పర్యాటకులతో కిక్కిరిసిన లక్నవరం పర్యాటక కేంద్రం

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని లక్నవరం పర్యాటక కేంద్రం ఆదివారం  పర్యాటకులతో కిటకిటలాడింది. ములుగు జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాలు హైదరాబాద్ ఇతర రాష్ట్రాల రాజధానుల నుండి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో లక్నవరం పర్యాటక కేంద్రం అందాలను తిలకించారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు చార్జీలు లేకపోవడం వల్ల కూడా పర్యాటక కేంద్రానికి మహిళ పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చినట్లు ఆ శాఖ అధికారులు తెలుపుతున్నారు. చార్జీల ద్వారా ఆదాయం రాకపోయినా పర్యాటక కేంద్రానికి తరలివచ్చినందున ఈ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మహిళా పర్యాటకులు కూడా నేరుగా లక్నవరం పర్యాటక కేంద్రానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సెలవు రోజు కావడంతో సహజంగానే పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుందని వారికి అవసరమైన ఏర్పాట్లను చేయడంలో అధికార సిబ్బంది నిమగ్నమై ఉన్నారని అన్నారు. మరో రెండు నెలల పాటు పర్యాటక కేంద్రానికి పర్యాటకుల తాకుటి ఉంటుందని మేనేజర్ శంకర్ తెలిపారు. ఫిబ్రవరిలో మేడారం జాతర ఉన్నందున అప్పటివరకు నిరంతరంగా పర్యాటకులు లక్నవరం పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తూ లక్నవరం అందాలను వీక్షిస్తుంటారని తెలిపారు.