోకుండా ఇద్దరూ ఒక్కటవ్వొచ్చుగా అని అడిగితే, షోయబ్‌ ఏమో, దూరంగా ఉన్నప్పుడే బావుంది ఈ ప్రేమలో అంటాడు. జెన్నా అయితే మూవ్‌ ఆన్‌ ఐపోయాను అంటుంది గానీ, ప్రతిరోజూ ఫేస్‌బుక్‌లో మెమోరీస్‌ను చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది.
ఇద్దరు మనుషులు ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకోవడానికి కారణమైన అంశాలు, మెల్లగా ఒకరితో ఒకరు సమయం ఎక్కువ గడపడానికి కారణమైనవిగా మారుతుంటాయి. లేదా ఒకరిమీద ఒకరికి వెగటు పుట్టించడానికి కూడా కారణాలవుతాయి.
ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రేమల గురించి కూడా మాట్లాడాలి.
ఒక మనిషి ఒకేసారి ప్రేమలో పడుతాడు అని ఎవరైనా అంటే ఆమె/ అతనికి వీలైనంత దూరంగా పారిపోండి. ఎందుకంటే ప్రేమనేది ఒక ప్రాసెస్‌. ఒకరితో బ్రేకప్‌ అయ్యాక ఇంకొకరి మీద ప్రేమ కలిగేందుకు అస్సలు అవకాశమే లేదంటే అది అక్షరాలా అసత్యం.
ప్రేమ ఇంత విశ్వవ్యాప్తమైనది అయినప్పుడు దాన్ని ఒకరికి మాత్రమే పంచి సచ్చిపోతాం అంటే దాన్ని పిచ్చిగాక ఇంకేమంటారు?
నమ్మకం లేని చోట ఏ రిలేషన్‌ ఉండనట్లే ప్రేమ కూడా ఉండదు. ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటం లాంటి నమ్మక ద్రోహాలు కాకుండా, జీవితంలో ఒకరి తర్వాత ఒకరి మీద ప్రేమ కలగటం అనేది చాలా మామూలు విషయం. ఒకవేళ అలా మనకు ఎవరి మీదా ప్రేమ కలగట్లేదంటే విపరీతమైన ప్రేమ రాహిత్యంలో ఉండాలి మనం. అది ఎవరికీ అంత మంచిది కాదు.
ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళ తప్పుల్ని కూడా చాలా సులభంగా క్షమించేయాలి అనిపిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని మనకు నచ్చిన వాళ్ళకోసం ఎదిరించొచ్చు అనిపిస్తుంది.
అందుకేనేమో ప్రేమలో ఉన్నోల్లని పిచ్చోళ్ళు అంటుంటారు.
జోసెఫ్‌ పాతికవేల జీతం అతను అరెంజేడ్‌ మేరేజ్‌ చేసుకున్న కొత్తలో, కవితను సంతోషంగా ఉంచడానికి సరిపోయేది. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పట్నుంచి కాస్త ఇబ్బందులు మొదలయ్యాయి.
సరదాగా టీ కొట్టు దగ్గర టీ తాగుతూ ఉన్న జోసెఫ్‌ ను ఇప్పుడు పలకరిస్తే, నవ్వాడు. ఏంటా నవ్వని అడిగితే ప్రేమలో ఉన్నానన్నాడు. ఆశ్చర్యం వేసింది,పెళ్ళయ్యాక ప్రేమేంటని. ఏ పడకూడదా? ఇవాళే మా ఆవిడకి ప్రొపోజ్‌ చేసాను అన్నాడు. అరెంజేడ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాక రెండేండ్లకు భార్యపై ప్రేమ కలిగిందా అని ఎగతాళి చేస్తే, ప్రేమకు పర్ఫెక్ట్‌ డెఫినిషన్‌ అతని దగ్గరే దొరికింది.
ప్రేమనేది, మనకు నచ్చిన అలవాటుకు ఇంకా ఎక్కువ అలవాటుపడటం. ఒక మనిషి సాహచర్యాన్ని నువ్వు బాగా కోరుకుంటున్నావ్‌, ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తోందనుకో, ఇదే సాహచర్యాన్ని జీవితాంతం కొనసాగించాలి అనిపిస్తే అదే ప్రేమన్నాడు జోసెఫ్‌.


నేను జోసెఫ్‌ తో ఏకీభవిస్తాను. ఎనిమిదో క్లాస్‌ లో ప్రేమనేది ఆకర్షణకి కాస్త ఎక్కువ కావొచ్చు, టీన్స్‌లో హార్మోన్ల ప్రభావం కావొచ్చు, ఇరవైలలో అవసరం కావొచ్చు. ముప్పైకి చేరువలో ఉన్నవాళ్ళని అడిగినా, ఆపైన ఎవ్వరని అడిగినా ఈ మధ్య మూకుమ్మడిగా చెప్తున్నా మాట అయితే, ప్రేమనేది ఒక కంపానియన్‌ షిప్‌. నా వరకు ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌ షిప్‌ కి హద్దులు లేకుండా చెరిపేస్తూ కలిసి బతికితే అదే ప్రేమ, వ్యక్తుల్ని వాళ్ళ ప్లస్సులూ, మైనస్సులుగా విడగొట్టకుండా మొత్తంగా ఇష్టపడి, ప్లస్సుల నుంచి నేర్చుకుంటూ, మైనస్సుల ని కూడా ప్లస్సులుగా మార్చుకునేలా చేయగలిగినదే ప్రేమంటే.
ఇదే ఇంకొకర్ని అడగండి, కచ్చితంగా వేరే సమాధానం లభిస్తుంది. లభించాలి కూడా, లేకపోతే ప్రేమనేది ఇన్నిరోజులు ఒక టాపిక్‌గా ఉండేదే కాదు.
ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ప్రేమను అర్థం చేసుకోవాలంటే, దాన్ని గౌరవించాలి, దాని తీరును అర్థం చేసుకోవాలి. గౌరవం అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది.
ప్రేమలో గౌరవం ఏంటి కామెడీగా అనుకుంటే చివరికి మన ప్రేమకథే కామెడీ అవుతుంది.
ప్రేమ గురించి మాట్లాడుతూ విరహం గురించి మాట్లాడకపోతే అది తప్పే అవుతుంది. దూరం మనుషుల మధ్య పెరిగితే ప్రేమ తగ్గుతుందా? అని ఎవరైనా అడిగితే యస్‌ ఆర్ నో అనే రెండు సమాధానాలూ లభిస్తాయి. ఈ విరహంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు, సాహచర్యాన్ని మిస్‌ అవుతున్నాం అనే బాధతోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రేమ వల్ల కలిగే బాధ తట్టుకోవడం చాలా ముఖ్యం.


ఎందుకంటే ప్రేమ అనే అనుభూతిని సరిగ్గా అర్థం చేసుకుంటే, దాని వల్ల నష్టపోకుండా, ఆనందాన్ని పొందే మార్గం కనుక్కోవచ్చు.
నరసమ్మ వెతుక్కుందిగా?
జోసెఫ్‌ కనుక్కున్నాడుగా?
జెన్నా అలవాటు పడుతోందిగా?
మీరూ వెతకండి ప్రేమను, దొరకొచ్చు, ఏమో ఎవరికి తెలుసు? మీకు ఆల్రెడీ దొరికి ఉండొచ్చు !
(ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా..)

– సుదర్శన్‌ బూదూరి
9550816625