మార్క్సిస్టులు దిద్దిన‌ మధిర

Madhira corrected by Marxists– అంతర్గత రహదారులు, ప్లైఓవర్‌ బ్రిడ్జీలు
– చివరి ఆయకట్టునూ తడిపిన ఎన్నెస్పీ
– అప్పటి అభివృద్ధితో పోల్చుకుని నేటి పాలకులపై జనం విమర్శలు
– బోడేపూడి సుజల స్రవంతితో తీరిన దాహం
– మధిరంటే ఎరుపు.. మార్క్సిస్టు ఎమ్మెల్యేలతోనే నియోజక వర్గానికి మెరుపు. అభివృద్ధి
– బాటలు పరిచి.. అంతర్గత రహదారులు.. ప్లైఓవర్‌ బ్రిడ్జీలు నిర్మించి..
ఎన్నెన్నో మెరుగులు.. మధిర రూపురేఖలను మార్చిన చరిత్ర సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట నర్సయ్యది. పాలించింది 20 ఏండ్ల పాటైనా  చిరకాలం గుర్తుండి పోయే ప్రగతికి మూలం మార్క్సిస్టులు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మధిర నియోజకవర్గ ప్రగతిలో మార్క్సిస్టుల పాత్ర ఎనలేనిది. 2009 పునర్విభజనకు ముందు జనరల్‌ స్థానంగా ఉన్న మధిర నియోజకర్గంలో వైరా, తల్లాడ, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం మండలాలు ఉండేవి. ఆ తర్వాత వైరా నూతన నియోజకవర్గ కేంద్రంగా ఆవిర్భవించగా.. తల్లాడ సత్తుపల్లిలోకి వెళ్లింది. వీటి స్థానంలో చింతకాని, ముదిగొండ మండలాలు వచ్చి చేరాయి. మధిర నియోజకవర్గాన్ని ఓ ప్రణాళికబద్ధంగా మార్క్సిస్టు ఎమ్మెల్యేలు ముందుకు నడిపారు. 1985లో తొలిసారిగా సీపీఐ(ఎం) నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన బోడేపూడి వెంకటేశ్వరరావు వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కట్టా వెంకటనర్సయ్య విజయం సాధించారు. ఏడాదిపాటు పదవీకాలం తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా.. 2004లో తిరిగి కట్టా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 21 ఏండ్లు కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న మధిర ప్రగతి వారితోనే నిలిచిపోయిందని చెప్పాలి.
దాహం తీర్చిన ‘సుజల స్రవంతి’
కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కంటే దాదాపు 15 ఏండ్ల ముందే మార్క్సిస్టులు ముందుచూపుతో బోడేపూడి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. ఫ్లోరైడ్‌ రహిత మంచినీటి పథకాన్ని నెలకొల్పారు. 170 గ్రామాల మధిర నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బోడేపూడి వెంకటేశ్వరరావు హయాంలో ప్రణాళిక రూపొందించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో మాట్లాడి సుజల స్రవంతి పథకానికి బోడేపూడి కృషి చేశారు. ఆయన మరణానంతరం బోడేపూడి ప్రతిపాదించిన రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఆయన పేరునే దీనికి పెట్టింది. వైరా రిజర్వాయర్‌ ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ మంచినీటి పథకాన్ని 25.10.2002న ప్రారంభించారు.
మహామనిషి పేరును తుడిచేసే యత్నం..
టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోడేపూడి సుజల స్రవంతి పేరును మిషన్‌ భగీరథ పథకంగా మార్చేందుకు యత్నించింది. వైరా, మధిర నియోజకవర్గాల్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకులపై మిషన్‌ భగీరథ పేరు రాయించడంపై అభ్యంతరాలు, నిరసనలు వెల్లువెత్తాయి. వైరా ప్రాజెక్టు గుట్టలపై బోడే పూడి సుజల స్రవంతి పథకం ఫిల్టర్‌బెడ్స్‌ పేరును కూడా మార్చేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దానితో వెంటనే వెనక్కి తగ్గారు. ఉమ్మడి నియోజక వర్గంలో విద్యా, సహకార రంగాల అభివృద్ధికీ బోడేపూడి చేసిన కృషి నేటికీ ప్రశంసలు అందుకుంటోంది.
సాగు నీటి కల్పనలోనూ దిట్టలు
బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట నర్సయ్య మధిర, వైరా నియోజకవర్గాల్లో సాగునీటి కల్పనలోనూ ఘనతికెక్కారు. పగలనక రేయనక ఎన్నెస్పీ కాల్వల వెంట తిరుగుతూ ఓ రైతు పొలానికి నీరిచ్చేందుకు ఎంత శ్రద్ధ తీసుకుంటాడో.. అంతకుమించి చివరి ఆయకట్టుకు ఎన్నెస్పీ జలాలు అందేలా మార్క్సిస్టు ఎమ్మెల్యేలు చేసిన కృషి నేటికీ చిరస్మరణీయం. ప్రస్తుత పాలకుల్లో చిత్తశుద్ధి లోపించిన కారణంగా ఎన్నెస్పీ సాగునీరు అందక రైతులు ఆందోళన బాట పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా వైరా ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద కూడా రైతులు నిరసన తెలిపారు. 200 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న జమలాపురం చెరువును పర్యాటకంగా సాగునీటి పరంగా అభివృద్ధి చేస్తానన్న ప్రస్తుత ఎమ్మెల్యే భట్టి.. 50 ఎకరాల ఆయకట్టు ఉన్న మామునూరు చెరువును అభివృద్ధి
చేయడం విమర్శలకు తావిస్తోంది. తన పొలాల కోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. కానీ నాటి సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు స్వీయలాభం చూసుకోకుండా
పనిచేశారు.
నిర్లక్ష్యం నీడలో మరికొన్ని అభివృద్ధి పనులు
సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు చేసిన పనులే పనులు. ఆ తర్వాత నియోజకవర్గం నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికైన ప్రస్తుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కగానీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన జడ్పీ చైర్మెన్‌ లింగాల కమలరాజ్‌గానీ చిరకాలం గుర్తుండే అభివృద్ధి పనులేవీ చేపట్టలేదు. ఖమ్మం టూ బోనకల్‌ రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయం అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. నాడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేల కాలంలో నిర్మించిన బోనకల్‌- రావినూతల ప్లైఓవర్‌ను సైతం పాలకులు పట్టించుకోవట్లేదు. నాడు నిర్మించిన గ్రామీణ అంతర్గత లింకు రోడ్లు, పొలాలకు వెళ్లే రహదారుల ఆలనాపాలనా పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పట్లో నిర్మించిన పక్కా గృహాలే తప్ప కొత్తగా వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాలు లేవు. మధిర పట్టణంలో జనాభా పెరిగిన ఆ నిష్పత్తిలో అభివృద్ధి లేదు. డ్రెయినేజీలు, డంపింగ్‌ సమస్య ఉంది. అప్పట్లో శంకుస్థాపన చేసిన తోళ్ల పరిశ్రమ ఊసేలేదు. మధిరలో విలీనం చేసిన మడుపల్లి పంచాయతీ బాగోగులను పట్టించుకున్న నాథుడు లేడు. నాడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధే కానీ నేటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జడ్పీ చైర్మెన్‌ చేసిన అభివృద్ధి శూన్యమనే విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.