సామం!

Baggage!లోలోపల..
వివేకినన్న భ్రమలున్నప్పుడు
కండ్లు నెత్తిలకెక్కుతయి!

నాల్కె తిమతిమ..
అతి నోటి దురద..
మాటలు కోటలు దాటుతరు !
తోపు,సిపాయి పదాలు
పల్లవులై మారుమోగుతరు !!

దృష్టి సరిగా లేనప్పుడు
గ్రహణ సంక్లిష్టత సహజం !
నువ్వెంత ఏకాగ్రత పెట్టి
కట్టెల మంట పెట్టినా..
గాలివాటం ఎటుంటదో సెప్పలేం!?

ఒక ఇంటికి
రెండు ప్రవేశద్వారాలున్నప్పుడు
ఒకవైపు తలుపులు మూసేస్తే
రెండోవైపో గొళ్ళెం వుండే ఉంటది!

మీతిమీరిన..
మాటకారితనం వెకిలిప్రక్రియ !
సింప్లిసిటీ..
అగ్ర శిఖరాగ్ర సమానం !!

నిప్పులు..
ఎగదోసుకోవడం ఎంతసేపు!
కలుపుకుపోవడమే
జీవనది అంతిమ పరమార్థం!!

కనీస సహ,ఎరుకలేని
ప్రగల్భ సందర్భాలు
శవాలమీద పేలాల లెక్క !
మనిషిని పురుగులెక్క సూత్తరు !!
పరిణతి,పరిగణన పూరకాలు!

తపన,తండ్లాట మంచిదే
పొయ్యి,పొగ,దర్ప శపథాలు..
మాటైనా,సేతైనా..
నవ్వైనా,నడకైనా
నలుగురు నొచ్చుకోవద్దు కదా!

సామం..
సర్వమోద మాధుకరం !
భేదం ఎదలకు ఖేదం !!
– అశోక్‌ అవారి,
సెల్‌ : 9000576581