క్యూబా సోషలిస్టు విప్లవానికి 65 ఏండ్లు
క్యూబా సోషలిస్టు విప్లవం 66వ ఏడాదిలో ప్రవేశించింది. 1953 జూలై 26న నియంత బాటిస్టా పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటు 1959 జనవరి ఒకటిన విప్లవోద్యమ నేత ఫిడెల్ కాస్ట్రో అధికారానికి రావటంతో ముగిసింది. ఐదు సంవత్సరాల, ఐదు నెలల, ఐదవ రోజు 1958 డిసెంబరు 31న బాటిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేశారు. విప్లవాన్ని మొగ్గలోనే తుంచి వేసేందుకు వెంటనే అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రారంభించి, క్రమంగా తీవ్రతరం కావించింది. నాటి నుంచి నేటి వరకు అక్కడ ఏనుగు పార్టీ (రిపబ్లికన్)-గాడిద పార్టీ(డెమోక్రటిక్) ఎవరు అధికారంలో ఉన్నా మానవాళి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ దిగ్బంధనం కొనసాగుతూనే ఉంది. అమెరికాకు క్యూబా కూతవేటు దూరంలో ఉంది. రెండు దేశాల సమీప భూభాగాల మధ్య దూరం కేవలం 90 మైళ్లు లేదా 145 కిలోమీటర్లు మాత్రమే. కరీబియన్ సముద్ర మెక్సికో అఖాతం, అట్లాంటిక్ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉన్న కోటీ 12లక్షల జనాభాతో ప్రధాన భూ భాగానికి అనుబంధంగా 4,195 చిన్నా, పెద్ద దీవులు ఉన్న దేశం. నవరంధ్రాలు మూసివేసి ప్రాణాలు తీసినట్లుగా అన్ని రకాల దిగ్బంధాలతో అక్కడి జనాన్ని మాడిస్తే వారు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ ఒడిలో కూర్చుంటారని 65 ఏండ్లుగా అమెరికా చూస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యానికి తలొగ్గకుండా ఆత్మగౌరవంతో పితృదేశమా (కొన్ని దేశాలు పితృసామిక వ్యవస్థను అనుసరించి అలా పిలుచుకుంటాయి.దేశ భక్తిలో ఎలాంటి తేడా ఉండదు) లేక మరణమా అన్న ఆశయంతో ముందుకు సాగుతున్నది.
క్యూబా విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది. కమ్యూనిస్టుల నాయకత్వాన విముక్తి పోరాటాలు జరగటం అధికారానికి రావటం సాధారణంగా జరిగింది. అదే క్యూబాలో అధికారానికి వచ్చిన తరువాత కాస్ట్రో తదితర విప్లవకారులు కమ్యూనిస్టులుగా మారారు.1952లో ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకోవటాన్ని సహించని మిలిటరీ జనరల్ ఫల్లునేసియో బాటిస్టా కుట్రద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన ప్రజాస్వామికవాదుల్లో కాస్ట్రో ఒకరు. కొంత మంది కోర్టులో సవాలు చేసి బాటిస్టాను గద్దె దింపాలని చూసి విఫలమయ్యారు.తరువాత 1953 జూలై 26న సోదరుడు రావుల్‌తో కలసి కాస్ట్రో తదితరులు మంకాడా మిలిటరీ బారక్స్ మీద విఫల దాడి చేశారు. దాంతో వారందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అక్కడే జూలై 26 ఉద్యమం పేరుతో సంఘటితమయ్యారు. కేసు విచారణ సందర్భంగా కోర్టులో రెండు గంటల పాటు కాస్ట్రో తిరుగుబాటు కారణాలను వివరించి దేశమంతటా ప్రాచుర్యం పొందారు.పౌరుల్లో వచ్చిన సానుభూతిని చూసిన తరువాత తిరుగుబాటు చేసిన వారిని విడుదల చేసి ప్రజామద్దతు పొందాలని బాటిస్టా క్షమాభిక్ష ప్రకటించాడు. విప్లవకారులు మెక్సికో, తదితర దేశాలకు ప్రవాసం వెళ్లి 1956లో తిరిగి గ్రాన్మా అనేక నౌకలో తిరిగొచ్చారు.(తరువాత కాలంలో ఆ నౌక పేరుతోనే పత్రిక నడుపుతున్నారు) మెక్సికోలో పరిచయమైన చే గువేరా కూడా వారితో వచ్చాడు. బాటిస్టా మిలిటరీ వారిని ఎదుర్కోవటంతో సియెరా మెస్ట్రా అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ బాటిస్టాను వ్యతిరేకించే పాపులర్ సోషలిస్టు పార్టీ వంటి వారందరినీ కూడా గట్టి దాడులకు దిగారు.చివరికి 1958 డిసెంబరు 31న విజయం సాధించటంతో బాటిస్టా దేశం వదలి పారిపోయాడు. 1959 జనవరి ఒకటిన కాస్ట్రో అధికారానికి వచ్చాడు.జూలై 26 ఉద్యమం పేరుతో ఉన్న వారు కీలక పాత్ర పోషించారు. తర్వాత మార్క్సిజం-లెనినిజాన్ని ఆమోదించి 1965 అక్టో బరులో క్యూబా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విప్లవంలో కీలక ఘట్టమైన జూలై 26వ తేదీని విప్లవదినంగా పరిగణించారు.
‘మేం వైద్యులను ఎగుమతి చేస్తాం, తప్ప బాంబులను కాదని’ అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ఎయిర్స్ నగరంలో 2003లో క్యూబా అధినేత ఫిడెల్ కాస్ట్రో చెప్పాడు. ‘మా దేశం ఇతర దేశాల పౌరుల మీద బాంబులు వేయదు లేదా నగరాల మీద బాంబులు వేసేందుకు వేలాది విమానాలను పంపదు. మాకు అణు, రసాయన లేదా జీవ ఆయుధాలు లేవు. ప్రాణాలను రక్షించేందుకు లక్షలాది మంది వైద్యులను మా దేశంలో తయారు చేశాము. మనుషులను చంపే బాక్టీరియా, వైరస్, ఇతర పదార్ధాలను సృష్టించేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులను తయారు చేయాలనే అవగాహనకు భిన్నంగా మేము పని చేస్తున్నాము’ అని కాస్ట్రో ఆ సభలో చెప్పాడు. హవానా నగరంలో నిర్వహిస్తున్న లాటిన్ అమెరికా మెడికాలేజీ 25వ వార్షికోత్సవాన్ని నవంబరు నెలలో నిర్వహించారు. ”జీవిత సంరక్షకులు-మెరుగైన ప్రపంచ సృష్టికర్తలు” అనే ఇతివృత్తంతో ఒక సదస్సును ఏర్పాటు చేశారు. సామాన్య జనం కోసం వైద్యం చేయాలనే లక్ష్యంతో అనేక దేశాల నుంచి విద్యార్థులు అక్కడ చేరుతున్నారు. కరీబియన్ ప్రాంతం లోని దేశాలకు తరచూ వస్తున్న హరికేన్‌ల వలన జరుగు తున్న అపార నష్టాన్ని చూసిన తరువాత అలాంటి సమయాల్లో వైద్యుల అవసరాన్ని గుర్తించి ఈ కాలేజీని ప్రారంభించారు. మొత్తం లాటిన్ అమెరికా, కొందరు ఆఫ్రికా, అమెరికా నుంచి కూడా వచ్చి చేరుతున్నారు.
