నవతెలంగాణ – నర్సంపేట: చారిత్రక పాకాల సరస్సు మత్తడి పరవళ్లు పలులోలెవల్ కాజ్ వేల వద్ద వరద ప్రవాహం.. నిలిచిన రాకపోకలు నల్లబెల్లి లో 29.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం.. చరిత్రలో రికార్డు స్థాయిలో నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు.. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్, ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు మత్తడి పరవళ్లు తొక్కుతోంది.. డివిజన్ వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.. చెరువులు పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలుఅవుతున్నారు.. మాధన్నపేట పెద్ద చెరువు కట్టపై చెట్టు కూలింది.17 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ చెరువు మత్తడి నాలుగు అడుగుల ఎత్తులో అలుగు పెడుతూ కనుల విందు చేస్తుంది.. రానున్న రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున చెరువుకు కట్టకు గండి పడే ప్రమాదం లేకపోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆర్డీవో కృష్ణ వేణీ, తహసీల్దార్ రాంమూర్తి కట్ట ప్రదేశాన్ని సందర్శించారు. కట్టకు ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే నర్సంపేట -నెక్కొండ ప్రధాన రహదారిపై ముగ్ధంపురం వద్ద లోలెవల్ కాజ్ వే వద్ద వాగు ప్రవాహంతో ఐదు అడుగుల ఎత్తులో పోతున్నందున రాకపోకలు నిలిచాయి..ఈ మార్గంలో దాదాపు రెండు మండలాల ప్రజలకు,ఇతర ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం స్తంభించిపోయింది.. మాధన్నపేట వట్టెవాగు వద్ద రాకపోకలు నిలిచిపోగా 12 గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడింది. గురిజాల పెద్దం చెరువు లోలెవల్ కాజ్ వే ప్రవాహం వద్ద తీవ్ర స్థాయిలో ఉన్నందున రాకపోకలు రెండ్రోజుల నుంచి ఆగిపోయాయి.6గ్రామాల ప్రజలు నర్సంపేట, వరంగల్ పట్టణాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక పాకాల చెరువు మత్తడి పడుతుందన మరో 24 గంటల్లో అశోక్ నగర్ వద్ద లోలెవల్ కాజ్ వే వద్ద ఉధృతి పెరిగి కొత్తగూడ మండలం, ఇల్లందు మార్గాలకు వాహనాలు ఆగిపోయే అవకాశం ఉంది.