ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమ ఒక్కటుంటే చాలు… ఇంకేమీ అవసరం లేదు అనుకుంటారు చాలా మంది. కానీ వాస్తవానికి కలిసి కలకాలం జీవించడానికి, బంధం బలంగా ఉండటానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ప్రేమ ముఖ్యమైనదే అయినా దాంతో పాటు మరికొన్ని ఉంటాయి. అవి ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరినొకరు గౌరవించు కోవడం, కమ్యూనికేషన్, క్వాలిటీ సమయం కేటాయించుకోవడం, నీకు నేనున్నా అనే భరోసా ఇవ్వడం. కాబట్టి వీటిని పదిలంగా చూసుకోవల్సిన బాధ్యత ఆ ఇద్దరిపై ఉంటుంది. నిజానికి వారి మధ్య ఉన్న ప్రేమ నిజమైనదే అయితే ఇవన్నీ కచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఒక్కరు మాత్రమే బాధ్యతగా ఉండి ఇంకొకరు నిర్లక్ష్యంగా ఉంటే ఆ బంధంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ వారం ఐద్వా అదాలత్‌లో చూద్దాం…
సృజనకు సుమారు 45 ఏండ్లు ఉంటాయి. పెండ్లి జరిగి 23 ఏండ్లు అవుతుంది. పాప, బాబు ఉన్నారు. సృజన ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త ప్రమోద్ కూడా గతంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ప్రస్తుతం ఏమీ చేయడం లేదు. కరోనా సమయంలో ఆ సంస్థ మూతపడటంతో అతని ఉద్యోగం పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు. సృజన ఉద్యోగం చేసి వచ్చిన డబ్బుతోనే సర్దుకుంటున్నారు. దాంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పటి నుండే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఉద్యోగం చేడయం లేదు. ఇంట్లో ఉండడం లేదు. సృజనతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. అవసరం ఉంటేనే మాట్లాడతాడు. ఆమెను దగ్గరకు కూడా రానీయడం లేదు. పైగా అనుమానిస్తున్నాడు. ఏ బధం అయినా బలంగా ఉండాలంటే మూడు ‘టి’లు. అంటే టైమ్, ట్రస్ట్, టచ్. ఇవి కచ్చితంగా ప్రతి రిలేషన్‌షిప్‌లో ఉండాలి. ఏ బంధానికి అయినా నమ్మకం అనేది పునాదిగా ఉండాలి. ఆ పునాది ఎంత బలంగా వుంటే ఆ బంధం అంత బలంగా ఉంటుంది. ఆ నమ్మకం ప్రయోద్‌కు తగ్గిపోయింది అనేది సృజన బలంగా నమ్ముతుంది. ఇలాంటి సమయంలోనే ఆమె ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ‘నాతో మాట్లాడడం లేదు, దగ్గరకు రానీయడం లేదు. ఆయనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఏదైనా బిజినెస్ లేకపోతే షాప్ ఏదైనా పెట్టుకోవచ్చు. అది కూడా చేయడం లేదు. ఆ మధ్య ఇదే విషయంపై గొడవ జరిగితే ఒక రెండు నెలలు వేరే దగ్గర ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చి ఇచ్చారు. ‘నీకు కావలసింది డబ్బే కదా! నా ప్రేమ నీకు అవసరం లేదు. డబ్బు వుంటేనే అన్ని బాగుంటాయి లేక పోతే లేదు’ అంటూ తిడుతున్నాడు.