గత పాతికేండ్లలో 120దేశాలకు చెందిన వారు 31,180 మంది వైద్యులుగా తయారు కాగా ప్రస్తుతం 1,800 మంది విద్యార్ధులు న్నారు. హవానాకు పశ్చిమంగా ఉన్న నౌకా కేంద్రాన్ని కాలేజీగా మార్చారు. మొదటి రెండేండ్లు అక్కడ ఆసుపత్రులతో అవసరం లేని బోధన చేస్తారు. నాలుగేండ్ల పాటు క్యూబాలోని బోధనా ఆసుపత్రు లలో శిక్షణ ఇస్తారు. ఈ కాలేజీ విద్యార్థి, ప్రస్తుతం హోండూరాస్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేస్తున్న లూథర్ కాస్టిలో హారీ పాతికేండ్ల వార్షికోత్సవంలో మాట్లాడుతూ అసాధ్యాలకు వ్యతిరేకంగా పోరాడినపుడే సుసాధ్యాలతో లబ్ది పొందుతామని, ప్రతి ఒక్కరూ క్యూబా విప్లవ రాయబారిగా పనిచేస్తూ ప్రపంచంలో అతి గొప్ప శాస్త్రీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించాడు. హరికేన్ కారణంగా చేపడుతున్న సహాయ చర్యల కారణంగా ఈ ఉత్సవానికి హాజరు కాలేకపోయిన క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ సందేశాన్ని పంపారు. మీ మీ దేశాలలో జీవితాల, ఆరోగ్య సంరక్షకులుగా తయారైన మిమ్మల్ని చూసి ఫిడెల్ కాస్ట్రో బతికి ఉంటే ఎంతో సంతోషించేవారన్నాడు. మూడంచెల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగంగా 69 వైద్య ప్రత్యేక చికిత్స కేంద్రాలు, 149 ఆసుపత్రులు, 451పాలిక్లినిక్‌లు, 11,315 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతివెయ్యి మందికి -మొత్తం 80వేల మంది-ఒక వైద్యుడు లేదా వైద్యురాలు ఉన్నారు. పదమూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 2,767 వైద్య పరిశోధనా ప్రాజెక్టులు, 82క్లినికల్ ప్రయోగాలు నడుస్తున్నాయి. నూటఅరవై దేశాలలో ఆరులక్షల మంది క్యూబన్లు వైద్య సేవలందిస్తున్నారు.
క్యూబా సర్కార్ జనానికి అందిస్తున్న సబ్సిడీ ఆహార పథకాన్ని ‘అదిగో రద్దు చేస్తున్నారు ఇదిగో రద్దు చేస్తున్నారంటూ’ గత రెండు దశాబ్దాలుగా అమెరికా, దాని ఉప్పు తింటున్న మీడియా కథనాలు రాస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో దుర్వినియోగం జరిగినపుడు పథకాన్ని సవరించటం గురించి మాట్లాడారు తప్ప ఎత్తివేత గురించి కాదు. ఉదాహరణకు ప్రతినెలా 18 ఏండ్లు దాటిన వారికి ఆహార వస్తువులతో పాటు 80 సిగరట్లు కూడా నామమాత్ర ధరలకు సరఫరా చేసే వారు. కొందరు పొగతాగని వారు వాటిని తీసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకొనే వారు. ఇలాంటి వాటిని అరికట్టాలను కోవటం సబ్సిడీ ఎత్తివేత కిందకు రాదు. సోవియట్, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలు కూలిపోయిన తరువాత క్యూబా అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. అవి ఉనికిలో ఉన్నపుడు కూడా ఉన్నదేదో కలసి తింటాం లేకుంటే కాళ్లు ముడుకు పడుకుంటాం తప్ప అమెరికా ముందు చేయిచాచం అని ఫిడెల్ కాస్ట్రో దశాబ్దాల క్రితమే చెప్పారు. దానిలో భాగంగానే ఆహార సబ్సిడీ-పంపిణీ పధకాన్ని ప్రారంభించారు. దాన్నే రేషన్ బుక్ అని పిలుస్తున్నారు. ప్రతి ఏటా ఒక పుస్తక రూపంలో కూపన్లు ఇస్తే దుకాణాల్లో వాటితో సరకులు తీసుకుంటారు.1962 నుంచి ఈ పథకం అమల్లో ఉంది.ప్రతి ఒక్కరికీ ప్రతినెలా బియ్యం, బీన్స్, బంగాళాదుంప, అరటికాయలు, బఠాణీ గింజలు, కాఫీ, వంటనూనె, గుడ్లు, మాంసం, కోడి మాంసం, పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు.2010 వరకు సబ్సిడీ ధరలకు సిగిరెట్లు కూడా సరఫరా చేశారు. ఈ మధ్య పోషకాహారలేమి వలన క్యూబాలో మరణాల రేటు 2022 నుంచి 2023కు 74.42శాతానికి పెరిగిందంటూ కొన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలను ఇచ్చాయి.