– మాజీ ఎమ్మెల్యే ఆరోపణలతో కలకలం…
– స్థానిక ఎన్నికల వరకు సర్దుకుంటుందా…?
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ముందే గత సార్వతిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నాయకుల తీరు మారటం లేదని కార్యకర్తలు బహిరంగంగా పేర్కొంటున్నారు. ముధోల్ నియోజకవర్గం లో పార్టీని పూర్వ వైభవం తేవడానికి కృషి చేయాల్సిన నాయకుడే సదరు పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పై ఆరోపణలు, విమర్శలు గుప్పించడం తాజాగా చర్చా నీయ అంశంగా మారింది. విరాల్లోకెళ్తే… ముధోల్ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే గత రెండు పర్యాలుగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో చతికిల పడిపోయింది. అయితే తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ ముధోల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర అధిష్టానం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ నియోజకవర్గ నాయకుల అదిపత్య పోరుతో, తగాదాలతో పార్టీని బజారుకీడుస్తున్నారన్న ఆరోపణలు సీనియర్ కార్యకర్తల నుండే సర్వత్రా వినిపిస్తున్నాయి. అయినా పార్టీ నాయకులపై పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని ఆరోపణ చేస్తే పార్టీ దెబ్బతింటుందని సొంత పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ముందే నియోజకవర్గంలో బలంగా ఉన్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలు మరింత నాటుకపోవటానికి ఊతమిచ్చినట్టు అయిందని పలువురు కార్యకర్తలు బహిరంగంగా పేర్కొంటున్నారు. తాజాగా గత రెండు రోజుల క్రితం ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ముధోల్ లో సిసి రోడ్డును పనులను పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి గతంలో పనిచేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేయటం చర్చకు దారితీసింది. సదరు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి నెలలు గడుస్తున్న గతంలో అబివృద్ధి చేయలేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేయడంపై సొంత పార్టీ కార్యకర్తల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేయటం సరికాదని ముధోల్ మడల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఖండించారు. అంతేకాకుండా ఒకే పార్టీలో ఉంటు నాయకులపై విమర్శలు చేస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని కాంగ్రెస్ మండల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్ని లేపాయి. రాజకీయాల్లో అపార అనుభవమున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పై కావాలనే ఆరోపణలు చేశాడా,లేక అనుకోకుండా అన్నాడా అన్న విషయం తేలాల్సింది. కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవటం గతంలో తరచు జరుగుతుండేది.అయితే సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా సీనియర్ నాయకులు కూడ మాట జరటం లేదు. అయినా ముధోల్ లో మాత్రం మాజీ ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో అభివృద్ధి చేయలేదని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆరోపించడం నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లో అదిపత్య పోరు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేదో వేచి చూడాలి మరి..!