నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) అధ్యక్షులుగా ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన 77వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్థిక కార్యదర్శిగా ఆట సదయ్య, అసోసియేట్ అధ్యక్షులు పది మంది, ఉపాధ్యక్షులు 24 మంది, అదనపు ప్రధాన కార్యదర్శులు పది మంది, కార్యదర్శులు 24 మంది, ఆర్థిక కమిటీ సభ్యులు ఎనిమిది మందిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ ఉన్నతి, లక్ష్య వంటి వినూత్న ప్రక్ర్రియల పేరుతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించడానికి ఈ ప్రక్రియలు అడ్డంకిగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ యాప్‌ల అమలు పేరుతో బోధనేతర కార్యక్రమాలు, డేటా సేకరణకు అధిక సమయం వెచ్చించాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయోజనం లేని ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి కొందరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ల పేరుతో ఎస్‌సీఈఆర్టీలో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఆ ఉపాధ్యాయులను వెంటనే పాఠశాలలకు పంపించాలని డిమాండ్ చేశారు. కొన్ని ఎన్జీవో సంస్థలు, ఎస్‌సీఈఆర్టీలో చొరబడి ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలివ్వడం అధికారుల అలసత్వానికి నిదర్శనమని తెలిపారు. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలనీ, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు.
డిసెంబర్ 2 వరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశమివ్వాలి
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వచ్చేనెల రెండో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను సోమవారం హైదరాబాద్‌లో వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలింగ్ మరుసటి రోజు వచ్చేనెల ఒకటిన ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి సెలవు ప్రకటించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడామనీ, ప్రతి ఒక్క ఉద్యోగీ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారని తెలిపారు. పోలింగ్ మరుసటి రోజు సెలవు ఇవ్వనున్నట్టు ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు.