నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలో నడుస్తున్న ప్రజాపాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని రంగాల్లో మహిళలను అభివద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందు కు తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలను అమల్లోకి తెచ్చామని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు, హక్కులు దక్కాలని రేవంత్ ఆకాంక్షించారు. వారి అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని కొత్త కార్యక్రమాలను చేపడుతామన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.,