ప్రేమ మాత్రమే ఉంటే సరిపోతుందా! మనం బతకడానికి తినాలి కదా! అది ఎక్కడి నుండి వస్తుంది అంటే వినిపించుకోడు. ‘పెండ్లికి ముందు నాకు ఏమీ వద్దు నీవు, నీ ప్రేమ ఉంటే చాలు ఉన్నావు. ఇప్పుడు మాత్రం ప్రేమ ఒక్కటే వుంటే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలి అంటున్నావు. కాబట్టి నీతో ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు డబ్బులతో అవసరం కాబట్టి అవే తెచ్చి ఇస్తాను’ అంటూ రెండు నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగం కూడా మానేశారు. అసలు ప్రమోద్ ఎందుకు ఇంతగా మారిపోయాడో అర్థం కావడం లేదు. పిల్లల చదువు పూర్తి కావొస్తుంది. పాపకి పెండ్లి చేయాలి. ఇలాంటి సమయంలో ప్రమోద్ ప్రవర్తతో చాలా ఇబ్బందిగా వుంది. మీరు అతనితో మాట్లాడి మాకు ఒక దారి చూపించండి’ అంటూ బాధపడింది.
మేము ప్రమోద్‌ను పిలిపించి మాట్లాడితే ‘మాది ప్రేమ వివాహం. పెండ్లికి ముందు నాకు ఏమీ వద్దు, నీవు నీ ప్రేమ వుంటే చాలు. నీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు. నీ ప్రేమ లేకపోతే నేను బతకలేను’ అని చెప్పింది. ఇప్పుడేమో ‘నీకు బాధ్యత లేదు, దేని గురించి పట్టించుకోవు’ అంటుంది. నాకు అర్థం అయింది ఏమిటి అంటే ఆమెకు నా ప్రేమ కన్న డబ్బులు మాత్రమే కావాలి. అందుకే ఇన్ని రోజులు నేను ఉద్యోగం చేసినపుడు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇప్పుడు ఉద్యోగం చేయడం లేదు, డబ్బులు రావడం లేదు కాబట్టి గొడవ చేస్తుంది. ఇక్కడి వరకు వచ్చింది. సరే మేడం, నేను ఆమెకు డబ్బులు తెచ్చి ఇస్తాను సరిపోతుంది కదా! అలాగే చేస్తాను’ అన్నాడు.
దానికి మేము ‘ప్రేమ అంటే ఏమిటి మీ దృష్టిలో. ప్రేమ ఉంది అని మాటల్లో చెప్పడం కాదు. నిజంగా మీకు ప్రేమ ఉంటే బాధ్యతగా ఉండేవారు. కానీ మీరు అలా లేరు. భార్య పట్ల, పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. వారి అవసరాలు తీర్చాలి. మీరు ఉద్యోగం మానేసి నాలుగేండ్లు అవుతుంది. అప్పటి నుండే కదా మీ మధ్య గొడవలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనపుడు సాధారణంగా ఇలాంటి సమస్యలే వస్తాయి. నేను ఉద్యోగం చేయడం లేదు కాబట్టే నాపై ప్రేమ తగ్గింది అనుకుంటున్నారు. మరి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి కదా! మీ పిల్లలకు ఓ దారి చూపించాల్సిన బాధ్యత మీదే కదా! అలా ఎందుకు ఆలోచించడం లేదు. ఇదేనా మీ ప్రేమ. పైగా మీకు మీ భార్యపై నమ్మకం లేకుండా పోయింది. ప్రేమ పేరు చెప్పి బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారు. ప్రేమ అంటే మనం ప్రేమించే వారి పట్ల బాధ్యతగా ఉండడం. ముందు ఏదైనా ఉద్యోగం చేసుకోండి. అలాగే సృజన కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. మీ సమస్యలు అన్నీ దూరమవుతాయి’ అని చెప్పాము.
దానికి అతను ‘సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. కచ్చితంగా ముందు ఉద్యోగం చూసుకుంటాను. కరోనా సమయంలో ఉద్యోగం పోయిన తర్వాత నాకు ఉద్యోగంపైనే ఆసక్తి పోయింది. ఆ చిరాకులో ఏదేదో ఆలోచించాను. మీరు చెప్పింది నిజమే. ఆర్థిక సమస్యల వల్లే మా మధ్య గొడవలు వస్తున్నాయి. ఇకపై మీరు చెప్పినట్టు చేస్తాను. నా భార్యను, పిల్లలను సంతోషంగా చూసుకుంటాను’ అని చెప్పి సృజనను తీసుకొని వెళ్లాడు.