– ఇండ్ల స్థలాల కోసం భారీ ర్యాలీ
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మానుకోటలో మహాధర్నా
– ఇండ్ల స్థలాలిచ్చే వరకు పోరాటం
– గుడిసెవాసులపై అక్రమ కేసులు ఎత్తేయాలి : సీపీఐ(ఎం) నేతలు జి.నాగయ్య , ఎస్.వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
ఇండ్ల స్థలాలకు పట్టాల కోసం పేదలు కదం తొక్కారు. సీపీఐ(ఎం) అండగా మహబూబాబాద్ జిల్లా మానుకోటలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం మహాధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వెనక పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చేవరకు సీపీఐ(ఎం) పోరాడుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుంకరి వీరయ్య స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కుమ్మక్కైన అధికారులు ఆ భూములను కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని, తక్షణమే పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని, గుడిసె వాసులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్
చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని సర్వేనెంబర్ 255/1, 287, 551లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్ధార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టి తహసీల్దార్ భగవాన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పార్టీ పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం అధ్యక్షత నిర్వహించిన ధర్నాలో జి.నాగయ్య, ఎస్.వీరయ్య ప్రసంగించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు మానుకోటంలో 5000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, అందులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 400, 500 ఎకరాల్లో పేదలకు భూములు పంచి ఇచ్చారన్నారు. మిగిలిన భూములను ఈ పదేండ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూమాఫియాదారులు అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇండ్లు, స్థలాలకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కుర్చీలు సర్దుకోకముందే బీఆర్‌ఎస్ నాయకులు మహబూబాబాద్ పట్టణంలో అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భవనాన్ని ఆక్రమించుకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలస్యమైన కొద్దీ మానుకోటలో ప్రభుత్వ భూములు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జాలోకి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కలెక్టరేట్ కార్యాలయం వెనుక సర్వేనెంబర్ 287/1లో ఏడాది నుంచి 3000 మంది పేదలు గుడిసెలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కుమ్మక్కై పేదలపై 18సార్లు దాడులు చేశారని చెప్పారు. పదిమంది మహిళలపై క్రిమినల్ కేసులు, 150మందిపై బైండోవర్ కేసులు పెట్టి వేధించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మానుకోటలో కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీల చుట్టూ ఉన్న భూమి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. గతంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో పేదలు పట్టాల కోసం ధర్నా నిర్వహించారని, శంకర్‌నాయక్ వచ్చి పేదలకు భూములు పంచుతానని, పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి మోసగించాడని అన్నారు.
పేదలకు భూములు దక్కాలని, ఇండ్ల్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని తమ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించి అప్పటి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో మాట్లాడారని చెప్పారు. తక్షణమే ఆ భూముల సర్వే నిర్వహించి పేదలకు పట్టాలు, ఇండ్లు ఇవ్వాలని, సంక్రాంతి పండుగ తర్వాత పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుత కలెక్టర్ ఆ భూమిలో సర్వే చేసి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు.
భూ పోరాటంలో పేదలపై పోలీసులు పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, వెంటనే ఆ దిశగా పోలీసు యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్ వెనుక పేదలు వేసుకున్న గుడిసెల ప్రాంతాన్ని అటవీ శాఖకు కేటాయించినట్టు కలెక్టర్ చెబుతున్నారని, ఆ భూమి ప్రభుత్వ భూమి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, కందునురి శ్రీనివాస్, సమ్మెట రాజమౌళి, కుర్ర మహేష్, దుడ్డుల రామ్మూర్తి, కుంట ఉపేందర్, నక్క సైదులు, చీపిరి యాకయ్య, రావుల రాజు, చాగంటి భాగ్యమ్మ, కుమ్మరి కుంట నాగన్న, తోట శ్రీనివాసు, ఎర్ర శ్రీనివాస్, బానోతు వెంకన్న, బూర్గుల లక్ష్మణ, యమగాని వెంకన్న, శ్రీరాం నాయక్ పాల్గొన్నారు.