అక్కడ సంభవిస్తున్న మరణాలకు కారణాలలో పోషకాహార లేమి 20వదిగా ఉంది. ఇంతకూ పైన పేర్కొన్న సంవత్సరాలలో మరణించిన వారి సంఖ్య 43నుంచి 75కు పెరిగింది (74.42 శాతం). కోటి మంది జనాభా, అష్టకష్టాలు పడుతూ,80శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న అక్కడ మరణాలు అవి. ప్రపంచానికి ఆహారాన్ని అందచేసే స్థితిలో ఉన్నామని మన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మన దేశంలో 140 కోట్ల జనాభాలో పోషకాహార లేమి కారణంగా ఎందరు మరణిస్తున్నారో తెలుసా! హిండ్‌రైజ్ డాట్ ఓఆర్‌జి సమాచారం ప్రకారం మనదేశంలో రోజుకు ఏడువేల మంది మరణిస్తున్నారు. ఐదేండ్లలోపు వయస్సున్న పిల్లల మరణాలలో 69శాతం పోషకాహార లేమి కారణమని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టుకు 2022లో తెలిపింది.ఒక సోషలిస్టు వ్యవస్థకు అంతకంటే మెరుగైనది సర్వేజనా సుఖినో భవంతు సమాజం ఉంది అనుకుంటున్న మన వ్యవస్థకు ఉన్న అంతరం ఏమిటో వేరే చెప్పాలా?
మన దేశంలో ఆహార భద్రతా చట్టం అమల్లో ఉంది. దానిలో భాగంగా 80 కోట్ల మందికి గతంలో సబ్సిడీ బియ్యం లేదా గోధుమలు ఇవ్వగా ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అయినా మనదేశం 2024 ప్రపంచ ఆకలి సూచిక 127దేశాలలో 105వదిగా ఉంది. పదేండ్ల అచ్చేదిన్‌లో ఆకలి తీవ్రంగా ఉన్న దేశాల సరసన మనదేశాన్ని ఉంచిన ఘనత ‘విశ్వగురువు’ నరేంద్రమోడీకి దక్కింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ డాట్‌కామ్ సమాచారం ప్రకారం 171దేశాల జాబితాలో మన దేశంలో పోషకాహార లోపం ఉన్నవారు 2011లో 18.35 కోట్ల మంది ఉంటే, 2023లో 19.46 కోట్ల మందికి పెరిగారు. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. పోషకాహార లేమి నామమాత్రంగా ఉన్నప్పటికీ ఆయా దేశాలలో 2.5శాతం మంది ఉన్నట్లు లెక్కిస్తారు. అలాంటి దేశాల జాబితాలో చైనా, క్యూబా ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. మనదేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ దాన్ని గుర్తించటానికి మోడీ సర్కార్ ససేమిరా అంటున్నది. క్యూబా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటానికి, ఇతర సమస్యలకు కారణం అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనమే. ఆంక్షలను తొలగించాలని ప్రతియేటా ఐరాసలో తీర్మానం పెట్టటం, అమెరికా, దాని తొత్తు ఇజ్రాయిల్ వ్యతిరేకించటం మిగిలిన దేశాలన్నీ సమర్థించటం తెలిసిందే. అయితే ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాలకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేదు. వాటిని దిక్కరించిన దేశాలను చేసేదేమీ లేదు. అమెరికా దిగ్బంధనం వలన ప్రపంచంలో మరోదేశమేదీ క్యూబా మాదిరి నష్టపోవటం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది ? ప్రపంచ మంతటా కమ్యూనిజాన్ని అరికడతానంటూ బయలు దేరిన అమెరికన్లకు తమ పెరటితోట వంటి క్యూబాలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండటం అవమాన కరంగా మారింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమలు జరిపిన కఠిన ఆంక్షలను సడలిస్తానని జో బైడెన్ ప్రకటించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు, పదవీ కాలం ముగియనుంది, తిరిగి ట్రంప్ గద్దె నెక్కనున్నాడు. అమెరికా దిగ్బంధనం కారణంగా ప్రతి నెలా క్యూబా 42 కోట్ల డాలర్లు నష్టపోతున్నదని అంచనా, ఎన్నాళ్లీ దుర్మార్గం!
ఎం.కోటేశ్వరరావు
8331013288