‘పీపుల్‌ ఫార్మసీ’ పథకాన్ని పునరుద్ధరించిన లూలా

బ్రసీలియా : బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా ‘పీపుల్‌ ఫార్మసీ’ ప్రభుత్వ పథకం కొత్త వెర్షన్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. ప్రజలకు మందులను ఉచితంగా, తక్కువ ధరకు అందించనున్నట్టు ప్రకటించారు. చాలామంది బ్రెజీలియన్లు ప్రిస్కిప్షన్‌ ఉన్నా మందులు కొనేందుకు డబ్బులేక చనిపోతున్నారని, ఇకపై తమ దేశంలో ఇలా జరగదని స్పష్టం చేశారు. పీపుల్స్‌ ఫార్మసీ ప్రజలందరి కోసం మరిన్ని మందులతో, ఎక్కువ మంది వైద్యులతో, ఫ్యామిలీ బ్యాగ్‌ ప్రోగ్రామ్‌తో తిరిగి వస్తోందని అన్నారు. ఈ పథకంతో 40 మందులను ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉచిత కేటగిరీతో పాటు ఇతర ఫార్మసీల్లోని ధరలతో పోలిస్తే 90శాతం వరకు తగ్గింపుతో మందులను అందించనున్నట్టు తెలిపారు. 2004లో లూలా మొదటిసారి బ్రెజిల్‌ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. డయాబెటిస్‌, ఆస్థమా, హైపర్‌ టెన్షన్‌ సహా 13 రకాల మందులను ప్రజలు ఉచితంగా పొందే అవకాశం కలిగించారు. అనంతరం బోల్సెనారో ప్రభుత్వం ఈ పథకం పరిధిని తగ్గించింది.